అక్రమ లేఔట్లు వేస్తే ఆంక్షలే : కోర్టుకు నివేదించిన ప్రభుత్వం
ప్రజాపక్షం/హైదరాబాద్
ఎల్‌ఆర్‌ఎస్ స్కీం అమలు చేయడం ఇదే తొలిసారి కాదని, గతంలో రెండుసార్లు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేసిందని రాష్ట్ర సర్కార్ హైకోర్టుకు నివేదించింది. గతంలో మాదిరిగా ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ జిఒ 131తో పాటు కొ న్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ మెమో ఇచ్చిందని తెలియజేసింది. ఈ సారికి మాత్ర మే అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు అనుమతి ఇస్తున్నామని, ఇకపై అక్రమ లేఔట్లు వేస్తే అవి రిజిస్ట్రేషన్లు కాకుండా ఆంక్షలు విధించామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ జిఒ 131 చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్‌పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. క్రమబద్ధీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, 2015లో తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా చేసినట్లు గుర్తు చేశారు. 2015లో జిఒ 151 జారీ కావడంతో సుమారు 4 లక్షలలోపు దరఖాస్తులు వస్తే సుమారు మూడు లక్షలలోపు దరఖాస్తులను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. మరోసారి అక్రమ లేఔట్లు వేసేందుకు వీలు లేకుండా ఇప్పుడున్న లేఔట్లదారులు నష్టపోకుండా ప్రభుత్వం జిఒ 131 ఇచ్చిందన్నారు. ఇకపై అక్రమ లేఔట్లను కొనుగోలు చేస్తే వాటిని రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకుండా షరతులు విధించామన్నారు. పైగా వాటిలో గృహ నిర్మాణాలకు కూడా అనుమతులు రాబోవన్నారు. అంతేకాకుండా నీరు,డ్రైనేజీ, రోడ్లు వంటి సౌకర్యాల కల్పన కూడా ప్రభుత్వం చేయదన్నారు. ఇప్పటి వరకూ జరిగిన లోపాలను సరిచేస్తే ఎవరూ నష్టపోరని, ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 20.45 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. దీని ద్వారా వచ్చే రాబడిని ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు వినియోగించేలా ప్రత్యేక ఖాతాలో దరఖాస్తు రుసుమును జమ చేశామన్నారు. ప్రభుత్వానికి అధికారం ఉందని, అందుకు అనుగుణంగా జిఒ 131 ఇచ్చామని, తమ వాదనను ఆమోదిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కౌంటర్‌లో హైకోర్టును కోరారు.
ఎల్‌ఆర్‌ఎస్ కొత్తకాదు
RELATED ARTICLES