ప్రజాపక్షం/ హైదరాబాద్ : ‘మా ఊరిలో గుడిని నిర్మించి పంచాయతీ భవనానికి కావాల్సిన భూమిని ఇచ్చే అభ్యర్థినే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుం టా ం’ మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు సోమవారం తీర్మానించారు. అలాగే రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఏకగ్రీవంపై ఆసక్తికరమైన చర్చలు, సమావేశాలు సాగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నెడో రోపో వస్తుందనే వార్తలు వెలువడడంతో గ్రామాల్లో తిరిగి రాజకీయ వేడి మొదలైంది. ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్ స్థానాన్ని దక్కించుకోవాలంటే తాము పెట్టే షరతులు, కోరికలకు కట్టుబడి ఉండాలని గ్రామస్థులు అభ్యర్థులకు షరతులు విధిస్తున్నారు. ఈ మేరకు గ్రామంలో ప్రజలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని తీర్మానాలు సైతం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో గతంలో మాదిరిగానే కొన్ని సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు గ్రామస్థులు సిద్ధమవుతున్నారు. గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్‌గా ఎవరిని ఎన్నుకోవాలి.. వారి నుంచి ఏఏమి ఆశించాలనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గ్రామంలో గుడి కట్టించాలని, గ్రామ పంచాయితీ కార్యాలయానికి 500 గజాల స్థలం ఇప్పించాలని, వార్డు సభ్యులకు ఎంతో కొంత నజరానా ముట్టచెప్పాలని, పాఠశాల భవనం నిర్మించి ఇవ్వాలని, ఇలా పలు అభివృద్ధి పనులు సొంత ఖర్చతో చేయించి ఇస్తామని అంగీకరించిన అభ్యర్థినే సర్పంచ్‌గా ఏక గ్రీవంగా గెలిపిస్తామని గ్రామస్థులు ఆసక్తికరమైన షరతులు విధిస్తున్నారు. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా గెలవాలంటే గ్రామస్థుల గొంతెమ్మ కోర్కెలు తీర్చే సత్తా ఉండాల్సిందే. గ్రామానికి నిస్వార్ధంగా సేవ చేయాలనే దృక్పథం, సంకల్పం ఉంటే సరిపోదు.. డబ్బు ఉంటేనే సర్పంచ్ స్థానం దక్చింకుకోగలుగుతారని దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ రకంగా అభ్యర్థులు ఏకగ్రీవంగా సర్పంచ్ స్థానాన్ని దక్కించుకోవాలంటే వారు సుమారు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు ఖర్చు పెట్టుకునే స్థోమత కలిగి ఉండాల్సిందే. గ్రామస్థుల కోరికలను తీర్చేందుకు అప్పుచేసైనా ఏకగ్రీవంతో సర్పంచ్ స్థానం కొట్టేయాలని చూస్తున్నారు. మరికొందరు తమ వ్యవసాయ పొలంలో ఎంతో కొంత అమ్మేసి వచ్చే డబ్బులతో ఏకగ్రీవంగా గెలవాలని తహతహలాడుతున్నారు. సర్పంచ్‌గా గెలిచిన తరువాత తిరిగి తమ సొమ్ము రాకపోతుందా అనే ఆశతో ఉన్నారు. ఇక అదే గ్రామంలో నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయాలనుకునే అభ్యర్థులకు మాత్రం ఏకగ్రీవం రుచించడంలేదు. గ్రామస్థుల మాట కాదని ఒకవేళ నామినేషన్ వేస్తే రేపటి రోజున ఏవైనా పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని భయపడుతున్నారు. అసలు ఏకగ్రీవం విధానాన్ని పూర్తిగా ఎత్తేసి ప్రతి గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏకగ్రీవం పేరుతో సర్పంచ్ స్థానానికి వేలంపాట పడుతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ రకంగా ఆర్థిక బలం ఉన్నవారే రాజకీయాల్లో కొనసాగుతారనే నమ్మకం పెరుగుతుందని.. తద్వారా నిజమైన ప్రజాసేవలకు తీవ్ర ఇబ్బందిగా మారుతుందని పలువురు వాపోతున్నారు. డబ్బులు పెట్టి సర్పంచ్ పీఠం కౌవసం చేసుకున్న వారు గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మింగేసే అవకాశాలు లేకపోలేదని వారంటున్నారు. ఏకగ్రీవం అనే విధానానికి స్వస్తి పలకాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు. ఏకగ్రీవం ముసుగులో సాగుతున్న వేలంపేటపై అధికారులపై దృష్టిసారించాలని వారు అభిప్రాయపడుతున్నారు.
ఏకగ్రీవ సర్పంచ్ పోస్టుకు వేలంపాట!
RELATED ARTICLES