స్పష్టం చేసిన బాంబే హైకోర్టు.. పరువునష్టం దావా కొట్టివేత
నాగపూర్: ఏదైనా కేసులో పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలను పరిశీలించి, వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరంగానీ, బాధ్యతగానీ మీడియాకు లేదని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ స్పష్టం చేసింది. లోక్‌మత్ మీడియాపై ఓ వ్యక్తి వేసిన పరువునష్టం దావాను కొట్టివేసింది. కేసు వివరాల్లోకి వెళితే, పిటిషనర్, అతని కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదైంది. కోర్టుకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ సమర్పించారు. అందులోని అంశాల ఆధారంగా 2016 మే 20వ తేదీన లోక్‌మత్ పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది. అయితే, అందులోని అంశాలన్నీ తన ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించాడు. లోక్‌మత్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ విజయ్ దర్దా, ఆ పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ రాజేంద్ర దర్దాపై పరువునష్టం దావా వేశాడు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలు, చేసిన ఆరోపణలు సరైనవా? కావా? అని సరిచూసుకోకుండా, ఏకపక్షంగా వార్తను ప్రచురించారని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తనకు నష్టపరిహారం ఇప్పించాలని కోరాడు. కేసును విచారించిన ముంబయి కోర్టు నాగపూర్ బెంచ్ విస్పష్టమైన తీర్పునిచ్చింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలను పబ్లిషర్ సరిచూసుకోవాలని, వాస్తవాలను తెలుసుకోవాలని అనుకోవడం పొరపాటని వ్యాఖ్యానించింది. ఎఫ్‌ఐఆర్‌తో మీడియాకు సంబంధం లేదని, అందులోని అంశాల ఆధారంగా వార్తను ప్రచురించడం నేరం కాదని తేల్చిచెప్తూ కేసును కొట్టివేసింది.
ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలతో.. మీడియాకు సంబంధం లేదు
RELATED ARTICLES