నేడే లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్
న్యూఢిల్లీ: బడ్జెట్ కంటే ముందు నుంచే అటు ప్రజలు… ఇటు సంస్థల ఆశలు పెరుగుతా యి. అంచనాలు ఊపందుకుంటాయి. సాధారణంగా ఏటా వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టే ప్రభుత్వాలు, ఎన్నికల సంవత్సరంలో మాత్రం తాత్కాలిక లేదా ఓట్ ఆన్ బడ్జెట్ మాత్రమే సభ ముందు ఉంచుతాయి. ఈ ఆనవాయితీ ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటి, గురువారం ప్రవేశపెట్టనున్నారు. ఇందులో కీలక నిర్ణయాలు ఏవీ ఉండవని ఆమె ఇది వరకే ప్రకటించినప్పటికీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఏవైనా కొన్ని రాయితీలు లేదా ఉపశమనాలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రత్యేకించి ఆదాయపన్ను శ్లాబ్‌ను సవరిస్తారని సామాన్యుడు కోటి ఆశలతో ఉన్నాడు. 17వ లోక్‌సభ చివరి సమావేశాలు బుధవారం రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభంకాగా, 2024 25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెడతారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వ ఆదాయ, వ్యయాలు ఈ బడ్జెట్‌లో ఉంటాయి. అయితే, ఇది ఒక సంప్రదాయంగా కొనసాగుతున్నది. అంతేగానీ, ఈ బడ్జెట్‌లో ఎలాంటి కీలక ప్రకటనలు ఉండవని స్పష్టమవుతున్నది. కానీ, యువత, మహిళలు, రైతులు, పేద వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే ఓ కార్యక్రమంలో సూత్రప్రాయంగా తెలియ చేయడంతో వివిధ వర్గాల వారు ఆశలు పెంచుకున్నారు. మంత్రి వ్యాఖ్యలను బట్టి, నాలుగు ప్రధాన రంగాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఉండవచ్చని సమాచారం. అందుకలో భాగంగానే, రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయాన్ని రూ. 6 వేల నుంచి రూ. 9 వేలకు పెంచునున్నారని సమాచారం. అలాగే మహిళా రైతులకు పెట్టుబడి సాయం రూ.12 వేలు చేస్తారన్న ఊహాగానాలూ ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లకు కరోనా వైరస్ విజృంభణ సమయంలో పెండింగ్ పెట్టిన డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌లకు సంబంధించిన 18 నెలల బకాయిలు విడుదల చేయాలనే ప్రతిపాదనలు కేంద్ర వద్ద ఉన్నాయి. వీటిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆదాయపు పన్నుకు సంబంధించి మరింత ఊరట కల్పించాలని ట్యాక్స్ పేయర్స్ కోరుతున్నారు. అలాగే రివైజ్డ్ ఐటిఆర్ గడువు పెంచాలని, ట్యాక్స్ మినహాయింపులు కల్పించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఏదైనా ప్రకటన చేయవచ్చని అంటున్నారు. బ్యాంకు ఖాతాదారులకు పన్ను మినహాయింపులు కల్పిస్తూ సేవింగ్స్ ఖాతా వడ్డీపై స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్‌ను రూ.50 వేలకు పెంచుతారని కూడా అంటున్నారు. ఆటోమొబైల్ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించి అభివృద్ధికి తోడ్పడాలని ఆయా రంగాల నుంచి వినతులు వస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగం అనుకూలమైన విధానాన్ని ఆశిస్తోంది. ఔషధాల ధరలు పెరగడంతో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని, వాటి నియంత్రణకు తగిన చర్యలు అవసరమని కోరుతున్నది. అత్యవసర ఔషధాలపై జిఎస్‌టిని తగ్గిచడం, క్లిష్టమైన ఔషధాల జనరిక్ వెర్షన్‌లను తయారు చేసే మందుల కంపెనీలకు పన్ను మినహాయింపులు కల్పించాలని డిమాండ్ వినిపిస్తున్నది. అలాగే ఔషధ పరిశ్రమలో న్యాయమైన పోటీని ప్రోత్సహించేందుకు పరిశోధన మద్దతు ఇంకా చొరవలతో కూడిన బహుముఖ విధానం అవసరమని ఔషధ రంగ నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్‌లో ఈ దిశగా నిర్ణయాలను ఆశిస్తున్నారు. ఎన్నికల వేళ జనాకర్షక నిర్ణయాలు ఉంటాయి కాబట్టి, వివిధ రంగాలకు ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే, ఏ ఒక్క అంశంపై ఎలాంటి స్పష్టతగానీ, అధికారిక ప్రకటనగానీ లేవు. నిర్మల ప్రవేశపెట్టబోయే ఓట్ ఆన్ బడ్జెట్‌లో ఏఏ అంశాలు ఉంటాయన్నది మరికొన్ని గంటల్లో స్పష్టమవుతుంది.
ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు..
RELATED ARTICLES