కొట్లాడుకోవాలని ఎవరూ చెప్పలేదు
చైనా 16 ట్రిలియన్ డాలర్లకు చేరితే… మనం 3.1 ట్రిలియన్ డాలర్ల వద్దే ఆగిపోయాం
మంత్రి కెటి రామారావు
ప్రజాపక్షం/హైదరాబాద్ మతాల పేరుతో కొట్లాడుకోవాలని ఏ దేవుడు చెప్పారని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటి.రామారావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ‘పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్’ను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి కెటిఆర్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ‘తన్నుకు చావాలని ఏ మతం, దేవుడైనా చెప్పిండా?, కృష్ణుడు చెప్పిండా? రాముడు చెప్పిండా? యేసుక్రీస్తు చెప్పిండా? అల్లా చెప్పిండా? నా మనషులను భూమి మీదకు పంపిస్తున్న.. ఎవరి దేవుడు గొప్ప అనే కాంపిటేషన్ పెట్టుకొని తన్నుకు చావండి అని చెప్పిండా?’అని అన్నారు. అసలు మనం ఎందుకు కొట్లాడుతున్నామని, ఎవరి కోసం కొట్లాడుతున్నామని, అందుకు కారణం ఏమిటని, దేని మీద పనిచేస్తున్నామని అన్నారు. ఈ దేశంలో నీళ్లు లేవని ఒకరు ఏడుస్తుంటే, తిండి లేక చస్తుంటే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంటికి ‘నిన్న గాక మొన్ననే’ కరెంట్ వచ్చిందని, ఇలాంటి వాటిపై మనకు సోయి లేదని మండిపడ్డారు. ఏ దేవుడు గొప్ప? అని ప్రశ్నించుకుంటున్నామని, తనను అడిగితే ‘మా అమ్మ గొప్ప’ అని చెబుతానని, ఎవరి అమ్మ గొప్పది అనే కాంపిటేషన్‌కు అర్థముందా?,
ఎవరి అమ్మ గొప్ప?, ఎవరి దేవుడు గొప్ప? అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా? అవకాశం ఉందా? అని కెటిఆర్ ప్రశ్నించారు. మతాల మీద పడి మనం ఎక్కడికో పోతున్నామని, చైనా మాత్రం 16 ట్రిలియన్ డాలర్లకు చేరిందని, మనం 3.1 ట్రిలియన డాలర్ల వద్దనే ఆగిపోయామని, ఇది సిగ్గుపడాల్సిన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం గత ఎనిమిదేళ్లుగా అనేక విజయాలను సాధించిందంటే, మనం దేశానికి 5 శాతం జిడిపి కంట్రిబ్యూట్ చేస్తున్నామని, పురోగతి అంటే ఇదేనని వివరించారు. ఎనిమిదేళ్ల పాలనలో ఏం సాధించారని విమర్శలు చేస్తున్న విపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. జల సంరక్షణలో తెలంగాణ దేశానికే ఓ నమూనాగా మారిందని, సిరిసిల్ల జిల్లా ఐఎఎస్‌లకే జల సంరక్షణ పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిందన్నారు.
మతం పేరుతో రాజకీయాలు:
ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమై, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కెటిఆర్ విమర్శించారు. దేశచరిత్రలో తెలంగాణకు ఒక్క విద్యాసంస్థను కూడా కేటాయించని కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అంటే, అది ప్రస్తుత మోడీ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల భారం మోపి పక్కదారి పట్టించేందుకే కులం, మతాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశంలో తిండి కోసం ఎంతో మంది అల్లాడుతున్నారని,అలాంటి వారి గురించి ఆలోచించడం మానేసి అనవసర విషయాలపై ఎందుకు దృష్టి పెడుతున్నారన్నారు. మిషన్ భగీరథ పథకం అమలు చేసిన తర్వాతనే నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య తీరిందని, ఈ విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షేకావత్ స్వయంగా చెప్పారని, సంకుచిత రాజకీయాల కోసం మాత్రం ఇక్కడ తమ ప్రభుత్వాన్ని బిజెపి విమర్శిస్తోందన్నారు. ఉన్నత విద్య కోసం రాబోయే రోజుల్లో మరింత ఖర్చు చేస్తామని, బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులను టిహబ్‌తో అనుసంధానం చేసి కొత్త ఆవిష్కరణలకు మార్గం వేస్తామన్నారు. వర్తమాన రాజకీయాలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ, భారత రాజ్యాంగం పట్ల అందరికీ అవగాహన కల్పించాలని, ఇక్కడి స్టడీ మెటీరియల్ హార్డ్ కాపీలతో పాటు సాష్ట్ కాపీలుగా కూడా అందుబాటులో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కాగా యూనివర్సిటీకి రూ. 11లక్షలు విరాళంగా ఇచ్చిన సుధీర్ డ్డిని మంత్రి కెటిఆర్ అభినందించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గడిచిన 8 ఏళ్లుగా విద్యారంగంలో మార్చు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఉన్నత విద్యా రంగంలో డిమాండ్‌కు తగినట్టుగా మార్పు తీసుకురావాలని సిఎం కెసిఆర్ చెబుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 90వేల ఉద్యోగాలను ప్రకటించగానే, ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కెసిఆర్ సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. పోటీపరీక్షల అభ్యర్థులకు మంచి మెటీరియల్‌ను కూడా అందజేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కె. సీతరామారావు సభాధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ వాణిదేవి తదితరులు పాల్గొన్నారు.
ఎవరి దేవుడు… వారికి గొప్ప
RELATED ARTICLES