HomeNewsBreaking Newsఎపి గవర్నర్‌గా అబ్దుల్‌ నజీర్‌

ఎపి గవర్నర్‌గా అబ్దుల్‌ నజీర్‌

బిశ్వబూషణ్‌ హరిచందన్‌ ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ
మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్‌ బైస్‌ నియామకం
భగత్‌సింగ్‌ కొశ్యారీ, ఆర్‌కె మథూర్‌ రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
న్యూఢిల్లీ :
పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం గవర్నర్‌గా ఉన్న బిశ్వబూషణ్‌ హరిచందన్‌ ఛతీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌గా భగత్‌సింగ్‌ కొశ్యారీ స్థానంలో రమేష్‌ బైస్‌ను నియమించారు. దేశంలో ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నరను నియమించగా, మరో ఏడు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేసింది. కొత్తగా నియమితులైన ఆరుగురు గవర్నర్లలో 2019లో అయోధ్య తీర్పు ఇచ్చిన జడ్జీల్లో ఒకరైన రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జీ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ కాగా, మరో నలుగురు బిజెపి నేతలు ఉన్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కొశ్యారీ, లడఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆర్‌కె మథూర్‌ల రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించినట్లు రాష్ట్రపతిభవన్‌ అధికార ప్రతినిధి చెప్పారు. జార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న రమేష్‌ బియాస్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించినట్లు అధికారులు తెలిపారు. ఛత్రపతి శివాజీపై భగత్‌సింగ్‌ కొశ్యారీపై తీవ్ర వ్యాఖ్యలు చేయగా, ప్రతిపక్షాలు ఆయనపై ఘాటుగా విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే గత నెలలో కొశ్యారీ ప్రధాని మోడీని కలిసి తాను గవర్నర్‌ పదవి నుంచి తప్పుకుంటానని విన్నవించారు. అదే విధంగా తాను శేష
జీవితాన్ని పుస్తకాలు రాయడం, చదవడం, ఇతర కార్యకలాపాలతో గడుపాలనుకుంటున్నట్లు మోడీకి వివరించారు. 80 ఏళ్ల కొశ్యారీ మహారాష్ట్ర గవర్నర్‌గా 2019 సెప్టెంబరులో పదవీ ప్రమాణం చేశారు. కాగా, లఢక్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న మథూర్‌ ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ తెలియని విషయమే. మథూర్‌ స్థానంలో లఢక్‌ ఎల్‌జిగా అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బ్రిగ్‌ బిడి మిశ్రా (రిటైర్డ్‌)ను రాష్ట్రపతి నియమించినట్లు అధికార ప్రతినిధి చెప్పారు. మాజీ సుప్రీంకోర్టు జడ్జి అయిన జస్టిస్‌ నజీర్‌ను ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించారు. ఇప్పటి వరకు ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ 2023 జనవరి 4న సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి రిటైర్‌ అయ్యారు. అయోధ్య రామజన్మభూమి కేసులో తీర్పు చెప్పిన ధర్మాసనంలో ఆయన కూడా ఉన్నారు. ఈ ధర్మాసనంలో ఉన్న ఏకైక ముస్లిం జడ్జి ఆయన. 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనంలో కూడా ఆయన ఉన్నారు. ఈ ప్రక్రియ సరైనదేనని ఈ ధర్మాసనం తీర్పు చెప్పింది. లెఫ్టినెంట్‌ జనరల్‌ కైవల్య త్రివిక్రమ్‌ పర్నాయక్‌ (రిటైర్డ్‌)ను అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించినట్లు రాష్ట్రపతి భవన్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పర్నాయక్‌ ఆర్మీలో ప్రతిష్టాత్మక నార్తరన్‌ కమాండ్‌ కమాండర్‌గా సేవలందించారు. ఆయన పదవీకాలం సందర్భంగా 2013లో పాకిస్థాని దళాలు పూంచ్‌ జిల్లాలో ఇద్దరు జవాన్ల మృతదేహాలను ఛిద్రం చేశాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సహా నలుగురు బిజెపి నేతలు కొత్తగా గర్నర్లుగా నియమితులయ్యారు. సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య, జార్ఖండ్‌కు సిపి రాధాకృష్ణన్‌, హిమాచల్‌ప్రదేశ్‌కు శివప్రతాప్‌ శుక్లా, అసోంకు గులాబ్‌ చంద్‌ కటారియా గవర్నర్లుగా నియమితులైనట్లు అధికార ప్రతినిధి వివరించారు. అందులో ఆచార్య యుపి మండలిలో సభ్యుడు కాగా, రాధాకృష్ణన్‌ బిజెపి తరుపున కోయంబత్తూర్‌ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. శుక్లా బిజెపి అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికై 2022లో పదవీ విరమణ పొందారు. కటారియా రాజస్థాన్‌ అసెంబ్లీలో సిట్టింగ్‌ ప్రతిపక్షనేతగా ఉన్నారు. గతంలో వసుంధర రాజే ప్రభుత్వ హయాంలో హోంశాఖమంత్రిగా పనిచేశారు. బైస్‌, మిశ్రా, హరిచందన్‌ కాకుండా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ అయిన వారిలో… అనసూయ యుకేయిని ఛత్తీస్‌గఢ నుంచి మణిపూర్‌కు, గణేషన్‌ను మణిపూర్‌ నుంచి నాగాలాండ్‌కు, ఫగు చౌహాన్‌ను బీహార్‌ నుంచి మేఘాలయకు రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ నుంచి హిమాచల్‌ నుంచి బీహార్‌కు బదిలీ బదిలీ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments