సభ్యుల్లో అసమ్మతి సెగలు
సమావేశాలకు గైర్హాజరవుతున్న అశోక్ లవాసా
భిన్నాభిప్రాయాలు సహజమన్న అరోరా
న్యూఢిల్లీ: ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకొని, మెజారిటీ పక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల సంఘంలో అంతర్గతం గా లుకలుకలు తీవ్రమయ్యాయి. సంఘం సభ్యుల మధ్య మరోసారి అభిప్రాయభేదాలు భగ్గుమన్నా యి. ముగ్గురు సభ్యుల్లో ఒకరైన అశోక్ లవాసా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సమావేశాలకు గైర్హాజరవుతున్నట్లుగా బయటపడింది. పైగా ఆయన ప్రతి సమావేశంలోనూ అసమ్మతి నోట్‌ను సమర్పించినా, మిగతా కమిషనర్లు దాన్ని పట్టించుకోవడం లేదు. ఆయన రాసిన లేఖ ప్రకంపనలు సృష్టించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నది ఆయన పరోక్షంగా చేసిన ప్రధాన ఆరోపణ. ఎన్నికల ప్రచార సభల్లో నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కన్పిస్తోంది. దీంతోపాటు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారంటూ ప్రధాని నరేం ద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల పై కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన అంశంలో ఇసి క్లీన్‌చిట్ ఇచ్చిన విషయంలోనూ ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమై ఆయన మే4న కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాకు లేఖ కూడా రాశారు. క్లీన్‌చిట్ ఇచ్చే సమయంలో తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, మైనారిటీ నిర్ణయాలకు ప్రాధాన్యం దక్కడం లేదని అశోక్ ఆరోపించారు. ఇసి ఆదేశాల్లో మైనారిటీ నిర్ణయాలనూ జత చేయాలని లేఖలో పేర్కొన్నారు.లేఖ రాసినప్పటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులను ఇసి సీరియస్‌గా తీసుకోలేదని, ఈ విషయంపై ఆయన మనస్తాపం చెందారని అశోక్ లవాసా సన్నిహితులు మీడియాకు తెలిపారు. అరోరా, మరో సభ్యుడు సుశీల్ చంద్ర తీసుకుంటున్న నిర్ణయాలతో ఆయన బలవంతంగా సమావేశాలకు దూరంగా ఉండాల్సివస్తోందని వారు తెలిపారు. ప్రధాని మోడీ కొద్ది రోజుల క్రితం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపైనా ఇసి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కనీసం ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా అభ్యర్థులను వారించడం వంటివి కూడా ఇసి చేయలేదని సన్నిహితుల ముందు అశోక్ వాపోయినట్లు తెలుస్తోంది.ఈ విషయంపై అరోరాకు అశోక్ లవాసా ఎన్ని సందేశాలు పంపినా వాటికి ఆయన సమాధానం ఇవ్వలేదని, దీంతో మనస్తాపం చెంది లవాసా ఎన్నికల సంఘం సమావేశాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం.