కేంద్రాన్ని నిలదీసిన సోనియాగాంధీ : ఎజెండాలో చేర్చాలని 9 అంశాలను సూచించిన కాంగ్రెస్ అగ్రనేత
న్యూఢిల్లీ : ఎజెండా ఏమిటో చెప్పకుండా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభు త్వం సిద్ధమవడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ విషయమై తాజా గా కాంగ్రెస్ అగ్రనాయకురా లు సోనియా గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి బుధవారం లేఖ రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే.. ఎజెండాలో మణిపూర్‌లో హింస, ధరల పెరుగుదల సహా 9 అం శాలను చేర్చి చర్చించాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతల పెరుగుదల, ఎంఎస్‌ఎంఈల దుస్థితి… పంటలకు కనీస మద్దతు ధర విషయంలో రైతులకు, రైతు సంఘాలకు భారత ప్రభుత్వం ఇస్తున్న భరోసా, వారు చేస్తున్న ఇతర డిమాండ్లపై ప్రభుత్వ చర్యలు… వెల్లడవుతున్న అన్ని అంశాల దృష్ట్యా అదానీ గ్రూప్ వ్యాపార లావాదేవీలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు చేయించడం… మణిపూర్ ప్రజలు ఎదుర్కొంటున్న ఆవేదన, రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమవడం… హర్యానా వంటి రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతుండటం… భారత భూభాగాన్ని చైనా నిరంతరం ఆక్రమించుకుంటుండటం, లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో సరిహద్దుల వద్ద భారత దేశ సార్వభౌమాధికారానికి సవాళ్లు ఎదురవుతుండటం… కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ అత్యవసరం… కేంద్ర-రాష్ట్రాల మధ్య సంబంధాలకు జరుగుతున్న నష్టం… కొన్ని రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు, మరికొన్ని రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు, వరదల వల్ల ఎదురవుతున్న పర్యవసానాలను ఎజెండాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ‘ఇతర రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీలను ప్రకటించారు. ఈ సమావేశాల ఎజెండా ఏమిటో మాకెవరికీ కనీస అవగాహన లేదు. మొత్తం ఐదు రోజుల పాటూ ప్రభుత్వ ఎజెండాకే కేటాయించినట్లు మాకు తెలిసింది. అయితే వచ్చే సమావేశాల్లో కొన్ని అంశాలను చర్చకు తీసుకురావాలని మేం కోరుతున్నాం’ అని సోనియా గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. అయితే.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్ని బహిష్కరించే ఆలోచన కాంగ్రెస్‌కు లేదని ఆ పార్టీ ఎంపి జైరాం రమేశ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల్ని ప్రస్తావించేందుకు దీనిని ఒక అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రతి పార్టీ తన వంతు కృషి చేస్తుందని అన్నారు. ఎఐసిసి కార్యాలయంలో మాట్లాడిన రమేశ్.. ఎజెండా లేకుండా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని విమర్శించారు. కాగా, ఈనెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేకం వెనుక ఆంతర్యం ఏమిటనేదానిపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే, జమిలి ఎన్నికల కోసం బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి) అమలు, ఒబిసి వర్గీకరణ వంటి అంశాలపై చర్చించడానికే ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమిలోని పలు భాగస్వామ్య పక్షాల నేతలు మంగళవారం భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్, డిఎంకె, ఎన్‌సిపి, సిపిఐ, సిపిఐ(ఎం), ఆప్, టిఎంసి, ఆర్‌జెడి, ఎస్‌పి, జెఎంఎం తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు.
ఎజెండా చెప్పకుండాపార్లమెంట్ సమావేశాలా?
RELATED ARTICLES