HomeNewsBreaking Newsఎన్‌ఎఐ సోదాలు

ఎన్‌ఎఐ సోదాలు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) సోమవారం సోదాలను నిర్వహించింది. పౌరహక్కుల నేతలు, అమరబంధు, మిత్రుల సంఘం నాయకుల ఇండ్లలో సుమారు తొమ్మిది ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌, విద్యానగర్‌లో నివాసం ఉంటున్న హైకోర్ట్‌ న్యాయవాది సురేష్‌ నివాసంలో సుమారు 8గంటల పాటు సోదాలు నిర్వహించారు. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌తో పాటు, సెల్‌ఫోన్‌, పలు డాక్యుమెంట్లను ఎన్‌ఐఎ అధికారులు స్వాధీనంచేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని కొందరుమండలంలోని పాత ఆగిరాల గ్రామం గుమ్మడి రామచంద్రయ్య నివాసంలో కూడా ఎన్‌ఐఎ తనిఖీలు నిర్వహించి రెండు డైరీలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆల్వాల్‌లోని సుభాష్‌నగర్‌లోని అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు భవాని ఇంట్లో తనిఖీలు చేశారు. విప్లవ సాహిత్యంతో పాటు అనుమానాస్పద డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. హబ్సిగూడలోని సుఖ రిసార్ట్‌లో నివాసం ఉంటున్న వరవరరావు స్నేహితుడు రాజు ఇంట్లో కూడా ఎన్‌ఐఎ అధికారులు సోదాలు నిర్వహించారు. పైడిపల్లిలోని మావోయిస్టు సృజన అలియాస్‌ నవత అలియాస్‌ రాగో ఇంట్లో అధికారులు మూడు గంటల పాటు విస్తృతంగా తనిఖీ చేపట్టారు. హన్మకొండలోని ప్రకాశ్‌రెడ్డి పేటలోని పౌర హక్కుల నేత ఇంట్లో సోదాలు నిర్వహించగా, మావోయిస్టు సృజన తల్లి శాంతమ్మ ఉపయోగించే ఫోన్‌ను, సృజన రాసిన ఉత్తరాలను విప్లవ సాహిత్య పుస్తకాలను కూడా ఎన్‌ఐఎ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. సోమవారం ఉదయం నుండే తనిఖీలు చేపట్టడంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. కాగా సోదాలు నిర్వహించిన అనంతరం ఎన్‌ఐఎ అధికారులు కొందరి వాంగ్మూలాలను తీసుకున్నారు.
ఎన్‌ఐఎ దాడులను ఖండించిన ప్రజాపంథా
తెలుగు రాష్ట్రాలలో పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం పనిచేస్తున్న దాదాపు 60 మంది ఇండ్లపై ఎన్‌ఐఎ చేసిన దాడులను సిపిఐ(ఎం.ఎల్‌.) ప్రజాపంథా ఖండించింది. సిఎల్‌సి నాయకుడు శ్రీమన్నారాయణతో సహా మహిళా కార్యకర్తల ఇంట్లో సోదాలు చేస్తూ భయానక వాతావరణాన్ని కల్పించారని, వారు ఫాసిజానికి వ్యతరేకంగా, ప్రజల హక్కుల కోసం మాట్లాడడం, రాయడం, పనిచేయడం నేరంగా పరిగణి స్తున్నారని ప్రజా పంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు సోమవారం ఒకప్రకటనలో పేర్కొన్నారు. మోడీ రాజ్యంలో మాట, పాట, రాత నిషేదమైందన్నారు.
దాడుల వెనుక రాజకీయ హస్తం
ఎన్‌ఐఎ దాడుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని హైదదర్‌గూడలో పౌరహక్కుల నేతలు, విప్లవ రచయితల సంఘాల నాయకులు సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కులకు ఎన్‌ఐఎ భంగం కలిగిస్తోందని, ఈ దాడుల్లో ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, కెసిఆర్‌కు సంబంధం ఉన్నదని వారు ఆరోపించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో ఎన్‌ఐఎ తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసిందని, ఈ దాడులు పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, ఈ దాడుల వెనుక రాజకీయ నేతల హస్తం ఉన్నదని పౌరహక్కుల నేత నారాయణరావు విమర్శించారు. నిషేధిత వస్తువులు, పుస్తకాలను ఎన్‌ఐఎ అధికారులు తీసుకొచ్చి,తమ ఇంట్లో పెట్టి, ఫోటోలు, వీడియోలు తీసి అక్రమ కేసులు పెడుతున్నారని బాధితుడు కృష్ణతెలిపారు. ఉదయం 5 గంటలకు కొందరు తమ ఇంటి గోడ దూకి ఇంట్లోకి వచ్చారని, తన భార్య ఆత్మకూరు భవాని పేరుతో సెర్చ్‌ వారెంట్‌ ఇచ్చారని కృష్ణ తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments