HomeNewsBreaking Newsఏప్రిల్‌ లోపే... పరిశ్రమల తరలింపు

ఏప్రిల్‌ లోపే… పరిశ్రమల తరలింపు

తరలించని పరిశ్రమల భూ కేటాయింపులు రద్దు
పరిశ్రమల యజమానులతో టిఎస్‌ఐఐసి సమావేశం
ప్రజాపక్షం/హైదరాబాద్‌ కాలుష్యకారక స్టీల్‌ పరిశ్రమలను వెంటనే వికారాబాద్‌ జిల్లా రాకంచర్లలోని స్టీల్‌ ఇండస్ట్రీయల్‌ పార్క్‌కు తరలించాలని, పరిశ్రమల తరలింపునకు ఇదే చివరి అవకాశమని టిఎస్‌ఐఐసి చైర్మన్‌ బాలమల్లు వెల్లడించారు. తుది గడువులోగా పరిశ్రమల తరలింపు ప్రక్రియను చేపట్టకపోతే సంబంధిత స్టీల్‌ పరిశ్రమలను మూసి వేస్తామని, వాటికి సంబంధించిన భూ కేటాయింపులను రద్దు చేస్తామని హెచ్చరించా రు. ఏప్రిల్‌ లోపు పరిశ్రమల తరలింపు పూర్తి కావాలన్నారు. కాటేదాన్‌ కాలుష్య కారక స్టీల్‌ పరిశ్రమలను ఒఆర్‌ఆర్‌ వెలుపలకు తరలింపు అంశంపై టిఎస్‌ఐఐసి చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు అధ్యక్షతన స్థానిక ప్రజాప్రతినిధులు, కాలుష్య కారక స్టీల్‌ పరిశ్రమల యజమానులతో సోమవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపి వెంకటేష్‌ నేత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి, టిఎస్‌ఐఐసి ఎండి వెంకట్‌ నర్సింహారెడ్డి, వికారాబాద్‌ జెడ్‌పి వైస్‌ చైర్మెన్‌ విజయ్‌ కుమార్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సీనియర్‌ ఎనిర్వాన్‌మెంట్‌ ఇంజీనీర్‌ నరేందర్‌, టిఎస్‌ఐఐసి సిఇ శ్యామ్‌ సుందర్‌ జోనల్‌ అధికారులు పాల్గొన్నారు. 2008లో షిఫ్టింగ్‌ నోటీసులు జారీ చేసిన పరిశ్రమలతో పాటు, తాజాగా గుర్తించిన కాటేదాన్‌, జీడిమెట్లలోని 35 కాలుష్య కారక స్టీల్‌ పరిశ్రమలను ‘స్టీల్‌ ఇండిస్ట్రియల్‌ పార్క్‌’కు వెంటనే తరలించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పరిశ్రమల తరలింపు ప్రక్రియకు సంబంధించి 2022 జనవరి 10 లోగా డిపిఆర్‌ను సమర్పించాలని, మూడు నెలల్లోపు రాకంచర్ల ఇండస్ట్రియల్‌ పార్కు పనులను పూర్తి చేయాలని గ్యాదరి బాలమల్లు ఆదేశించారు. కోర్టు ఆదేశాలను, ప్రభుత్వ మార్గదర్శకాలను, ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మరోసారి అవకాశాన్ని కల్పించామని, ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిశ్రమల తరలింపు అంశంలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని పరిశ్రమల యజమానులకు ఆయన హామీనిచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments