పోడుసాగుదారుల పాలిట హరితహారం ‘ఉరిహారం’గా మారింది
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శ
ప్రజాపక్షం / హైదరాబాద్ తెలంగాణ వచ్చిన ఏడేళ్ళలో పోడుసాగుదారులకు ఏడుపే మిగిలిందని, ‘హరితహారం’ వారి పాలిట ‘ఉరిహారం’గా మా రిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. 2018 ఎన్నికలకు ముందు స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తానే స్వయంగా కుర్చీ వేసుకుని కూర్చుని పోడుసాగుదారుల సమస్యను పరిష్కరిస్తానన్న మాట ఇప్పటికీ అమలు కాలేదన్నారు. అటవీ అధికారులు, పోలీసుల మధ్య నలిగిపోతున్న పోడుసాగుదారులకు అండగా నిలిచేందుకు జల్- జంగల్ జమీన్- ఉద్యమానికి శ్రీకారం చుట్టిన జోడేఘాట్‌లోని కుమ్రం భీమ్ స్మారక స్థూపం నుంచి ఆగస్టు 4వ తేదీన సిపిఐ ‘పోడు యాత్ర’ ప్రారంభించనుందని ఆయన తెలిపారు. హైదరబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో చాడ వెంకట్‌రెడ్డి, సిపిఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు ‘పోడు యాత్ర’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 4న జోడేఘాట్‌లో ప్రారంభమయ్యే పోడుయాత్ర 8వ తేదీన భద్రాచలంలో ముగుస్తుందని చెప్పారు. ఇప్పటికే పలు సంఘాలు ఈ యాత్రకు సంఘీభావాన్ని ప్రకటించాయని, వామపక్షాలు, ఇతర పార్టీలు కూడా మద్దతిస్తే సంతోషమన్నారు. అడవిలో సాగు చేసుకునే అడవి బిడ్డలకు భూమిపై హక్కు కల్పిస్తూ 2006లో కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ రాష్ట్రంలో తరతరాల నుండి పోడు సాగు చేసుకుంటున్న గిరిజన, ఎస్‌సి, బిసిలకు హక్కు పత్రాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అన్యాయం జరిగిందని, తెలంగాణ వచ్చాక పట్టాలు వస్తాయనుకుంటే చివరకు నిరాశే మిగిలందన్నారు. సిఎం కెసిఆర్ స్వయంగా తానే వచ్చి సమస్య పరిష్కరిస్తానని పలు మార్లు చెప్పారని, హామీ ఎప్పుడు అమలవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 3.28 లక్షల ఎకరాలను అనాదిగా సాగు చేసుకుంటున్న 89,905 మంది గిరిజన కుటుంబాలపై అటవీ, రెవెన్యూ అధికారులు నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. పంట చేతికొచ్చే సమయానికి పంటను ధ్వంసం చేస్తున్నారని, పిడి యాక్టు కింద కేసులు పెట్టి నానా యాతనకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అటవీ శాఖ, రెవెన్యూ శాఖల మధ్య హద్దుల వివాదంలో కూడా పోడుసాగుదారులు నలిగిపోతున్నారని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. అందుకే పోడు సాగుదారులకు భరోసా కలిగించేందుకు పోడు యాత్ర చేపట్టామని వివరించారు.