రెండు కీలక కేసులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జనవరి 2వ తేదీన రెండు కీలక కేసులను విచారించనుంది. వాటిలో మొదటిది ఎన్నికల సంస్కరణలకు సంబంధించిందికాగా, మరొకటి బలవంతపు మతమార్పిడుల అంశానికి చెందింది. 2018లో ఎన్నికల సంస్కరణలపై సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ లెజిస్లేటివ్ శాఖ కార్యదర్శిపై లోక్ ప్రహారీ అనే ఒక ఎన్‌జిఒ ఆరోపణలు చేసింది. కోర్టు ధిక్కరణ కింద అతనిపై చర్య తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఈ ఏడాది నవంబర్ 11న సదరు కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు, విచారణను జనవరి రెండో తేదీన జరపనుంది. ఎన్‌జిఒ తరఫున పిటిషన్‌నుదాఖలు చేసిన ఎస్‌ఎన్ శుక్లా పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌తో పోలిస్తే, మరుసటి ఎన్నికల సమయానికి ఆస్తులు రెట్టింపైన ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక విధాయక వ్యవస్థను ఏర్పాటు చేయలేదని జస్టిస్ ఎస అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో ఆస్తుల గురించి పూర్తి వివరాలు ఇవ్వని లేదా తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై ప్రజా ప్రాతినిథ్యం చట్టం 1951లోని 123(2) అధికరణ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆ అంశాన్ని కేంద్రం విస్మరించిందని పేర్కొన్నారు. అదే విధంగా, చట్టసభలకు ఎన్నికయ్యేందుకు అనర్హుడిగా ప్రకటించే అంశాలు లేదా కేసులు ఏవైనా ఉన్నాయా అనే విషయాన్ని పేర్కొంటూ దాఖలు చేసే ఫామ్ 26లోనూ కోర్టు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోలేదని శుక్లా తన పిటిషన్‌లో తెలిపారు. ఎన్నికలు, అభ్యర్థుల విషయాల్లో పారదర్శకత అవసరమన్న విషయాన్ని స్పష్టం చేస్తూ, సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను విస్మరించినందుకుగాను, సదరు కార్యదర్శిపై విచారణ జరపాలని శుక్లా కోరారు.
బెదిరించి.. మభ్యపెట్టి..
ఏదో ఒక రకంగా బెదిరించి, మభ్యపెట్టి మత మార్పిడులకు పాల్పడుతున్న ఘటనలపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవి కుమార్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం జనవరి రెండున విచారించనుంది. బలవంత మతమార్పిడులు దేశానికి ప్రమాదకరమని సుప్రీం కోర్టు ఇప్పటికే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కొంత మంది బెదిరించి, భయపెట్టి లేదా ఆశలు చూపి మత మార్పిడులకు పాల్పడుతున్నారని, ఈ అకృత్యాన్ని ఆపాలని కోరుతూ అశుతోష్ కుమార్ అనే అడ్వొకేట్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇది వరకే విచారణకు స్వీకరించింది. ప్రజలకు మత స్వేచ్ఛ ఉందని, అయితే, బలవంతపు మార్పిడులు క్షేమదాయకం కాదని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగాయో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాను సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆ కేసుపై విచారణను కొనసాగించనుంది. ఇలావుంటే, ఇతర మతాల్లోకి మారిన దళితులను ఎస్‌సిలుగా పరిగణించడానికి వీల్లేదని కేంద్రం సుప్రీం కోర్టులో ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, ఇది రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని కూడా మత మార్పిడుల అంశంతో చేర్చి విచారించే అవకాశాలున్నాయి.
ఎన్నికల సంస్కరణలు.. బలవంతపు మత మార్పిడులు..
2న ‘సుప్రీం’ ముందుకు
RELATED ARTICLES