సిఎం రాక కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్న పోడు రైతులు
ఏరువాకకు సిద్ధమవుతున్న అన్నదాతలు
మళ్లీ రగులుతున్న పోడు పోరు
మొదలైన అటవీశాఖ దాడులు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పోడు సమస్య ప్రధానమైంది. రాష్ట్రవ్యా ప్తంగా లక్షలాది ఎకరాల పోడు నరికి సాగు చేసుకుంటున్నారు. ఇందులో నాలుగైదు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూ ములు కూడా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఖమ్మంజిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేసింది. వైఎస్ హయాంలో పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చిన భూముల్లో కూడా రైతులను అటవీశాఖాధికారులు గత రెండుమూడు సంవత్సరాలుగా అడ్డుకుంటున్నారు. ప్రతి ఏడాది జూన్, జూలై మాసాల్లో పోడు భూములకు సంబంధించి అధికారులకు, పోడు రైతులకు మధ్య పోరు నడుస్తుంది. పోడును అడ్డుకునే ప్రయత్నం చేయడం దానికి రైతాంగం ఎదురుతిరగడం ప్రతి యేటా జరుగుతూనే ఉంది. అనేక దశాబ్దాలుగా అడవిని నమ్ముకుని పోడును నరికి సాగు చేసి జీవిస్తున్న పోడు రైతులను కాదంటే వారి జీవితం గడవడం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. పూర్తిగా భూమిని నమ్ముకున్న రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. పోడు పేరుతో గ్రామాలపై నిర్బంధం, పెద్ద సంఖ్యలో రైతులను జైళ్లకు తరలించడం, పోలీసు వలయాలను ఏర్పాటు చేయడం, సమీప గ్రామాల్లో భయానక పరిస్థితులు సృష్టించడం చూస్తున్నాం. పోడు రైతుల సమస్య గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో పోడు రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి జిల్లాకు వచ్చి పోడు రైతుల సమస్యను పరిష్కరిస్తాను. అటవీ, రెవిన్యూ, పోలీస్ అధికారులతో సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసి అర్హత కలిగిన ప్రతి రైతుకు పట్టాదారు పాసుపుస్తకం అందించడంతో పాటు రైతుబంధును వర్తింపజేస్తానని హామీ ఇచ్చారు. ఇది జరిగి రెండేళ్లు కావస్తున్నా పోడు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరగలేదు. రెండేళ్లుగా తమ సమస్య పరిష్కారం అవుతుందని ఎదురు చూసిన రైతాంగానికి తీవ్ర నిరాశే ఎదురైంది. పోడు రైతుల్లో 90 శాతం రైతులు, గిరిజనులు, దళితులు ఉన్నారు. భూమినే నమ్ముకున్న వారు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడడంతో ఖరీఫ్ సీజన్ మొదలైంది. రైతులు భూములు దున్నడానికి వెళ్లడం తిరిగి భూముల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేయడంతో అటవీ సమీప గ్రామాల్లో ఘర్షణలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పోడు భూములకు సంబంధించి సానుకూల నిర్ణయం తీసుకుని అర్హత కలిగిన ప్రతి రైతుకు పట్టాదారు పాసుపుస్తకం అందించి తద్వారా రైతుబంధు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని పోడు రైతులు కోరుతున్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో పోడు సాగు చేస్తున్నారు. ఇందులో చాలా మందికి పట్టాలున్నా రైతుబంధు అందడం లేదు. పోడు రైతుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుని మరోసారి అధికారులు, రైతుల మధ్య సమస్యకు తావివ్వకుండా పరిష్కరించాలని కోరుతున్నారు.
ఎప్పుడొస్తారు సారూ..?
RELATED ARTICLES