వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి
కెసిఆర్ ప్రభుత్వం సాగుకు 24 గంటల విద్యుత్ ఇస్తుందనడం అబద్ధం
కాంగ్రెస్ నేతల సవాళ్లను మంత్రులు స్వీకరించాలి
ప్రజాపక్షం / హైదరాబాద్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై తాను అమెరికాలో మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి బిఆర్‌ఎస్ నేతలు తప్పుదారి పట్టించారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదని ఆనాడు టిడిపి మానవవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా
ఉన్న కెసిఆరే నాటి టిడిపి ప్రభుత్వంతో చెప్పించారని అన్నారు. హైదరాబాద్‌లో తన నివాసంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపి మల్లు రవి తదితరులతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ విధానాలను ఎన్‌ఆర్‌ఐలకు చెప్పానని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉచిత విద్యుత్‌పై కొందరు నిపుణుల సందేహాలకు సమాధానం మాత్రమే ఇచ్చానన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను తీసువచ్చిందే నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటన జరిగినప్పుడు కెసిఆర్ తెలుగుదేశంలోనే ఉన్నారన్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదని ఆనాడు కెసిఆరే చంద్రబాబు ప్రభుత్వంతో చెప్పించారని గుర్తు చేశారు.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైలు మీదనే చేశారన్న విషయాన్ని అధికార పక్షం గ్రహించాలని రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల సాగుకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ఉచిత విద్యుత్‌తో పాటు రాయితీపై ఎన్నో వ్యవసాయ పనిముట్లు ఇచ్చామని.. అలాగే వేల కోట్లను ఇన్‌పుట్? సబ్సిడీలుగా రైతులకు కాంగ్రెస్? ప్రభుత్వమే ఇచ్చిందనే విషయం మరిపోకూడదన్నారు.అలాగే దేశవ్యాప్తంగా రూ.72వేల కోట్ల వ్యవసాయ రుణాలను నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిందని చెప్పారు.
ప్రస్తుతం కెసిఆర్ ప్రభుత్వం 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తుందని చెప్పకోవడం అబద్ధమని, రాష్ట్రంలో ఏ సబ్ స్టేషన్‌లోనైనా లాగ్ బుక్ తీసుకొని చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపి కోమిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంఎల్‌సి జీవన్ రెడ్డిలు పది గంటల కంటే ఎక్కువ ఉచిత విద్యుత్ ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తామని సవాలు విసిరారని, దమ్ముంటే కెటిఆర్, హరీశ్ రావులు స్వీకరించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఉచిత్ విద్యుత్ పేరుతో కెసిఆర్ ప్రభుత్వం 20వేల మిలియన్ యూనిట్లను కొనగులో చేస్తున్నామని చెప్పి, రూ.16వేల కోట్లు వెచ్చిస్తున్నామని చెబుతున్నారని, కేవలం పది గంటలే విద్యుత్ ఇస్తూ, మిగతా విద్యుత్‌ను ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. కేవలం ప్రైవేటు కంపెనీలతో కుమ్మక్కై అక్రమంగా డబ్బులు పొందేందుకే ఉచిత విద్యుత్‌ను అనుచితంగా కెసిఆర్ వాడుకుంటున్నారని చెప్పారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్? ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని గతంలో కెసిఆర్ అవి ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చిందని, ఇదే విషయాన్ని సెప్టెంబర్ 17న మేనిఫెస్టోలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఎడిట్ చేసితప్పుదోవ పట్టించారు!
RELATED ARTICLES