‘రైతుబంధు’లో అన్నదాతల వెతలు
నిలిచిన పంట పెట్టుబడి
రైతు కంటతడి
ప్రజాపక్షం / హైదరాబాద్ : టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతుబంధు’ పథకాన్ని గత ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతుకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి రూ.4వేల చొప్పున ఖరీఫ్‌లో చెక్కుల పంపిణీని పెద్ద పండగలా నిర్వహించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా స్థానిక ఎమ్మెల్యేలతో చెక్కుల పంపిణీ చేసేందుకు కోడ్ అడ్డురావడంతో ఎన్నికల కమిషన్ సూచన మేరకు డబ్బులను నేరుగా ఖాతాల్లో వేశారు. అయితే, కొందరు రైతుల సెల్‌ఫోన్‌లకు రైతుబంధు డబ్బు జమైనట్లు ఎస్‌ఎంఎస్ వచ్చింది. కానీ బ్యాంకు ఖాతా ల్లో మాత్రం జమ కాలేదు. ఇదేమిటని బ్యాంకర్లను సదరు రైతులు అడిగితే.. మాకేం తెలుసని సమాధానమిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక ఊళ్ళోనే పలువురికి డబ్బులు ఇంకా రాలేదు. వారి వివరాలిలా ఉన్నాయి.
1. మహబూబ్‌నగర్ జిల్లా చేవెళ్ళ మండలానికి చెందిన పిఆర్.మధుసూధన్ అనే రైతుకు ఒక ఎకరం భూమి ఉంది. ఈ పథకం ప్రవేశపెట్టిన తొలి విడతలో ఒకసారి రూ.4వేల చెక్కు వచ్చింది. రెండో విడతలోనూ రూ.4వేలు జమ అయినట్లు అతని సెల్‌కు మెసేజ్ వచ్చింది. ఆనందంలో ఎటిఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేయబోతే ఖాతాలో డబ్బులు లేవు. బ్యాంకుకు వెళ్లి ఆరా తీస్తే డబ్బులు జమ కాలేదని తెలిసింది.
2. నవాబ్‌పేట మండల ఇప్పటూరు గ్రామానికి చెందిన పి.విజయలక్ష్మి అనే రైతుకు ఆరు ఎకరాల భూమి ఉంది. తొలి విడతలో చెక్కులు పంపిణీ చేసినప్పుడు రైతుబంధు చెక్కు రూ.24వేలు వచ్చింది. ఇటీవల రెండో విడతలో ఆమె ఖాతాలో జమకావాల్సిన డబ్బులు ఇప్పటికీ రాలేదు.
3. ఇదే గ్రామానికి చెందిన సయ్యద్ షా ఖాదిద్ హుస్సేన్ (3ఎకరాల 6గుంటలు) రైతుది ఇదే పరిస్థితి. ఇదిగో జమ అవుతాయి, అదిగో జమ అవుతాయి అంటున్నారే తప్ప ఇప్పటికి రాలేదు. ప్రతి రోజు గ్రామం నుంచి బ్యాంకు ఉన్న మండల కేంద్రానికి వెళ్లడం, డబ్బులు రాక నిరాశతో వెనుదిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
4. ఒక ఎకరం భూమి ఉన్న వాసుదేవాచారి అనే రైతుకు ఇప్పటి వరకు రైతుబంధు డబ్బులు జమకాలేదు. ఈ రైతుకు తొలి విడత చెక్కుల పంపిణీ సంధర్భంగా కూడా రైతుబంధు అందలేదు. ఇలాంటి మరెన్నో ఉదహరణలు ఉన్నాయి. వీటికి సర్కారు ఏం సమాధానం చెబుతుందో చూడాలి. పక్కనే భూములున్న రైతులకు వచ్చి తమకు రాకపోవడం ఏమిటని రైతులు వ్యవసాయాధికారులను గట్టిగా నిలదీస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల వ్యవసాయాధికారులు వారి కార్యాలయాలకే రావడం మానేశారు. రైతులు కనిపిస్తే అప్పు ఉంటే ఎలా తప్పించుకు తిరుగుతారో అలా వ్యవసాయాధికారుల పరిస్థితి తయారైంది. మరోవైపు రైతుబంధు పథకం శాశ్వతం కాదని ఇటీవల వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఒక ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో పలువురు రైతుల్లో ఆందోళన నెలకొన్నది.