వాడటానికి జంకుతున్న ప్రజలు
మండుతున్న ఎండలు
అంతటా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత
ఆదిలాబాద్‌లో అత్యధికంగా 42.3 డిగ్రీల నమోదు
అక్కడక్కడా వర్షాలు
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండుతున్నాడు. వేడి నుంచి కొంత రక్షణ పొందే క్రమంలో ఎసి, కూలర్ వాడుదామంటే ప్రజలు బెంబెలెత్తుతున్నారు. చాలాచోట్ల ఎసికి కరోనా భయం పట్టుకున్నది. చల్లటి వాతావరణంలో కరోనా ప్రబలుతుందేమోననే ఆందోళనలో ఆ దిక్కే చూడడం లేదు. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, దుండిగల్‌లో అత్యల్పంగా 38.6 డిగ్రీలు నమోదైంది. అలాగే రాష్ట్రంలోని సిద్ధిపేట, భువనగిరి, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, జనగామ, వరంగల్ రూరల్, నల్లగొండ, వికారాబాద్‌లో 1 నుంచి 4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ చిరు జల్లులు, తేలికపాటి వర్షాలు పడడంతో రాత్రంతా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. అలాగని కొద్దిసేపు బయటకు వెళ్దామంటే లాక్‌డౌన్ దీంతో ఇంట్లోనే ఉక్కపోత, ఉబ్బరీతకు గురవుతున్నారు. మరికొందరు తమ ఇంట్లో ఉన్న ఎసిలను ఉపయోగించాలంటే జంకుతున్నారు. ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే ఎసి వాడకం ద్వారా ఆ లక్షణాలు అందరికీ వ్యాపించే ప్రమాదం కూడా లేకపోలేదనే భయందోళనలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెంట్రలైజ్డ్ ఏసిలు వాడకూడదని, అయితే విండో ఏసిలు వాడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మరి కొందరు 25 నుండి 30డిగ్రీల ఉష్ణోగ్రత మించకుండా ఎసిలను సెట్ చేసుకుంటున్నారు. అలాగే కూలర్లను కూడా ప్రజలు ఎక్కువగా వాడడం లేదు. కొంతవరకు వేడి తగ్గిపోగానే కూలర్లను స్విచ్చాఫ్ చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగితే కరోనా వైరస్ పెద్దగా వ్యాప్తి చెందబోదని పలు సందర్భాల్లో పలువురు చెబుతున్నారు. అందుకే ఎసి, కూలర్ వాడకంపై స్వీయనియంత్రణ పాటిస్తున్నారు.