HomeNewsBreaking Newsఎడతెరిపిలేని వర్షం… స్తంభించిన జనజీవనం

ఎడతెరిపిలేని వర్షం… స్తంభించిన జనజీవనం

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల్లో విస్తారంగా వానలు
ప్రాజెక్టుల్లోకి భారీగా వరద : నిజాంసాగర్‌ 5 గేట్లు ఎత్తివేత
ప్రజాపక్షం / న్యూస్‌నెట్‌వర్క్‌

ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్‌ సహా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టుల్లో క్రమంగా నీటిమట్టాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు భారీ ప్రవాహం వస్తోంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి.. దిగువన గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో భారీగా వస్తుండగా.. 4 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 90 టిఎంసిలు కాగా.. ప్రస్తుతం 89.7 టిఎంసిలతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. గేట్లు ఎత్తడంతో గోదావరి నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఆదివారం రాత్రి నుండి సోమవారం మద్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి భారీ ఎత్తున వరదనీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి 36,500 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని నీటిపారుదల ప్రాజెక్టు ఎఇ శివకుమార్‌ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఎగువ ప్రాంతం నుండి వచ్చిన నీటిని ప్రాజెక్టు 10,8,6,3,2 వరదగేట్లు ఎత్తివేసి 5 గేట్ల ద్వారా 30 వేల క్యూసెక్కుల వరదనీటిని మాంజీరాలోకి వదిలిపెడుతున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా కాగా ప్రస్తుతం 1404.42 అడుగులు. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 17.802 టిఎంసిలకు గాను 16.964 టిఎంసిల నీటినిల్వతో కొనసాగుతుందని ఆయన వివరించారు. రైతులు, పశుకాపరులు, మత్స్యకారులు ఎవరూ మాంజీరా వరద కాలువలోకి దిగరాదని, ఆయకట్టు పరిధిలోని పంటపొలాల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్మల్‌ జిల్లా కడెం జలాశయానికి ఎగువన ఉన్న ఆదిలాబాద్‌ జిలా ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. కడెం జలాశయంలోకి 13,300 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. 3 వరద గేట్ల ద్వారా 29,889 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కడెం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 696.52 అడుగులకు చేరింది.
నిజామాబాద్‌లో ఎడతెరిపిలేకుండా వర్షం
ఇదిలా ఉండగా.. నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న వర్షంతో.. జిల్లా కేంద్రమంతా జలమయమైంది. నగరంలోని రైల్వేస్టేషన్‌, బస్టాండ వీక్లీ మార్కెట్‌, బోధన్‌ రోడ్డులోని మాలపల్లి రహదారులు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని పులాంగ్‌ వాగు వరద నీటితో పరుగులు పెడుతోంది. వెంగల్‌పాడ్‌ వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దర్పల్లి-సిరికొండ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో భారీ వర్షం కురుస్తోంది. పాతికేళ్లలో ఎన్నడూ లేనివిధంగా.. గాంధారి వాగుకు వరద పోటెత్తింది. వరద ప్రవాహానికి దిగువన ఉన్న వరి పొలాలు నీట మునిగాయి. వాగు సమీపంలో ఉన్న కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.
జగిత్యాల జిల్లాలో కొట్టుకుపోయిన కార్లు
జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోరుట్లలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చుట్టుపక్కల ఉన్న వాగుల ఉధృతికి భారీగా వరద నీరు చేరడంతో పంట పొలాలు సైతం నీటి మునిగాయి. తాత్కాలిక రహదారుల వద్ద రోడ్డు కోతకు గురై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పట్టణంలోని ఆదర్శనగర్‌, ప్రకాశం రోడ్డు, కల్లూరు రోడ్డు, ఝాన్సీ రోడ్‌ తదితర ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో ఇక్కడి కాలనీలోని పలు ఇళ్లు సగం వరకు మునిగిపోయాయి. ఈ కాలనీలా పక్కనే చెరువులు ఉండడంతో.. చెరువులు పొంగిపొర్లి వరద నీరంతా ఈ కాలనీల్లో వీదుల్లోకి చేరాయి. మోకాళ్లలోతు నీరు చేరడంతో కాలనీ ప్రజలు నానా అవస్థలు పడ్డారు. భారీ వర్షాలు ఉన్నాయని తెలుసుకున్న పలువురు కుటుంబీకులు ఇంటికి తాళాలు వేసి బంధువుల ఇంటికి ముందస్తుగా చేరుకున్నారు. ఇళ్ల ముందు ఉన్న కార్లు నీటిలో కొట్టుకుపోకుండా ఉండేందుకు పురపాలక అధికారులు జెసిబి సహాయంతో వాహనాలను బయటకు తీసుకువచ్చారు. అలాగే ఎవరికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు.
సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో 60.4 మి.మీ. వర్షం
సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో అల్పపీడన ప్రభావంతో ముసురుతో కూడిన మోస్తారు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 29.3 మిమీ వర్షపాతం నమోదైంది. అధికంగా నారాయణరావుపేటలో 60.4 మిమీ, అత్పతల్పంగా ములుగు మండలంలో 4.6 మిమీ నమోదైంది. దుబ్బాకలో 41.3 మిమీ, సిద్దిపట రూరల్‌ 54.8 మిమీ, చిన్నకోడురు 45.2 మిమీ, బెజ్జంకి 35..మిమీ, కోహెడ 23.1 మిమీ. హుస్నాబాద్‌లో 16.8 మిమీ, అక్కన్నపేట 11.6 మిమీ, నంగునూరు 16.3 మిమీ, సిద్దిపేట అర్బన్‌ మండలంలో 39.8 మిమీ, తోగుట 44.0 మిమీ, మిరుదొడ్డి 37.8 మిమీ, దౌల్తాబాద్‌ 52.9 మిమీ, రాయపోల్‌ 49.2 మిమీ, వర్గల్‌ 11.7 మిమీ, ములుగు 4.6 మిమీ, మర్కుక్‌ 13.1 మిమీ, జగదేవ్‌పూర్‌ 15.4 మిమీ, గజ్వేల్‌ 24.0 మిమీ, కొండపాక 32.2 మిమీ, కొమురవెళ్లి 34.5 మిమీ, చేర్యాల 11.3 మిమీ, మద్దురు 6.3 మిమీ, నారాయణరావుపేట 60.4 మిమీ, దూల్‌మిట్ట 7.6 మిమీ, అక్బర్‌పేట-భూంపల్లి 57.5 మిమీ, కుకునూర్‌పల్లి 14.4 మిమీ వర్షపాతం నమోదైంది. జిలా ్ల వ్యాప్తంగా చెరువులు, కుంటలు నీటితో నిండి నిండు కుండను తలపిస్తున్నాయి.
వికారాబాద్‌లో పొంగిన వాగులు
వికారాబాద్‌ : వికారాబాద్‌ జిల్లా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12గంటలవరకు కుండపోత వర్షం పడింది. తాండూర్‌ , పరిగి,కొడంగల్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. జిల్లా కేంద్రాంలో భారీ వర్షం పడింది. వికారాబాద్‌ నుండి కలెక్టర్‌ కార్యాలయనికి వేళ్లే ఇశా హస్పిటల్‌ ముందు పెద్ద వాగుల నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వికారాబాద్‌ నుండి పరిగి వేళ్లే దారిలో చిట్టేంపల్లి వాగు దాటడానికి నాలుగు గంటల సమయం పట్టింది. మర్పల్లి, ధారూర్‌, బంట్వారం, నవబ్‌పేట్‌, మోమిన్‌పేట్‌, పూడుర్‌, యాలల్‌, బషిరాబాద్‌, పెద్దముల్‌, దౌల్తాబాద్‌, బొమ్‌రాస్‌పేట్‌, దోమ, కుల్కచర్ల , వాగులు వంకలు పొంగిపొర్లాయి. ధారూర్‌ మండల పరిధిలోని నాగసమందర్‌ వేళ్లె రాహదారిని కోట్‌పల్లి అలుగు ప్రవహంతో రాకపోకలు పూర్తిగా నీలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా పత్తి ,మొక్కజొన్న కంది నీటీలో మునిగిపోయాయి. అధిక ఎండలతో పంటలు ఎండిపోయి ,మళ్లీ అధిక వర్షలతో పంటలు పూర్తిగా నష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్ల మధ్య భారీ వరద నీరు చేరడంతో.. స్థానికుల రాకపోకలకు కష్టంగా మారింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments