HomeNewsBreaking Newsఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యునిరసన ప్రదర్శన

ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యునిరసన ప్రదర్శన

అన్నీ రాజాసహా కార్యకర్తల నిర్బంధం
రెజ్లర్ల సమస్య వినేందుకు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ తిరస్కృతి
న్యూఢిల్లీ :
ఏడుగురు మహిళా రెజ్లర్లను వేధింపులకు గురిచేసిన ఉదంతంలో వారి ఫిర్యాదును ఎఫ్‌ఐఆర్‌ చేయాలని, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు) చేసిన డిమాండ్‌ను ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ తిస్కరించారు. మహిళా సమాఖ్య ప్రతినిధుల నుండి మెమొరాండం స్వీకరించేందుకు పోలీస్‌ కమిషనర్‌ తిరస్కరించడంతో మహిళా సమాఖ్య కార్యకర్తలు, నాయకులు మంగళవారం ఢిల్లీ పోలీసు కేంద్ర కార్యాలయం ఎదుట తీవ్ర స్థాయిలో భారీ నిరసన ప్రదర్శన జరిపారు. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా సహా మహిళా కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. లైంగిక వేధింపుల కేసులో నిందితులపై తక్షణం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. పోలీసులు వారిని నిర్బంధించి పార్లమెంట్‌ స్ట్రీట్‌లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. లైగింక వేధింపులకు గురైన రెజ్లర్లకు న్యాయం చేసేందుకు తక్షణం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని మహిళా సమాఖ్య డిమాండ్‌ చేసింది. “పని ప్రదేశంలో రెజ్లర్లను వేధింపులకు గురిచేశారు, నిందితులపై పోస్కో చట్టం కింద కేసులు పెట్టాలి, ఒక కాలపరిమితికి లోబడిఈ కేసు దర్యాప్తు, ప్రక్రియ పూర్తి చెయ్యాలి, బాధితులకు న్యాయం చేస్తామన్న భరోసా ఇవాలి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో విఫలమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి” అని మహిళా సమాఖ్య డిమాండ్‌ చేసింది. తక్షణం ఢిల్లీ పోలీసులు స్త్రీ పురుష సమానత్వంపై ప్రజా చైతన్య కార్యక్రమాలను ప్రారంభించాలని కూడా ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా డిమాండ్‌ చేశారు. ఆమె నాయకత్వాన మహిళా ప్రతినిధులు పోలీస్‌ కమిషనర్‌కు మెమొరాండం సమర్పించేందుకు మొదట పోలీసు కేంద్ర కార్యాలయానికి వెళ్ళారు. కనీసం ప్రతినిధులను కలిసి వారి విజ్ఞాపన పత్రం స్వీకరించేందుకు కూడా పోలీస్‌ కమీషనర్‌ ఇష్టపడలేదు. తీవ్రమైన లైంగిక వేధింపుల కేసులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లకు న్యాయం చేయాలని కోరుతూ మహిళలు వెళితే వారితో మాట్లాడేందుకు కూడా తిరస్కరించి అగౌరవ పరచడంతో మహిళా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు కేంద్ర కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనకు దిగారు. జాతీయ,అంతర్జాతీయస్థాయి మహిళా రెజ్లర్లను బిజెపి ఎంపి ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ సహా పలువురు కోచ్‌లు రెజ్లర్లను వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిపై ఫిర్యాదు చేయడానికి ప్రాథమికంగా డబ్ల్యుఎఫ్‌ఐ దగ్గరకు వెళితే బాధిత రెజ్లర్లకు కమిటీ సభ్యులు డబ్బులు ఆశచూపించి నోరు మూయించే ప్రయత్నం చేశారని రెజ్లర్లు ఆరోపించడంతో ఈ కేసు మరింత తీవ్ర రూపం దాల్చింది. పోలీసులు కూడా ఎంపి బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా కేసు నమోదు చేసుకోవడానికి తిరస్కరించారు. మూడు నెలలు గడచినప్పటికీ ఇంతటి తీవ్రమైన విషయంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడాన్ని మహిళా సమాఖ్య తీవ్రంగా తప్పు పట్టింది. అయితే క్రమంగా పరిస్థితి తీవ్రరూపం దాలుస్తోందని భావించిన డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ తీరిగ్గా వెళ్ళి మహిళా నాయకుల నుండి మెమొరాండం స్వీకరించారు. తర్వాత మహిళా సమాఖ్య కార్యకర్తలు జంతర్‌ మంతర్‌ వద్ద పగలూ రాత్రీ తేడా లేకుండా నిరసన ప్రదర్శన కొనసాగిస్తున్న రెజ్లర్ల వద్దకు వెళ్ళి వారికి తమ పూర్తి మద్దతు తెలియజేశారు. “రెజ్లర్లకు జరిగిన అన్యాయంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంపట్ల మహిళా సమాఖ్య తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నది, “పోష్‌” చట్టం లోని నిబంధనల ప్రకారం పోలీసులు తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి, కానీ పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి ఈ కేసులో వారిపై దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించవలసి ఉంటుంది, అందుకు మరో మార్గం లేదు, ఎఫ్‌ఐఆర్‌ నమోదు లీగల్‌గాఒక ప్రాథమిక చర్య, ఇది అనివార్యం, పైగా ఫిర్యాదు చేసినవారంతా అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, వారు తమ స్వేదం చిందించి భారత జాతీయ పతాకాన్ని అంతర్జాతీయ వేదికలపై సమున్నతస్థానంలో నిలబెడుతున్నారు, వారు దేశానికి కీర్తి ప్రతిష్టతు తీసుకువస్తున్నారు, ఫిర్యాదు చేసినవారిలో ఒక మైనర్‌ కూడా ఉన్నారు” అని మహిళా సమాఖ్య తన మెమొరాండంలో పేర్కొంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments