HomeNewsBreaking Newsఏడేళ్లలో దేశం నాశనం

ఏడేళ్లలో దేశం నాశనం

భారత్‌ హిందువుల దేశం… హిందుత్వవాదులది కాదు
మోడీ ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ ధ్వజం
పెరిగిన ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ
జైపూర్‌ : ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ సర్కార్‌పై కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శల వర్షం కురిపించారు. భారత్‌ హిందువుల దేశమని, ఏదిఏమైనా అధికారాన్నే కావాలనుకునే హిందుత్వవాదులది కాదని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులు అల్లాడుతున్నా అధికారం కోసం పాకులాడే వారే హిందుత్వవాదులంటూ పరోంగా బిజెపినుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతూ మోడీజీ, ఆయన ముగ్గులు నలగురు పారిశ్రామిక స్నేహితులు గత ఏడేళ్ల నుంచి దేశాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ నిర్వహించింది. కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, ఛత్తీసగఢ్‌ సిఎం భూపేష్‌ బఘేల్‌, మల్లికార్జున ఖర్గే, పార్టీకి చెందిన ఇతర సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. పంజాబ్‌ సిఎం ఆలస్యంగా జైపూర్‌ వచ్చినప్పటికీ ర్యాలీలో పాల్గొనలేదు. సోనియా, ప్రియాంకా గాంధీతో కొద్దిసేపు సమావేశమై తిరిగి వెళ్లిపోయారు. కాగా, ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాహుల్‌ మాట్లాడారు. హిందూ, హిందుత్వను రెండు వేర్వేరు పదాలుగా అభివర్ణించిన రాహుల్‌.. రెండు జీవులకు ఒకే ఆత్మ ఉండదని, రెండు పదాలకు ఒకే అర్థాలు ఉండవని అన్నారు. హిందువు అంటే ఎవరికీ భయపడడు, అందరినీ ఆలింగనం చేసుకుంటాడు, అన్ని మతాలను గౌరవిస్తాడని రాహుల్‌ స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ హిందువు అని, గాడ్సే హిందుత్వవాది అని అన్నారు, హిందువు నిరంతరం సత్యం కోసం అన్వేషిస్తాడని, మహాత్మా గాంధీ వలె తన జీవితాన్ని అన్వేషణ కోసమే అంకింత చేస్తారని చెప్పారు. కానీ, చివరికి ఒక హిందూవాది తన ఛాతీలో మూడు బుల్లెట్లు కాల్చాడని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హిందుత్వవాది తన జీవితమంతా అధికారం కోసమే గడుపుతాడని, తనకు సత్యంతో ఎలాంటి సంబంధం లేదని, అధికారం మాత్రమే కావాలని, ఎవరినైనా కొట్టాలన్నా, చంపాలన్నా ఏదైనా చేయగలడని మండిపడ్డారు. ఆయన మార్గం సత్తాగ్రహమే తప్ప సత్యాగ్రహం కాదన్నారు. ‘దీనికి విరుద్ధంగా, హిందువు తన భయాలను ఎదుర్కొంటూ.. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గడు. భయం హిందుత్వవాదిని ముంచెత్తుతుంది. ఈ భయం అతని హృదయంలో ద్వేషాన్ని సృష్టిస్తుంది, అయితే హిందువు హృదయంలో ప్రేమ ఉంటుందని రాహుల్‌ పేర్కొన్నారు. తమకు అధికారం కావాలని, సత్యంతో తమకు సంబంధం లేదని వారు అంటున్నారని బిజెపిపై మండిపడ్డారు. 2014 నుంచి దేశంలో హిందుత్వవాదుల పాలన నడుస్తోందన్నారు. ‘నేను హిందువుని, హిందుత్వవాదిని’ కాదు అని అన్నారు. హిందుత్వవాదులను మరోసారి తరిమికొట్టాలని, దేశంలో హిందువుల పాలన తీసుకురావాలని పిలుపునిచ్చారు. దేశంలోని కార్పొరేట్‌ లాభంలో 90 శాతం 20 కంపెనీలదేనని ఆరోపించారు. మీడియా ప్రతినిధులను ప్రస్తావస్తూ ర్యాలీని ప్రసారం చేసే వారు కూడా బిజెపి బానిసలేనన్నారు. అయితే, వారు హిందుత్వవాది కాదని, అణచివేయబడిన హిందువులని ఆయన అన్నారు. దేశానికి వెన్నెముక అన్నందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రైతుల రుణాలను మాఫీ చేశాయని, అయితే మోడీ వారిని వెన్నులో పొడిచారన్నారు. మంచి రోజులు వస్తాయని ప్రధాని మోడీ వాగ్దానం చేశారని, అయితే అదానీ, అంబానీలకు మాత్రమే మంచి రోజులు వచ్చాయన్నారు. అయితే అది వారి తప్పు కాదు… ప్రతిరోజూ వారికి ఏదైనా ఇవ్వాలని ఆలోచించే ప్రధానమంత్రి తప్పు అని ఆయన అన్నారు. దేశంలో 33 శాతం డబ్బు ఒక్క శాతం జనాభా వద్ద ఉందని, 50 శాతం జనాభా వద్ద కేవలం 6 శాతం డబ్బు మాత్రమే ఉందని రాహుల్‌ అన్నారు. కరోనావైరస్‌ మహమ్మారి సమయంలో మోడీ పారిశ్రామికవేత్తల పన్నులను మాఫీ చేశారని, అయితే వందల కిలోమీటర్లు నడవాల్సిన కార్మికులకు బస్సులు కూడా ఇవ్వలేకపోయారని, వారిలో 100 మంది రోడ్లపై మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉందని ఆయన కేంద్రంపై మండిపడ్డారు. జిఎస్‌టి, నోట్ల రద్దు, చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించకపోవడమే ఇందుకు కారణమని రాహుల్‌ పేర్కొన్నారు. ఇద్దరు ముగ్గురు పారిశ్రామిక వేత్తల వల్ల ఉద్యోగాలు కల్పించలేరని, లక్షలాది మంది చిన్న, మధ్యతరహా వ్యాపారులు, రైతుల వల్ల ఉద్యోగాలు వస్తాయని, ప్రస్తుత పాలనలో అసంఘటిత రంగం కుంగిపోయిందని అన్నారు. లడఖ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లలో భారత భూమిని చైనా ఆక్రమించిందని, అయితే ఏమీ జరగలేదని ప్రధాని మోడీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. అంతకుముందు, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు, కాంగ్రెస్‌ 70 ఏళ్లలో నిర్మించిన వాటిని పారిశ్రామికవేత్త స్నేహితులకు అమ్మాలని చూస్తోందని అన్నారు. ప్రజలు, రైతులకు మేలు చేసేలా కాకుండా ఎంపిక చేసిన పారిశ్రామికవేత్తల స్నేహితుల కోసం ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె ఆరోపించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అబద్ధాలు, దురాశలు, దోపిడీలే అని ఆమె ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు బిజెపి నేతలు చైనా, కులతత్వం, మతతత్వం గురించి మాట్లాడుతున్నారని, ప్రజల పోరాటాల గురించి మాట్లాడరని, ఏడేళ్ల పాలనలో మోడీ ప్రభుత్వం ఏం చేసిందని ఆమె ప్రశ్నించారు. అయితే, ఈ సభలో సోనియా గాంధీ ప్రసంగించ లేదు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక సహా పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు మాట్లాడిన తర్వాత సభ ముగిసినట్లు ప్రకటించారు. అంతా వేదికపై నుంచి వెళ్లిపోయారు. ఢిల్లీ నుంచి జైపుర్‌ వచ్చి సభకు హాజరైనా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మాట్లాడకపోవటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments