ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నిలిపివేత : హైకోర్టు తీర్పు
ప్రజాపక్షం/ అమరావతి ఆంధ్ర ప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ఎన్‌ఇసి జారీ చేసిన షెడ్యూల్‌కు బ్రేక్ పడింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ షెడ్యూల్ ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్టు హై కోర్టు ప్రకటించింది. కోవిడ్ నేపథ్యంతోపాటు, ఈనెల 16న టీకా కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన తగదని ప్రభుత్వం వాదించింది. ప్రజా రోగ్యాన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టే ప్రయత్నాలు తగవని పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసి) తరఫున హాజరైన న్యాయవాది అశ్వినీ కుమార్ తన వాదనలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌కు, కోవిడ్ సమస్యకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వాక్సినేషన్, ఎన్నికల నిర్వహణ ఏకకాలంలో సాధ్యం కాదంటూ ఏపీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్‌స్‌ఈసీ మాత్రం వాక్సినేషన్‌తో ఎన్నికలకు సంబంధం లేదని అభిప్రాయపడింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా షెడ్యూల్ సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. వాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదన్న అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్న ఎన్‌ఈసీ న్యాయవాది అశ్వినీ కుమార్ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. కాగా, ఈ నిర్ణయంపై కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతించాలని హైకోర్టును అశ్వినీ కుమార్ కోరారు. దీనిపై కోర్టు స్పందిస్తూ, డివిజన్ బెంచ్‌కి వెళ్లాలని సూచించింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో నిర్వహించాలంటూ షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ఈనెల 8న జారీ చేసిన విషయం విదితమే.
ఎపి పంచాయతీకి బ్రేక్
RELATED ARTICLES