పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
జిహెచ్‌ఎంసి, కార్పొరేషన్ల పరిధిలో
ఎన్నికల కోడ్ వర్తించదు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి
సాధారణ, వ్యయ పరిశీలకులతో సమావేశం
బ్యాలెట్ బాక్స్‌ల పరిశీలన
ఎన్నికల విధులు, విధానాలపై అవగాహన
ప్రజాపక్షం / హైదరాబాద్ : ఏకగ్రీవాల కోసం ఎవరిపైనా ఒత్తిడి తేవద్దని, బలవంతంగా ఒత్తిడి తెచ్చి ఏకగ్రీవం చేసినట్లు తెలిస్తే తగు చర్యలు ఉం టాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మారియట్ హోటల్‌లో శుక్రవారం పంచాయతీ ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారికి కొత్త పంచాయతీరాజ్ చట్టం వివరించారు. పాటించాల్సిన విధానాలను, నిర్వహించాల్సిన విధులపై వారికి అవగాహన కల్పించారు. ఎన్నికల విధానాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక్కొక్క దశను ఎలా పూర్తి చేయాలో చెప్పారు. ఎన్నికల్లో ఉపయోగించనున్న బ్యాలట్ బాక్స్‌లను పరిశీలించారు. వారందరికి జిల్లాలను కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. పరిమితికి మించి ఖర్చు చేస్తే చర్యలు ఉంటాయని చెప్పారు. గత ఎన్నికల్లో ఇలా చేసిన వారిని ఈ సారి పోటీ చేయకుండా అనర్హత వేటు వేశామని తెలిపారు. ఇప్పుడు కూడా ఖర్చు అధికంగా చేస్తే అనర్హత వేటు వేస్తామన్నారు. ప్రస్తుతం నడుస్తున్న పథకాలు యథావిధిగా నడుస్తాయని చెప్పారు. అయితే గ్రామ పంచాయతీలకు సంబంధించి కొత్త పథకాలు చేపట్టరాదన్నారు. ఈ ఎన్నికలు రాజకీయాలకతీతంగా జరుగుతాయి కాబట్టి ఎక్కువ మంది పరిశీలకులను పెట్టామని పేరొకన్నారు. జిహెచ్‌ఎంసి, కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల కోడ్ వర్తించదన్నారు. ఎక్కడైనా రిగ్గింగ్ జరిగితే ఆయా చోట్ల రీపోలింగ్ జరపేలా తగు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎన్నికల కోడ్‌పై అవగాహన కల్పించామన్నారు. నియమావలి ఉల్లంఘన, ఖర్చుపై నిఘా పెట్టాలని చెప్పారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాను ఆన్‌లైన్‌లో పెట్టామని తెలిపారు. ఓటర్లకు ఓటరు స్లిప్పులు పంచడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ వాహనాలు, భవనాలు అధికార దుర్వినియోగం కాకుండా చూడాలని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ ఎన్నికల పరిశీలకులుగా ఎంపికైన పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులు, సీనియర్ ఆడిట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.