సిపిఐ పిలుపు
పెంచిన పెట్రోలు ధరలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్
న్యూఢిల్లీ: ఎడతెగకుండా కొన సా గుతున్న పెట్రోలు,డీజిలు ధర ల పెరుగుదలను నిలిపివేయాలని, పది రోజులుగా పెంచిన ధరలను వెనక్కు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది. పెంచిన పెట్రోలు, డీజిలు, వంటగ్యాస్ ధరలను వెనక్కు మళ్ళించాలని కోరుతూ దేశవ్యాప్తంగా పార్టీ శాఖలు ఏప్రిల్ 4 నుండి 10వ తేదీ వరకూ వారం రోజులు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపు ఇచ్చింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ఈ మేరకు గురువారంనాడు ఒక ప్రకటన విడుదల చేశారు. వారం రోజులపాటు దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమం చేపట్టాలని సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం పిలుపు ఇచ్చిందని రాజా ఆ ప్రకటనలో తెలియజేశారు. పార్టీ శాఖలు స్వతంత్రంగా గానీ లేదా అవకాశం ఉన్నచోట భావసారూప్యతగల పార్టీలతో కలిసి ఈ నిరసన ప్రదర్శనలు వారం రోజులు కొనసాగించాలని పేర్కొన్నారు. ఎడతెగకుండా, నిరంతరాయంగా ధరలు పెంచడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం తీవ్రంగా ఖండించిందని రాజా పేర్కొన్నారు. తక్షణం ఈ ధరలను వెనక్కు మళ్లించాలని పార్టీ డిమాండ్ చేసింది. వరుసగా పదోరోజు గురువారంనాడు (మార్చి 31) కూడా మరోసారి ధరలు పెంచారని పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెట్రోలు ధరలు ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలోనూ రూ.100 లు దాటిపోయాయని,ముంబయిలో లీటరు పెట్రోలు ధర రూ.116.72లు, డీజిలు ధర రూ.100.94లకుచేరుకుందని, అన్ని మెట్రో నగరాలకంటే ముంబయిలోనే ఈ ధరలు అత్యధికంగా ఉన్నాయని పార్టీ కార్యదర్శివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్,గోవా,పంజాబ్,మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాలుగున్నర నెలలపాటు పెట్రోలు ధరలు పెంచకుండా తొక్కిపట్టి ఉంచారని, పాలకుల కుటిల ఆలోచనలను ప్రజలు ఇప్పటికైనా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని రాజా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఓట్ల ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసమే ఇలా చేశారని విమర్శించారు. చివరకు పైపుల ద్వారా ఇంటింటికీ సరఫరా చేసే వంటగ్యాస్ ధరలు కూడా గణనీయంగా పెంచేశారని, బిజెపి కాషాయ కూటమికి ప్రజలు పడుతున్న బాధలతో ఏ మాత్రం సంబంధం లేకుండా వ్యవహరిస్తోందని, ప్రజల బాధలు వారికి పట్టడం లేదని విమర్శించారు.ఈ విధంగా పెట్రోలు,డీజిలు ధరలను రోజువారీ ప్రాతిపదికపై అవిశ్రాంతంగా పెంచుతూ పోతే దాని ప్రభావం అన్ని రంగాలపైనా ప్రజల నిత్యజీవన విధానంపైన ఉధృతమైన ప్రభావం చూపిస్తుందన్న వాస్తవాన్ని కూడా మోడీ ప్రభుత్వం విస్మరించిందని రాజా విమర్శించారు. పదిరోజులుగా పెంచుతూ వచ్చిన ధరలను వెంటనే వెనక్కు మళ్ళించాలని, పాత ధరలనే అమలులోకి తీసుకురావాలని సిపిఐ కేంద్ర కార్యదర్శివర్గం డిమాండ్ చేసిందని రాజా పేర్కొన్నారు.ధరల నియంత్రణ యంత్రాంగాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కే సిపిఐ కట్టుబడి ఉందన్నారు. ప్రజల నిత్యజీవితాలపై తీవ్ర ప్రభావం చూపించే ఈ విధమైన ధరలపెరుగుదలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఇష్టాష్టాలకే వదిలేయడం సరైన చర్య కాదన్న విషయాన్ని గుర్తెరగాలని కోరారు.
ఏప్రిల్ 4 నుండి 10 వరకు దేశవ్యాప్త నిరసనలు
RELATED ARTICLES