అమెరికా,బ్రిటన్ తిరస్కృతి
పారిస్ : కృత్రిమ మేధపై పారిస్‌లో సోమ,మంగళవారాల్లో జరిగిన ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో రూపొందించిన ప్రకటనపై 60 దేశాలు సంతకం చేశాయి. కానీ అమెరికా, బ్రిటన్ దేశాలు మాత్రం సంతకాలు చేసేందుకు తిరస్కరించాయి. కృత్రిమ మేధ సాంకేతికత బాహాటత్వంతో ఉండాలనీ, సామాన్య ప్రజలకు చేరువకావాలని, అందరిక్షేమం కోరుకోవాలనీ, ఎలాంటి అరమరికలూ లేకుండా బాహాటపద్ధతులలో సాంకేతికత రూపొందాలనీ, భద్రత, విశ్వసనీయత ఉండాలని కృత్రిమ మేధపై జరిగిన శిఖరాగ్ర సదస్సు డిక్లరేషన్ స్పష్టం చేసింది. ఈ డిక్లరేషన్‌తో అమెరికా,బ్రిటన్ దేశాలు విభేదించాయి. ప్రజలస్థిరత్వంకోసం, భూగోళస్థిరత్వంకోసం కృత్రిమ మేధను అందుబాటులోకి తెచ్చి ఉపయోగించాలని డిక్లరేషన్ ప్రకటించింది. ఐతే విపరీతమైన ఆంక్షలు కృత్రిమ మేధ విస్తృతికి, పరివర్తనకు ఆటంకాలు కలిగిస్తాయని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ అన్నారు. అసలు మొట్టమొదటి కృత్రిమ మేధ ప్రపంచ శిఖరాగ్ర సదస్సును 2023లో బ్రిటన్ ప్రభుత్వమే నాటి ప్రధానమంత్రి రుషి సునాక్ సారథ్యంలో నిర్వహించింది. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం ఈ డిక్లరేషన్‌పై సంతకం చేసేందుకు తిరస్కరించింది. మరింత సమర్థవంతమైన, ఆచరణాత్మకమైన పరిష్కారాలు సాధించేందుకు తమ అమెరికా భాగస్వామితో కలిసి కృషి చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రకటనపై బ్రిటన్ ంసతకాలు చేయకపోవడం సరైన నిర్ణయమని ఆ దేశ ప్రతినిధులు సమర్థించారు. కృత్రిమ మేధ ద్వారా ప్రపంచం ముందుకు ప్రయాణించేందుకు ఈ మాత్రం నియంత్రణలు ఉండాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సహా భారత్ కూడా సమర్థించింది.