349 సీట్లతో కాషాయ కూటమికి భారీ మెజారిటీ
94 స్థానాలు గెల్చుకున్న యుపిఎ
నేడు కేబినెట్ : 3లోగా 17వ లోక్‌సభకు ఏర్పాటు
తెలంగాణలో ఫలితాలు అనూహ్యం
టిఆర్‌ఎస్‌కు షాక్
రాష్ట్రంలో పుంజుకున్న బిజెపి, కాంగ్రెస్
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నిక సమరంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ విజయం సాధించింది. బిజెపిని ఓడించడంలో లౌకిక, ప్రజాతంత్ర శక్తు లు మరోసారి ఘోరంగా ఓడిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి ప్రధానమంత్రి అవుతున్నారు. ఏడు దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ కడపటి వార్తలు అందేసరికి 349 స్థానాలతో పూర్తి మెజారిటీని సాధించింది. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలతో కూడిన యుపిఎ 100 మార్క్ దాటకుండానే ఆగిపోయింది. ఈ కూటమి తొలి వార్తలు అందేసమయానికి 94 స్థానాలతో రెండోస్థానంలో నిలవగా, ఇతర పార్టీలు అటుఇటుగా వంద స్థానాలు సాధించాయి. 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆది నుంచీ మోడీ బృందం ఆధిక్యతను చాటడంతో ఉత్కంఠకు తెరపడింది. దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్‌డిఎ క్లీన్‌స్వీప్ సాధించగా, కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ కొంతమేరకు ప్రభావం చూపింది. కేరళలో యుడిఎఫ్, తమిళనాడులో డిఎంకె సారథ్యంలోని యుపిఎ, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపి, తెలంగాణలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిలు మిశ్రమ ఫలితాలు సాధించగా, కర్నాటకలో బిజెపి హవా ప్రదర్శించింది. ఉత్తరాదిన బిజెపి దాదాపు పూర్తిస్థాయి ఆధిక్యతను చాటుకున్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమేథీలో పరాజయంపాలు కాగా, వాయనాడ్‌లో గెలిచారు. ఇక యుపిఎ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ రాయ్‌బరేలీలో గెలిచారు. మోడీని తాజా లోక్‌సభ ఎన్నికలు మరోసారి ప్రధానిగా నిలిపాయి. అదే ప్రభంజనంతో 2014 నాటి పనితీరుకన్నా మెరుగ్గానేకాక ఈసారి 300 మార్కును కూడా సొంత బలంతోనే దాటొచ్చని ట్రెండ్ ఫలితాల ద్వారా తెలిసింది. రాత్రి 7.30 గంటల వరకు మొత్తం 542 లోక్‌సభ సీట్లలో బిజెపి 42 సీట్లు గెలుచుకోగా 260 స్థానాల్లో ఆధిక్యతను కనబరిచింది. కాగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించగా, 40 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తోంది. వారణాసిలో ప్రధాని మోడీ 4.3 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందగా, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా గాంధీనగర్ నుంచి 5.5 లక్షల ఆధిక్యతతో గెలుపొందారు. ఆ తర్వాత మోడీ, షా ఇద్దరు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చినప్పుడు వారిని మద్దతుదారులు ఉత్సాహంగా స్వాగతించారు. అభిమానులు మోడీపై గులాబీ రేకులు వెదజల్లుతుండగా ఆయన గెలుపు చిహ్నాన్ని చూపారు. ఆ తరాత ఆయన బిజెపి సిద్ధాంతకర్తలైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామా ప్రసాద్ ముఖర్జీల ప్రతిమలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మోడీ ‘ఈసారి 300 దాటుతాం’(అబ్‌కీ బార్ 300 పార్) అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పి-బిఎస్‌పి కలిసి బిజెపితో తలపడినప్పటికీ బిజెపి మంచి ఫలితాలనే రాబట్టింది. మోడీ ప్రభంజనం హిందీ మాట్లాడే ప్రాంతాల్లోనే కాక పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా వీచింది. కాకపోతే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మోడీ ప్రభంజనం లేదనే చెప్పాలి. తెలంగాణలో బిజెపి నాలుగు సీట్లు గెలుచుకోనున్నది. కాగా టిఆర్‌ఎస్ తొమ్మిది సీట్లు గెలుచుకోవచ్చని సమాచారం. ఒడిశాలో బిజెపి మొత్తం 21 సీట్లలో తొమ్మిది గెలుచుకోనున్నది. కాగా బిజూ జనతాదళ్ 12 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. జమిలీ ఎన్నికలు జరగ్గా ఒడిశా అసెంబ్లీలో బిజెడియే తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోబోతునది. తమిళనాడులో డిఎంకె 20 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ మొత్తం 20 సీట్లలో 19 స్థానాల్లో ముందంజలో ఉంది.