HomeNewsBreaking Newsఎస్‌యు దశ మారేనా?

ఎస్‌యు దశ మారేనా?

12బి రాకతో వర్సిటీ అధికారుల్లో నయా జోష్‌
కొత్త కోర్సులు, నియామకాలపై చిగురిస్తున్న ఆశలు

ప్రజాపక్షం / కరీంనగర్‌ విశ్వవిద్యాలయాల పురోగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టగా శాతవాహన యూనివర్సిటీకి 12బి హోదా కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) గత నెల చివరి వారం లో ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ హోదాతో వర్సిటీ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ప్రభుత్వం, వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. కొత్త కోర్సుల ఏర్పాటు, సిలబస్‌ సొంతంగా తయారు చేసుకోవడం, వర్సిటీలో నెలకొన్న ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉండటంతో పాటు విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నుంచి కూడా పుష్కలం గా నిధులు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో కొత్త కోర్సుల ప్రకటన, ఖాళీల భర్తీపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం వర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఎంబిఎ, ఎంసిఎ, ఎంఎస్‌డబ్ల్యు తదితర 20 కోర్సులతో ఉమ్మడి జిల్లా విద్యార్థుల కు ఉన్నత విద్య లభిస్తోంది. కొత్తగా ఇంజనీరింగ్‌ కాలేజీ, లా కాలేజీ, మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో పాటు ఎంఎలో జర్నలిజం, ఎంపిఈడి కోర్సులు కూడా ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుంచి విద్యార్థులు కోరుతున్నారు. త్వరలో నిర్వహించనున్న వర్సిటీ పాలకవర్గ సమావేశంలో కోర్సుల ప్రాధాన్యాన్ని గుర్తిస్తారని భావిస్తున్నారు. అదే విధంగా కీలకమైన పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేయాలని, గ్రామీణ సామాజిక సమస్యలపై పరిశోధనలకు వర్సిటీని కేంద్రంగా తీర్చిదిద్దేలా కార్యచరణ చేపట్టాలనే చర్చ కూడా కొనసాగుతోంది. వర్సిటీ ఆరంభం నుంచి వర్సిటీలో రెగ్యులర్‌, నాన్‌ టీచింగ్‌ నియామకాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సిబ్బంది నియామకంపై కూడా ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలు కనపడుతున్నాయి. విశ్వవిద్యాలయంలో 114 మంది బోధన, బోధనేతర సిబ్బంది అవసరం ఉండగా 63 మందితోనే నెట్టుకొస్తున్నారు. వీరిలో కేవలం ఒకే ఒక్క పోస్టు రెగ్యులర్‌ ప్రాతిపదికన ఉండగా మిగతావన్నీ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో కొనసాగుతున్నాయి. మొత్తం10 మంది ప్రొఫెసర్‌ పోస్టులకు గాను 9 ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టులు 16 ఉండగా మొత్తం ఖాళీగానే ఉన్నాయి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు మాత్రం 37కు గాను 20 మాత్రమే భర్తీ చేశారు. కాగా 51 మందిలో బోధనేతర సిబ్బంది అవసరం ఉండగా 13 మందితో మాత్రమే నెట్టుకొస్తున్నారు. విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రతి విభాగానికి హెచ్‌ఓడిగా ప్రొఫెసర్‌, సహాయకులుగా ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, వారికి సహాయకులుగా నలుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా ఏ ఒక్క డిపార్ట్‌మెంట్‌లో కూడా హెచ్‌ఓడిలు కూడా లేకపోవడంతో వర్సిటీ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. ఇదిలా ఉండగా 12బి రాకతో వీటన్నింటికీ చెక్‌ పెట్టడమే తరువాయి అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వర్సిటీ వర్గాలు భావిస్తున్నారు. వర్సిటీలో కొత్తగా నిర్మించాల్సిన అకడమిక్‌ బిల్డింగ్‌, కామన్‌ రీసెర్చ్‌ ఫెసిలిటీస్‌ బిల్డింగ్‌, స్పోర్ట్‌ కాంఫ్లెక్స్‌, అథ్లెటిక్స్‌ గ్రౌండ్‌, ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌, సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణం, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి కోసం ప్రత్యేక పైప్‌లైన్‌, ట్యాంకులు నిర్మాణం తదితర చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments