HomeNewsBreaking Newsఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము

ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము

దేశంలో మొదటిసారి గిరిజనులకు అవకాశం

న్యూఢిల్లీ : ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్‌టి మహిళ ద్రౌపది ముర్మును ఎంపిక చేశారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు అత్యవసర సమావేశంలో మంగళవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌డిఎ తరపున 20 మంది అభ్యర్థుల పేర్లు పరిశీలించిన అనంతరం ద్రౌపది ముర్ము పేరును పార్లమెంటరీ బోర్డు ఖరారుచేసింది.ద్రౌపదీముర్ము భర్త కీ.శే. శ్యామ్‌ చరణ్‌ ముర్ము. ఈ దంపతలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసిలో 1958 జూన్‌ 20న జన్మించిన ముర్ము తొలుత జార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ముర్ము తండ్రి పేరు బిరాంచీ నారాయణ్‌ టుడు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక గిరిజన మహిళను దేశ అత్యున్నతమైన రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సమావేశం అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు. ఎన్‌డిఎ కూటమిలోని పార్టీలతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాల తరపున యశ్వంత్‌ సిన్హాను ఉమ్మడి అభ్యర్థిగా ఖరారు చేసిన కొద్ది గంటల తేడాలోనే బిజెపి పార్లమెంటరీబోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గిరిజనులకు భారతదేశ అత్యున్నత పదివిలో అవకాశం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గిరిజనులను దేశంలో ఉన్నతస్థానాలలోకి తీసుకకువచ్చేందుకు, వారు ఉన్నత విద్య అభ్యసించి ఉన్నతస్థానాల్లోకి రావడానికి ద్రౌపదీ ముర్ము ఎంపిక దేశంలో గిరిజనులకు స్ఫూర్తిగా ఉంటుందని కూడా నడ్డా చెప్పారు. తొలుత ఉదయం పార్టీ నేతలు బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందుగా వెంకయ్యనాయుడును కలుసుకున్నారు. దాంతో ఆయననే పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు దీటుగా ఆమోదయోగ్యమైన రీతిలో అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేయడంలో భాగంగా ఎన్‌డిఎ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. 2015 మే 18 నుండి 2021 జులై 12 వరకూ ఆమె జార్ఖండ్‌ తొమ్మిదవ గవర్నర్‌గా పనిచేశారు. 2000 మార్చి 6 నుండి 2004 మే 16 వరకూ ముర్ము ఒడిశా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2000 నుండి 2009 వరకూ ఒడిశా శాసనసభ్యురాలుగా పనిచేశారు.
తొలుత వెంకయ్యనాయుడుపేరు హల్‌చల్‌
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ తరపు అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పోటీ చేస్తారన్న వార్త తొలుత హల్‌చల్‌ అయ్యింది. బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందుగా మంగళవారం ఉదయం కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌ షా, రక్షణశాఖామంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడానికి బిజెపి కీలక సమావేశం త్వరలో జరగనున్న తరుణంలో ఈ ముగ్గురు నాయకులు ఉపరాష్ట్రపతితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుందని అంతా భావించారు. అధికారపార్టీతోసహా ఎన్‌డిఎ పార్టీలు వెంకయ్యనాయుడును రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎన్నుకుంటారన్న ఊహాగానాలు మిన్నంటాయి. అధికార బిజెపికి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎలక్టోరల్‌ కాలేజ్‌లో 48 శాతం ఓట్లు వాటా ఉంది. వెంకయ్యనాయుడు సోమవారంనాడు మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీనుండి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్ళారు. కానీ ఆయన తన పర్యటన కుదించుకుని వెంటనే మంగళవారంనాడే తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. భారత 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు 2017లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం ఆగస్టు 11వ తేదీతో ముగుస్తుంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments