ప్రాథమిక హక్కుల ఉల్లంఘన.. క్విడ్ప్రొకోకు దారితీసే అవకాశాలు
స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ఇకపై బాండ్స్ జారీ చేయవద్దని ఎస్బిఐకి ఆదేశం
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు కీలక తీర్పు చెప్పింది. రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి నిధులను అనుమతించే కేంద్ర ప్రభుత్వ ఎలక్టోరల్ బాండ్స్ పథకం చట్టబద్ధతను సవాలు చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సిపిఎం, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ (ఎడిఆర్) వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఈ పథకం రా జ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం పౌ రులకు లభించిన సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిం ది. ఎలక్టోరల్ బాండ్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం గత ఏడాది విచారణ ముగించి, తీర్పును నవంబర్ 2న రిజర్వ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. గురువారం తీర్పును వెల్లడిస్తూ, ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీ లు విడదీయలేని విభాగాలని, వాటికి నిధులు ఎలా అందుతున్నాయనే విషయం కూడా ఓటర్లకు తెలియాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. ఎలక్టోరల్ బాండ్స్ పథకంతో పాటు, ఆ పథకాన్ని అమలు చేయడానికి వీలుగా ఆదాయపు పన్ను చట్టం, కంపెనీల చట్టం మొదలైన వాటిలో చేసిన సవరణలను కూడా సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ బాండ్ల ను ఇకపై జారీ చేయవద్దని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)ని కోర్టు ఆదేశించింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోగా సమర్పించాలని కూడా ఎస్‌బిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇసి ఈ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా మార్చి 13వ తేదీన తన వెబ్సైట్లో ఉంచాలని సూచించింది. 2018లో ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్స్ వ్యవస్థ ద్వారా అత్యధిక లబ్ధిపొందిన భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి ఈ తీర్పు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇది మన ఎన్నికల ప్రజాస్వామ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపే అత్యంత ముఖ్యమైన తీర్పుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయ పార్టీలకు ఇంత డబ్బును ఎవరు విరాళంగా ఇస్తున్నారో తెలుసుకోవడానికి పౌరులకు ఉన్న ప్రాథమిక హక్కును ఎలక్టోరల్ బాండ్స్ పథకం ఉల్లంఘిస్తున్నదని ధర్మాసనంలోని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. నల్ల ధనాన్ని అరికట్టడానికి ఇదొక్కటే మార్గం కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో చట్ట విరుద్ధంగా కొనసాగే నగదు ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోవాలని హితవు పలికింది. ఈ బాండ్స్ వల్ల క్విడ్‌ప్రొకో అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల నుంచి లాభాలను ఆశించి, విరాళాలు ఇచ్చేవారు పెరుగుతారని, ఫలితంగా అధికార దుర్వినియోగానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. రాజకీయ నిధుల్లో పారదర్శకతను తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగమని పేర్కొంటూ, రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా 2018 జనవరి 2న ప్రభుత్వం ఈ ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం నిబంధనల ప్రకారం ఎలక్టోరల్ బాండ్స్‌ను భారత పౌరుడు లేదా దేశంలో విలీనమైన లేదా స్థాపించిన సంస్థ ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి ఒంటరిగా లేదా ఇతర వ్యక్తులతో కలిసి ఎలక్టోరల్ బాండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29ఎ కింద నమోదైన, లోక్‌సభకు లేదా రాష్ట్ర శాసనసభకు జరిగిన గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1 శాతానికి తగ్గకుండా ఓట్లు సాధించిన రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్‌ను పొందడానికి అర్హత సంపాదిస్తాయి. నోటిఫికేషన్ ప్రకారం ఎలక్టోరల్ బాండ్స్ అర్హత కలిగిన రాజకీయ పార్టీ అధీకృత బ్యాంకులో ఖాతా ద్వారా మాత్రమే నగదు రూపంలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. కాగా, 2019 ఏప్రిల్లోఎలక్టోరల్ బాండ్ల పథకంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశంలో ఎన్నికల ప్రక్రియ పవిత్రతపై తీవ్ర ప్రభావం చూపే ’అత్యంత తీవ్రమైన అంశాలను’ కేంద్రం, ఎన్నికల సంఘం లేవనెత్తినందున, పిటిషన్లపై లోతైన విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జెబి పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది అక్టోబర్ 31న కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, సిపిఎం, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఎడిఆర్) దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై వాదనలు ప్రారంభించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో నగదును తగ్గించాల్సిన అవసరాన్ని అత్యున్నత న్యాయస్థానం నొక్కిచెప్పింది.
‘ఎలక్టోరల్ బాండ్స్’ రాజ్యాంగ విరుద్ధం
RELATED ARTICLES