ప్రజా సమస్యలపై పోరాటాలే ముఖ్యం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/ ఖమ్మం సిటీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలే తమకు కొలమానం కాదని, ప్రజా సమస్యలే ఎజెండాగా ఎంచుకుని అలుపెరుగని ఉద్యమాలు నిర్వహించడం కమ్యూనిస్టు పార్టీల కర్తవ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం మాజీ శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. శనివారం ఖమ్మంజిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలో సిపిఐ మండల మాజీ కార్యదర్శి , రైతు సంఘం సీనియర్ నాయకులు బాల నాగేందర్ రెడ్డి సంతాప సభ సిపిఐ గ్రామశాఖ కార్యదర్శి ఆవుల మంగయ్య అధ్యక్షతన జరిగింది. తొలుత నాగేందర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఆయన మాట్లాడారు. నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి తుదిశ్వాస వరకు పోరాడిన ధన్యజీవి నాగేందర్ రెడ్డి అని తెలిపారు. రాజకీయాల్లో స్వార్థం, డబ్బు ప్రభావం పెరిగిన నేటి రోజుల్లో కమ్యూనిస్టుల అవసరం మరింత పెరిగిందని ఆయన తెలిపారు. దేశం కుల, మత, ప్రాంతీయ విద్వేషాలతో రగిలి పోతుందని అన్ని రంగాలలో అవినీతి ముందుకు పోతుందన్నారు. ఇటువంటి సమాజం మన పూర్వీకులు కోరుకోలేదని మెరిసేదంతా బంగారంగా చూపి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని తెలిపారు. వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన కుటుంబం మెరుగైన వైద్యం కోసం లక్షలు ఖర్చు పెట్టినా క్యాన్సర్ మహమ్మారి నుంచి నాగేందర్‌రెడ్డిని రక్షించుకోలేకపోయామని, సమర్థుడైన నాయకున్ని కోల్పోయామన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిపిఐ ప్రాబల్యం ఉన్న చోట పోటీ చేసేందుకు తమ పార్టీశ్రేణులను సర్వం సిద్దం చేస్తుందని తెలిపారు. తెలంగాణలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రకరకాల పథకాల పేరుతో తమ మేనిఫెస్టోలో పొందుపరిచి పేదలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ విషయంలో సిపిఐ పాత్ర అమోఘమన్నారు. తమ స్వ ప్రయోజనాల కోసం అధికార పార్టీ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ ప్రయత్నాలను రానున్న ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టడం ఖాయమన్నారు. సమస్య ఉన్నంత వరకు కమ్యూనిస్టులు సజీవంగా ఉంటారని తెలిపారు. ఈ సభలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండపర్తి గోవిందరావు, తాటి వెంకటేశ్వరరావు, ఏపూరి రవీంద్రబాబు, పోటు కళావతి, జాగర్లమూడి రంజిత్‌కుమార్, ఏపూరి లతాదేవి, సిపిఐ ప్రజా సంఘాల బాధ్యులు తాటి నిర్మల, కన్నెబోయిన విజయమ్మ, కూచిపూడి రవి, పగిళ్లపల్లి ఏసు, సిపిఐ మండల కార్యదర్శి పావులూరి మల్లికార్జున్, సహాయ కార్యదర్శి అబ్బూరి మహేష్, నాయకులు అమర్లపూడి వెంకన్న, సర్పంచ్ నక్కనబోయిన సుజాత, నారపోగు హేమ, పాతూరి వెంకటి, కొల్లి సీతయ్య, సుంకు కృష్ణారెడ్డి, సతీష్, పదిమల వెంకట నర్సయ్య, బిఆర్‌ఎస్ నాయకులు మంకెన రమేష్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, ఆవుల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు కన్నెబోయిన గోపి, కిషోర్, కొప్పుల గోవిందరావు పాల్గొన్నారు.
ఎన్నికలే అత్యున్నతం కాదు
RELATED ARTICLES