‘కాళేశ్వరం’పై వారంరోజుల్లోనే న్యాయవిచారణ
కెసిఆర్ అవినీతికి మద్దతునిచ్చింది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే
రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్ ‘కాళేశ్వరం ప్రాజెక్ట్’ అంశంపైన వారంరోజుల్లోనే న్యాయ విచారణ చేపడుతున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఎవరు తప్పులు చేసినా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే కెసిఆర్ అవినీతికి మద్దతునిచ్చిందని విమర్శించారు. హైదరాబాద్,సచివాలయంలోని మీడియా పాయింట్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బిజెపి,బిఆర్‌ఎస్ పదేళ్ల పాటు కలిసి పనిచేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది రోజులకే తమపై బురద జల్లుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మద్దతిచ్చిందే కేంద్రలోని బిజెపి ప్రభుత్వం అని, పవర్, ఇరిగేషన్ కార్పొరేషన్‌కు చెందిన నిబంధనలు మార్చి, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి రుణాలను ఇచ్చిందని ఆరోపించారు. కార్పొరేషన్ పేరుతో రాష్ట్రానికి కేంద్రం రూ. 1.27 లక్షల రుణాన్ని
ఇచ్చిందన్నారు. ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకే రూ.60వేల లోన్స్‌ఇచ్చారని, బిఆర్‌ఎస్, బిజెపి కలిసి దోచుకుందామనే లక్షల కోట్ల రూపాయాలు ఇచ్చారా అని నిలదీశారు. మేడిగడ్డ వద్ద ఐదు ఫీట్లు కుంగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనీసం వాటిని పరిశీలించలేదని, కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇప్పిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ పై మాజీ సిఎం కెసిఆర్ స్పందించకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రూ. 80వేల కోట్ల ప్రాజెక్ట్‌ను రూ.1.27,000 కోట్లకు పెంచితే కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చిందన్నారు. సిబిఐ, ఇడి అంశంపై కిషన్ రెడ్డి ఎదేదో మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష నాయకులు తప్పు చేయకపోయినా ఇడి కేసులను నమోదు చేసిందని, అలాంటి బిజెపి తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్‌పై ఎందుకు కేసులు నమోదు చేయాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కెసిఆర్‌కు ఏటిఎం అని ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు నాడ్డ పదే పదే అన్నారని, దీనిపైన ఎందుకు విచారణకు అదేశించలేదని అన్నారు. లిక్కర్ కేసులో కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, పదేళ్ల కాలంలో లక్షల కోట్లు రూపాయలను బిఆర్‌ఎస్ నేతలు తిన్నారని బిజెపి ఆరోపిస్తే, దీనిపైన సిబిఐ విచారణ ఎందుకు చేపట్టలేదన్నారు. మేడిగడ్డ డ్యామేజ్ పై ఖర్చు అంతా పూర్తిగా సంస్థనే భరిస్తుందని, ఇరిగేషన్ పై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తామని తెలిపారు. బిజెపి,బిఆర్‌ఎస్ కలిసి 3500 రోజులు పని చేశాయని,నీటిపారుదలలో అవినీతిలో కూడా ఆరెండు పార్టీలు కలిసే చేశాయని ఉత్తమ్ ఆరోపించారు. స్వాతంత్య్రం తర్వతా కూడా సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని ఖండించారు.
ఎవరు తప్పుచేసినా వదలం
RELATED ARTICLES