ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లా తిరియా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్
ఘటనాస్థలిలో మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం
వారోత్సవాల వేళ నక్సల్స్‌కు ఎదురు దెబ్బ
భద్రాచలం : వారోత్సవాల వేళ మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. శనివారం సాయం త్రం పోలీసులు,- మావోయిస్టులకు మధ్య చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా తిరియా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టు వారోత్సవాలను పురస్కరించుకుని వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇంటెలిజెన్సీ నిఘావర్గాల హెచ్చరికల సందర్భంగా పెద్దఎత్తున కూంబింగ్ బలగాలు గత రెండు రోజుల క్రితమే అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయి. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంయుక్త బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. వర్షం పడుతున్నప్పటికీ కూంబింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో దట్టమైన తిరియా అటవీ ప్రాంత సమీపంలో పోలీసులకు సుమారు 30 మందికి పైగా మావోయిస్టులు తారసపడ్డారు. ముందుగా మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో ప్రాణ రక్షణ కోసం పోలీసు బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. ఇరువర్గాల మధ్య సుమారు రెండు గంటల పాటు హోరాహోరీగా కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల ధాటికి చేతులెత్తేసిన మావోయిస్టులు అటవీ ప్రాంతంలోనికి జారుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించగా ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు ఆ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ధృవీకరించారు. మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. అడవిలోనికి జారుకున్న మావోయిస్టుల జాడ కోసం పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు.
వారోత్సవాల వేళ
నేటి నుండి పిఎల్‌జిఎ వారోత్సవాలు ఉండగా ఒక్కరోజు ముందుగా మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న మన్యం, దండకారుణ్య ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఇప్పటికే పట్టు సాధించేందుకు పాకులాడుతున్న మావోయిస్టులు వారోత్సవాలను పురస్కరించుకొని హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు భావించిన సిఆర్‌పిఎఫ్, ప్రత్యేక బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.ఏడుగురుని మట్టుబెట్టి పైచేయి సాధించి మావోయిస్టుల ఆత్మబలాన్ని సైతం దెబ్బతీశాయి.వారోత్సవాలు, ఎన్‌కౌంటర్ సందర్భంగా నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రహదార్లతోపాటు అటవీ గ్రామాల్లోనికి ప్రవేశించే దారులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పోలీసులు రాకపోకలపై ని ఘా పెట్టారు. మరోపక్క మావోయిస్టు పార్టీ కదలికలపై డేగ కన్నేసిన వారు హింసాత్మక సంఘటనలకు తావులేకుండా అడవిని జల్లెడ పడుతున్నారు.
ఏడుగురు నక్సల్స్ హతం
RELATED ARTICLES