గంగుల వర్సెస్ బండి
ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన కరీంనగర్ గ్రానైట్ క్వారీలు
నోటీసులు జారీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్..
ప్రజాపక్షం/కరీంనగర్ బ్యూరో కరీంనగర్ జిల్లాకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన గ్రానైట్ క్వారీలు నేడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కరీంనగర్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, స్థానిక ఎంపి బండి సంజయ్ మధ్య పరస్పర ఆరోపణల దాడి వెనుక హస్తం ఎవరిది అన్న విషయం ఇప్పటికీ తేలలేదు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో గంగుల కమలాకర్ గ్రానైట్ మాఫియాను పెంచి పోషిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. గ్రానైట్‌తో పాటు ఇసుక మాఫియాను అధికార పార్టీ నేతలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికలు గడిచి రెండేళ్లు పూర్తయినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎంపికి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయని ఆరోపణలు కూడా వినిపించాయి. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గ్రానైట్ వ్యాపారులకు నోటీసులు జారీ చేయడంతో మరోసారి చర్చకు దారి తీసింది. అధికార పార్టీ మంత్రి, స్థానిక ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ అక్రమాల మాఫియాను పోషిస్తున్నారని కరీంనగర్ జిల్లాలో బిజెపి నాయకులు మాటల దాడిని పెంచారు. గంగుల కమలాకర్ కూడా గ్రానైట్ పరిశ్రమలో తనకు ఎలాంటి వాటాలు, వ్యాపారాలు లేవని మీడియా ముఖంగా ప్రకటించారు. అయినా బిజెపి నేతలు పదే పదే మీడియా ముఖంగా గంగులపై దాడి చేయడంతో ఆరోపణల దాడి చిలికిచిలికి గాలివానగా మారింది. గ్రానైట్ పరిశ్రమను దెబ్బ కొడితే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని గ్రానైట్ వ్యాపారస్తులు ఏకంగా ఎంపికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే నోటీసులు జారీ చేయడంతో గ్రానైట్ వ్యాపారులు తమ పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనలో పడ్డారు. గ్రానైట్ పరిశ్రమలు ఎలాంటి అవకతవకలు జరగలేదని మీడియా ముఖంగా తెలియజెప్పేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే కరీంనగర్‌కు చెందిన బిజెపి నాయకుడు ఓ మీడియా గంగుల గ్రానైట్ మాఫియా నిర్వహిస్తున్నారని చిత్రీకరించగా, దీనిపై మంత్రి గంగుల కమలాకర్ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడం కూడా వివాదానికి కారణమైంది. ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు గానీ, మైనింగ్ శాఖ అధికారులు గానీ గ్రానైట్ పరిశ్రమ గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో అధికార పార్టీ, మరోవైపు కేంద్రంలో అధికార పార్టీ నేతలైన కరీంనగర్ స్థానికులు గంగుల కమలాకర్, బండి సంజయ్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీసింది. ఈ వివాదంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులకు జవాబులు ఇచ్చిన తరువాత ఎలాంటి ప్రకటన చేస్తుందో వేచి చూడాల్సిందే.
ఏం జరుగుతోంది?
RELATED ARTICLES