HomeNewsBreaking Newsఎల్‌బినగర్‌ కూడలికి శ్రీకాంతాచారి పేరు

ఎల్‌బినగర్‌ కూడలికి శ్రీకాంతాచారి పేరు

ఫ్లు ఓవర్‌ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు
ప్రజాపక్షం/రంగారెడ్డి ప్రతినిధి/ వనస్థలిపురం
హైదరాబాద్‌లోని ఎల్‌.బి నగర్‌ కూడలికి శ్రీకాంతాచారి పేరు పెడతామని రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. ఎల్‌.బి నగర్‌లో 32 కోట్ల రూపాయలతో వనస్థలిపురం నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్లేందుకు వీలుగా 700 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఫ్లు ఓవర్‌ను శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ ఎల్‌.బినగర్‌ నియోజకవర్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులను తీర్చేందుకు 650 కోట్ల రూపాయలతో 12 పనులను చేపట్టామని, వాటిలో ఇప్పటివరకు 9 ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన బైరమలగూడ చౌరస్తాలోని కుడి,ఎడమతోపాటు సెప్టెంబర్‌ నాటికి మొత్తం 12 పనులు పూర్తి చేసుకున్నందుకు ముమ్మరం చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్లువుర్ల నిర్మాణంతో ఎల్‌.బి నగర్‌ సర్వాంగ సుందరంగా, ట్రాఫిక్‌ రహిత సెంటర్‌గా మారిందన్నా రు. అంతేకాకుండా ప్రజా రవాణా మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. నాగోల్‌ నుండి ఎల్‌.బి నగర్‌ వరకు మెట్రో అనుసంధానం చేయడంతో పాటు మరోసారి తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ అధికారం చేపట్టిన తరువాత హయత్‌నగర్‌ వరకు మెట్రో రైల్‌ పొడుగించడం, ఎల్‌.బినగర్‌ నుండి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వరకు మెట్రోరైలు అనుసంధానం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంత్‌చారి పేరును ఎల్‌.బి.నగర్‌ కూడలికి పెడతామని, అదేవిధంగా ఫ్లు ఓవర్లకు మాల్‌ మైసమ్మ ఫ్లు ఓవర్లుగా నామకరణం ఇస్తామని మంత్రి కెటిఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు నగరంలో అవసరమైన చోట్ల ఫ్లు ఓవర్లు, అండర్‌ పాసింగ్‌ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం ఎస్‌ఆర్‌డిపి ద్వారా 47 పనులు ప్రారంభించిందన్నారు. ఇందులో ఇప్పటివరకు జిహెచ్‌ఎంసి నిధులతో 32 పనులు పూర్తయ్యాయని, మిగతా శాఖలకు సంబంధించిన ఆరు పనుల్లో మూడు పూర్తి కాగా, మరో మూడు వివిధ ప్రగతి దశలో ఉన్నాయని తెలిపారు. ఎల్‌.బి నగర్‌ ఫ్లు ఓవర్‌ను సివిల్‌ పనులు,యుటిలిటి షిప్టింగ్‌తో పాటు భూసేకరణ ఖర్చులతో కలుపుకొని మొత్తం రూ.32 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, స్థానిక ఎంఎల్‌ఎ సుధీర్‌ రెడ్డి, ఎంఎల్‌సిలు మహేందర్‌ రెడ్డి, జిహెచ్‌ఎంసి కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
కొత్తపేట మాజీ కార్పొరేటర్‌పై దాడి
ఇందిలా ఉండగా, మంత్రి కెటిఆర్‌ మాట్లాతుండగా స్టేజీ మీదకు వస్తున్న కొత్తపేట మాజీ కార్పొరేటర్‌ రమణరెడ్డిని స్టేజీ మీదకు రాకుండా చేసి కొంత మంది గుర్తుతేలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. దీంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. అందరూ కలిసి ఉండగానే అతనిపై దాడి ఎలా జరిగిందని స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోతున్నారు. ఎంఎల్‌ఎ అనుచరులు ఉండి ఉండిచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
ఎంఎల్‌ఎ అనుచరులే నాపై దాడి చేశారు. రమణరెడ్డి
కావాలనే ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డి తన అనుచరులతో నాపై దాడి చేయించారని కొత్తపేట మాజీ కార్పొరేటర్‌ రమణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. నూతన ప్లుఓవర్‌ ప్రారంభోత్సవంలో మాకు మంత్రి నుంచి సమాచారం ఉండడంతో వచ్చామని, కానీ స్టేజీ మీదకు వెళ్లుతుండగా ఎంఎల్‌ఎ అనుచరులు చొక్క కాలర్‌ పట్టుకుని వెనుకకు లాగి స్టేజీ వెనుక భాగంలో భౌతికంగా తనపై దాడి చేశారన్నారు. ఎంఎల్‌ఎ కావాలనే కుట్రతో దాడి చేయించారని, తనకు ఎమీ జరిగిన పూర్తి బాధ్యత ఎంఎల్‌ఎ వహించాలన్నారు. దీనిపై అధిష్టానాకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
ఎవరిపై దాడి చేయించాల్సిన అవసరం నాకులేదు : సుధీర్‌రెడ్డి
ఎవరిని దాడి చేయాల్సిన అవసరం తనకు లేదని ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డి తెలిపారు. వందల మందిలో ఎవరో అతనిపై దాడి చేస్తే ఎంఎల్‌ఎకు సంబంధం ఎలా ఉంటదన్నారు. రమణరెడ్డి తనకు శత్రువు కాదని, అతనితో ఎలాంటి ఎలాటి విభేదాలు లేవన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments