ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి : నాగిరెడ్డి
ప్రజాపక్షం / సూర్యాపేట : ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి అన్నారు. మూడు విడతలుగా జరిగే ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారుల ను ఆదేశించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ గెస్ట్‌హౌస్‌లో జిల్లా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ టి. చిరంజీవులు, కలెక్టర్ డి. అమయ్ కుమార్, ఎస్‌పి ఆర్.వెంకటేశ్వర్లుతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జిల్లాలో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పండుగ వాతావరణంలో నిర్వహించే బాధ్యత అధికారులదేనన్నారు. ముఖ్యం గా జిల్లాలో ఇప్పటి వరకు గుర్తించిన సమస్యాత్మక, అతిసమస్యాత్మక గ్రామాల్లో పెద్ద మొత్తంలో పోలీస్ బలగాలను దింపి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల అనంతరం కౌంటింగ్ సమయంలో పెద్ద గ్రామ పంచాయితీలో ఫలితాలు వచ్చేసరికి రాత్రి అయ్యే అవకాశాలున్నాయని, అలాంటి గ్రామ పంచాయతీలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అవసరమైతే జనరేటర్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ సమయంలోనూ పోలింగ్ బూతులలో ఎక్కువ వెలుతురు ఉండేలా విద్యుత్‌దీపాలు అమర్చాలని ఆదేశించారు. అనంతరం చివ్వెంల మండల కేంద్రంలో పోలింగ్ అధికారులకు నిర్వహిస్తున్న రెండవ విడత శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ అధికారులు, సిబ్బంది ఎంతో చురుగ్గా ఎన్నికల శిక్షణలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవులు మాట్లాడుతూ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు నియమించిన నోడల్ అధికారులు, ఎన్నికల అధికారులను సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఎన్నికల ప్రచారాలకు వినియోగించే మైకులకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు అనుమతి ఇవ్వాలన్నారు. కలెక్టర్ అమయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. అందు లో భాగంగా జోనల్ అధికారులను సహాయ ఎన్నికల ఖర్చుల పరిశీలకులను, ఫ్లుయింగ్ స్కాడ్స్ బృందాలను, వీడియో వివీంగ్, వీడియో సర్వే లైన్ టీంలు, ఆకౌంటింగ్ టీంలను నియామకం చేసి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.