తప్పుడు పత్రాలు, లేనివ్యక్తులను సృష్టించి
రుణాల పేరుతో రూ.16 కోట్లకు కుచ్చుటోపి
ప్రజాపక్షం/హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులే తమ సొంత సంస్థకే రూ.16 కోట్ల కుచ్చుటోపి పెట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు బ్యాంక్ అధికారులు ఈ కుట్రకు పాల్పడడం విశేషం. తప్పుడు పత్రాలు, లేని వ్యక్తులను సృష్టించి పనిచేస్తున్న సంస్థకే రుణాల పేరుతో కన్నెం వేశారు.వివరాలు ఇలా ఉన్నాయి. ‘రీన్ లైఫ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కొందరు ఎస్‌బిఐ ఉన్నత ఉద్యోగులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. రీన్ లైఫ్ ల్యాబ్స్ ప్రైవేటు లిమిటెడ్ నకిలీ సంస్థను సృష్టించిన వీరు ఈ కంపెనీకి హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో ఖరీదైన భూములు ఉన్నాయని పత్రాలు సృష్టించారు. కంపెనీ డైరెక్టర్లను కూడా వీరే సృష్టించుకున్నారు. లేని వ్యక్తుల పేర్లను సైతం డైరెక్టర్లుగా ఉన్నట్లు నకిలీ పత్రాలు సైతం సృష్టించారు. వీరిపేర్లపైనే కరెంట్ అకౌంట్‌లను తెరిచారు. ఇక తమ కుట్ర అమలుకు శ్రీకారం చుట్టారు. వ్యాపారం మరింత అభివృద్ది పరిచేందుకు పథకం ప్రకారం వీరు సదరు కంపెనీకి రూ.16 కోట్ల రుణం కోసం ఎస్‌బిఐలో దరఖాస్తు చేశారు. ఈ రుణానికి షూరిటీగా నకిలీ భూ పత్రాలను బ్యాంక్‌కు సమర్పించారు. ఈ రుణ దరాఖాస్తును పరిశీలించాల్సిన అధికారులే ఈ ముఠాలో ఉండడంతో ఆ ఫైల్‌కు ఆటోమెటిక్‌గా క్లియర్ చీట్ ఇచ్చారు.దీంతో వారికి రూ.16 కోట్ల రుణం మంజూరైంది.ఈ డబ్బు అంతా సదరు కంపెనీకి చెందిన కరెంట్ అకౌంట్‌లలోకి జమ కావడంతో వారి పంట పండింది. ఇంకేముంది కంపెనీ డైరెక్టర్ల చెక్‌బుక్‌లపై వీరే సంతకాలు పెట్టి డ్రా చేసుకుని వచ్చిన డబ్బును ఆరుగురు ఎస్‌బిఐ అధికారులు పంచుకున్నారు. అయితే సదరు కంపెనీ నెలవారి కట్టాల్సిన రుణ కిస్తులను చెల్లించలేదు. దీంతో ఉన్నతాధికారుల తమ బ్యాంక్ నుంచి రూ.16 కోట్ల రుణం పొందిన రీన్ లైఫ్ ల్యాబ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కోసం ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది. అసలు ఈ పేరుతో నిజానికి కంపెనీ నెలకొల్పలేదని, కేవలం పత్రాలపైనే కంపెనీ నెలకొల్పినట్లు ఎస్‌బిఐ ఉన్నతాధికారులు గుర్తించారు. అలాగే సదరు కంపెనీ రుణం పొందే సమయంలో షూరిటీగా పెట్టిన భూముల వివరాలను సైతం ఆరా తీయగా అవీ నకిలీ పత్రాలని తేలింది.