రైతుల్లో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి
గత ఎన్నికల్లో పోడు ప్రభావిత ప్రాంతాలలో ప్రతికూలత
తక్షణ పరిష్కారమే మార్గం
ప్రజాపక్షం/ ఖమ్మం పోడు భూమి సమస్య వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికరంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఆరేడేళ్లుగా పోడు సమస్యను పరిష్కరించకుండా సాగదీస్తూ వచ్చింది. కొద్ది కాలం క్రితం దరఖాస్తు చేసుకున్న వారికి హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఆ సమస్య పరిష్కార దిశగా ముందుకు సాగడం లేదు. రెవెన్యూ అధికారులు, అటవీ అధికారులు రకరకాల కొర్రీలతో అర్హులైన అనేక మందికి భూమిపై హక్కు కల్పించేందుకు ఇబ్బందులు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు నరికి సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. నవంబరు ఎనిమిది నుంచి 18 వరకు 24 పోడు ప్రభావిత జిల్లాల నుంచి 1.40 లక్షల దరఖాస్తులు రాగా ఇందులో 4.50 లక్షల ఎకరాలకు సంబంధించిన భూమి ఉంది.గిరిజనేతరుల నుంచి కూడా మరో రెండున్నర లక్షల ఎకరాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. అంటే మొత్తంగా రాష్ట్రంలో ఏడు లక్షల ఎకరాలకు సంబంధించి పోడు సమస్య పరిష్కారం కావాల్సి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యథికంగా 2.90 లక్షల ఎకరాలకు సంబంధించి 82,737 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మంజిల్లాలో 42,560 ఎకరాలకు గాను 18,295 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలనలో ప్రాథమిక దశలోనే ఎక్కువ భాగం దరఖాస్తులను తిరస్కరించారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. పోడు సమస్యకు సంబంధం లేని అనేక అంశాలను తీసుకు వచ్చి గ్రామసభలలో దరఖాస్తులను తిరస్కరించారు. తాతలు, తండ్రుల వారసత్వం నుంచి వస్తున్నప్పటికీ వయసు చాల లేదని 2005 నాటికి 18 ఏళ్లు లేవంటూ రకరకాల అంశాలను తెరపైకి తీసుకు వచ్చారు. ప్రభుత్వం అర్హులైన పోడు రైతులకు భూ హక్కు పత్రాలను ఇస్తుందన్న నమ్మకం క్రమేణ పోడు రైతుల్లో సన్నగిల్లుతుంది. గత ఎన్నికల్లో పోడు ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి కేసిఆర్ భారీ బహిరంగ సభలను నిర్వహించి తానే పోడు సమస్యలను పరిష్కరిస్తానని అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులను తీసుకు వచ్చి రెండు రోజుల పాటు కుర్చీ వేసుకుని కూర్చుని పోడు అర్హత కలిగిన పోడు రైతులకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పిన మెజార్టీ పోడు రైతులు ముఖ్యమంత్రి మాటలను విశ్వసించలేదు. గోదావరి పరివాహక ప్రాంతం ముఖ్యంగా పోడు ప్రభావిత ప్రాంతాలలో బిఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, ములుగు, వైరా, భూపాలపల్లి, ఆసీఫాబాద్ వరకు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాల్లో సగం స్థానాలకు పైగా పోడు ప్రభావిత ప్రాంతాలలోనే గెలుపొందడం గమనార్హం. ఈ విషయంపై బిఆర్‌ఎస్ నాయకత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పోడు సమస్యను పరిష్కరించక పోతే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే వామపక్షాలు సహా విపక్ష పార్టీలు పోడు ప్రభావిత ప్రాంతాలలో సమస్యగా చూపెడుతూ ప్రభుత్వతీరును తప్పుబడుతున్నాయి. పోడు భూములకు సంబంధించి సాగు చేసుకుంటున్న రైతుల దరఖాస్తులను తిరస్కరించడం అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వారిని బలవంతంగా బయటకు పంపడం, పోలీసులు, అటవీ శాఖాధికారుల దాడులు ప్రజల్లో ప్రభుత్వం పట్ల ప్రతికూలతను తీసుకు వచ్చాయి. ఇప్పటికైనా పోడు సమస్యను సాగదీయకుండా తక్షణ పరిష్కారం జరిగే రీతిలో చర్యలు చేపట్టాలని పోడు రైతులు కోరుతున్నారు.
ఎన్నికల్లో పోడు సమస్య ఇబ్బందికరమే..!
RELATED ARTICLES