HomeNewsBreaking Newsఏప్రిల్‌ 14 తరువాత..?

ఏప్రిల్‌ 14 తరువాత..?

లాక్‌డౌన్‌ ఎత్తేస్తారా? కొనసాగిస్తారా?
గడువు సమీపిస్తుండడంతో దీనిపైనే అందరి దృష్టి
అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆందోళన
హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను తగ్గించేందుకూ భారతదేశం మొత్తం లాక్‌డౌన్‌లో కొనసాగుతోంది. మార్చి 22 జనతా కర్ఫ్యూ తరువాత దేశంలో లాక్‌డౌన్‌ అమలయ్యేలా కేంద్రం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఏప్రిల్‌ 14 తేదీ వరకు ఈ లాక్‌డౌన్‌ అమలు కానుంది. అయితే గడువు సమీపిస్తుండడంతో ఇప్పుడు అందరి దృష్టి లాక్‌డౌన్‌పై పడింది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 14వ తేదీ వరకు ముగిస్తరా? లేదా ఇంకా పొడిగిస్తరా? అనే చర్చ జరగుతోంది. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు కొనసాగించబోమని కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా తెలిపినప్పటికినీ దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో మరికొన్ని రోజులు ఈ లాక్‌డౌన్‌ తప్పదేమో అనిపిస్తోంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండడం ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం వరకు కరోనా కేసులు 2301 నమోదయ్యాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనా బారినపడి విలవిలలాడుతున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాలో కేసులు పదుల సంఖ్యల్లో నమోదవుతున్నాయి. కరోనా వైరస్‌ అలజడితో తెలుగు రాష్ట్రాల పరిస్థితి మరీదారుణంగా తయారైంది. ఏపిని ఆదుకోవాలని సిఎం జగన్‌… ప్రధాన మంత్రి నరేంద్రమోడిని మొన్న జరిగిన ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో కోరిన విషయం తెలిసింది. ఢిల్లీ లింకు తెలుగు రాష్ట్రాలతో ముడిపడడంతో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో లాక్‌డౌన్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్త దిగ్భందాన్ని దశలవారీగా ఎత్తివేసే దిశగా కేంద్రం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల ఏప్రిల్‌ 2వ తేదీ గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మోడీ చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని తెలుపుతున్నాయి. దశలవారీగా ఎత్తివేసేందుకు ఒక పకడ్బందీ వ్యూహాన్ని రచించాలని సిఎంలతో ఆయన తెలిపారు. దీనికనుగుణంగానే రాష్ట్రాలు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. మరోపక్క రాష్ట్రాల రెవెన్యూ తీవ్ర స్థాయికి పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తెలంగాణలో నెలకొంది. ఇక ఏపిలో అయితే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన పరిస్థితి. ఈనేపథ్యంలో ఏప్రిల్‌ 14 తరువాత కూడా మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ కొనసాగితే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకమే. కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్రాలకు రాబడి తక్కువ, వ్యయం ఎక్కువగా ఉంది. కరోనా కట్టడికి రూ.కోట్లను ఖర్చుచేసి వైద్యాన్ని అందిస్తున్నాయి. మర్కజ్‌ అంశానికి ముందు కరోనా పాజిటివ్‌ కేసులు తక్కువగా నమోదవుతున్నాయని అనుకునేలోపే ఢిల్లీ మర్కజ్‌ ప్రార్ధనతో దేశంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనైతే భారీగా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 20 నుంచి 30 కేసులు రెండు రోజులుగా నమోదవుతున్నాయి. తెలంగాణలో శుక్రవారం మధ్యాహ్నం వరకు మొత్తం 154 కేసులు నమోదైతే, ఏపిలోనూ 130కిపైగా నమోదయ్యాయి. మర్కజ్‌ ప్రార్ధనలకు, వారితో సంబంధం ఉన్న దాదాపు 9వేల మందిని కేంద్రం ఇప్పటికే గుర్తించి వైద్య పరీక్షలను, క్వారంటైన్‌లో ఉంచింది. తెలంగాణ నుంచి కూడా మర్కజ్‌ ప్రార్ధనకు వెయ్యిమందికిపైగా పోయారు. ఈ అందరినీ దాదాపు ప్రభుత్వం గుర్తించి క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు చేస్తున్నారు. మరొకొంత మందిని గుర్తించాల్సి ఉంది. ప్రార్ధనలకు వెళ్లొచ్చిన వారితో రోజు రోజుకీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏప్రిల్‌ 14 వరకూ ఇదే పరిస్తితి ఉంటే తెలుగు రాష్ట్రాలతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ పొడిగిస్తారనే చర్చ ప్రజల్లో జోరుగా జరుగుతోంది. ఒకవేళ కేసులు తగ్గుముఖం పడితే లాక్‌డౌన్‌ను ఈనెల 14 తరువాత ఎత్తివేసే అవకాశం కూడా ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments