రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్
గెలిచిన ఎంఎల్‌ఎల పేర్లతో గెజిట్ విడుదల
గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు అందజేత
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తెలిపారు. గెలుపొందిన ఎంఎల్‌ఏల జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్‌కె రుడోలా, జాయింట్ సిఇఒ అమ్రపాలి, ఇతర అధికారులతో కలిసి గవర్నర్ నరసిహన్‌కు గజిట్ నోటిఫికేషన్ ద్వారా అందజేసినట్లు వెల్లడించారు. ఇదే జాబితాను అసెంబ్లీ సెక్రెటరీకి కూడా అందజేసినట్లు తెలిపారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని, ఎలక్షన్ కోడ్ కూడా ముగిసిందని రజత్ కుమార్ అన్నారు. గెలుపొందిన సభ్యుల జాబితాను, పార్టీల వారీగా ప్రచురిస్తూ గజిట్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేశామన్నారు. గవర్నర్ నరసింహన్‌కు గజిట్ నోటిఫికేషన్ అందజేయక ముందు రజత్ కుమార్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈవిఎంలను ట్యాంపరింగ్‌చేశారంటూ ప్రజాకూటమి పార్టీలు చేస్తున్న ఆరోపణలపై రజత్ కుమార్ స్పందిస్తూ “ఈవిఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదు, కొందరు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. పోలింగ్ పూర్తయ్యాక ఈవిఎంలను స్ట్రాంగ్ రూమ్ ల్లో భద్రపరుస్తాం. కేంద్ర బలగాల భద్రత కూడా ఉంటుందన్న విషయం ఆయా పార్టీలు గుర్తుంచుకోవాలి” అని రజత్ కుమార్ అన్నారు. సోషల్ మీడియాలోనూ ఓట్ల గల్లంతుపై పలు పోస్టింగ్‌లను చూసి ఆశ్చర్యపోయానన్నారు. 22 లక్షల ఓట్లు గల్లంతు అయినట్లు పోస్ట్ చేశారని, నిజంగా అన్ని ఓట్లు గల్లంతైతే ఓటర్ల చాలా చోట్ల నిరసనలు వ్యక్తం చేసే వారని అన్నారు. ఇప్పటికి అసెంబ్లీ ఎన్నికల ముగిసినప్పటికీ , ఓటర్ల జాబితాలో పేర్ల నమోదును మళ్లీ ఈ నెల 24 నుండి ప్రారంభిస్తామన్నారు. ఇప్పుడైనా పేర్లు లేని వాళ్లు నమోదు చేసుకుని ఓటింగ్‌కు అవకాశం పొందాలన్నారు. డిసెంబర్ 31తో 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని రజత్ కుమార్ తెలిపారు. క్రీడాకారిణి జ్వాలాగుత్తా ఓటు గల్లంతుపై అధికారుల నుండి వివరాలు తెప్పించుకున్నానని, 2016లోనే డిలీట్ జాబితాలో ఉందన్నారు. చిరునామాలు మారితే మళ్లీ కొత్త అడ్రస్‌లో చేర్చుకోవాలని, ఎప్పటికప్పుడు జాబితాను చెక్ చేసుకునే అవకాశం ఉన్నా ఆ పని ఓటర్లు చేయడం లేదన్నారు. గెలుపొందిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పెట్టిన ఖర్చుల వివరాలను నెల రోజుల్లో ఇసికి అందజేయాలని సూచించామన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన అధికారులకు, మీడియాకు ధన్యవాదములు తెలియజేస్తున్నానన్నారు.
ఎన్నికల కోడ్ ముగిసింది
RELATED ARTICLES