కమ్యూనిస్టులతోనే సమాజానికి ప్రయోజనం
అభినందన సభలో కూనంనేని
ప్రజాపక్షం/ ఖమ్మం కష్టాలతో కమ్యూనిస్టు పార్టీ ఎదిగిందని ఓట్లు, సీట్లు రాకపోయినా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు మనో ధైర్యంతో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతూనే ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఎర్ర జెండా బలపడితేనే సమాజానికి మంచిదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పొత్తులు అనివార్యమవుతున్నాయని, కరోనా కంటే ప్రమాదకారియైన బిజెపిని ఎదుర్కొనేందుకు టిఆర్‌ఎస్‌కు మద్ధతు ప్రకటించడం తప్పలేదన్నారు. టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిన ప్రజా సమస్యల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై తొలిసారి ఖమ్మం వచ్చిన కూనంనేనికి సిపిఐ ఖమ్మంజిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక కృష్ణా ఫంక్షన్ హాల్‌లో గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఆర్‌టిసి, సింగరేణి సహా పలు సమస్యల పరిష్కారానికి పోరాట ఎజెండాను రూపొందించుకుని ముందుకు సాగనున్నట్లు ఆయన తెలిపారు. కమ్యూనిస్టులతో పొత్తు ఉంటే ఖమ్మంలో ఏ పార్టీకైనా విజయమేనని ఇది గతంలో పలుమార్లు రుజువైందని సాంబశివరావు తెలిపారు. బలహీనులమన్న భావన రానివ్వవద్దని కార్యకర్తలకు సూచించారు. కమ్యూనిస్టు వృక్షాన్ని కాపాడితే యావత్ సమాజాన్ని కాపాడుతుందని కమ్యూనిస్టు వృక్ష పరిరక్షణకు ఆయన సూచించారు. వామపక్ష ఉద్యమ పోతుగడ్డ, పోరాటాల ఖిల్లాగా కొనసాగుతున్న ఖమ్మంజిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్ణయాత్మక శక్తిగా ఉందని, రానున్న కాలంలో మరిన్ని సమరశీల పోరాటాల ద్వారా పార్టీకి పూర్వ వైభవం రానున్నదని సాంబశివరావు తెలిపారు. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక అవసరమని ఆ గొంతుకు కమ్యూనిస్టు పార్టీయేనని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లాలో గిరిప్రసాద్, మహ్మద్ రజబ్‌అలీతో పాటు అనేక మంది యోధులు కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి కృషి చేశారని, పువ్వాడ నాగేశ్వరరావుతో సహా పలువురు బలమైన ఉద్యమ నిర్మాణానికి కృషి చేశారని సాంబశివరావు గుర్తు చేశారు. ఖమ్మంజిల్లా ప్రజల ప్రేమ, అప్యాయతలు నేను ఈ స్థితికి ఎదగడానికి కారణమయ్యాయని ప్రజలతో మమేకమై మరింతగా పని చేస్తానన్నారు. ఎంపిపిగా, ఎంఎల్‌ఎగా పని చేస్తున్న కాలంలో ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రజలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. టాడా కేసులు, పోలీస్ నిర్బంధాలు ఎదురైనప్పుడు జిల్లా ప్రజలు అండగా నిలిచారని సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాగం హేమంతరావు, మహ్మద్ మౌలానా, దండి సురేష్, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, ఎస్‌కె జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో పొత్తులు అనివార్యం
RELATED ARTICLES