వేలంపాటలో రికార్డు ధర
45.33 ఎకరాలకు రూ.3,319.60 కోట్లు
కోకాపేట- నియోపోలిస్ ఫేజ్-2 వేలంలో సరికొత్త రికార్డు
నగర చరిత్రలోనే అత్యధికం
ప్రజాపక్షం/హైదరాబాద్ హైదరాబాద్‌లోని కోకాపేట భూములు వేలంలో అత్యధిక ధరతో మరోసారి కోట్లు కొల్లగొట్టాయి. నగర చరిత్రలోనే హెచ్‌ఎండిఎ కోకాపేట- నియోపోలిస్ ఫేజ్-2 వేలంలో అత్యధికంగా ఎకరం రూ.100 కోట్లకు పైగా ధర పలికింది. రికార్డు స్థాయిలో ధర పలకడం మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఏడు ప్లాట్లకు సంబంధించి 3.60 ఎకరాల నుండి 9.71 ఎకరాల వరకు విస్తీర్ణం కలిగిన మొత్తం 45.33 ఎకరాలకు గురువారం వేలం పాట నిర్వహించారు. ఈ ప్లాట్ల ప్రారంభ విలువ రూ.1,586.50 కాగా, వేలం పాటలో అందుకు రెట్టింపు ధర పలికి రికార్డు స్థాయిలో రూ.3,319.60 కోట్లు ప్రభుత్వానికి సమకూరనున్నాయి. వేలంలో అత్యధిక ధర రూ.100.75 కోట్లు పలికింది. సగటను ఎకరానికి రూ.35 కోట్ల ప్రారంభ ధరను నిర్దారించగా, వేలం పాటలో సగటున ఎకరానికి రూ.73.23 కోట్లు పలకడం విశేషం. నియో పోలిస్‌లో హెచ్‌ఎండిఎ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధరను నిర్ణయించింది. ఈ- వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీపడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర రూ.100 కోట్లు.. అత్యల్పంగా రూ.51.75 కోట్లు పలికింది. నియో పోలిస్ ఫేజ్-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్‌ఎండిఎకు రూ.1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గురువారం ఉదయం 26.86 ఎకరాలకు వేలం పూర్తయింది. సాయంత్రం నుంచి 10, 11, 14 నెంబరు ప్లాట్లకు (18.47 ఎకరాలకు) వేలం నిర్వహించారు. పదో నెంబరు ప్లాట్ అత్యధికంగా రూ.100 కోట్ల ధర పలికింది. 3.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాటు ఉంది. హైదరాబాద్ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్థిరాస్తి దిగ్గజ సంస్థల పోటీ చూస్తుంటే ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లాట్ల వేలం ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సిసి, మైహోం, రాజ్‌పుష్పా తదితర ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కోకాపేట భూముల ఈ వేలంలో పాల్గొన్నట్టు సమాచారం. కోకాపేటలో నియోపొలిస్ పేరుతో హెచ్‌ఎండిఎ 500 ఎకరాల్లో లేఅవుట్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.450 కోట్లతో రహదారులతోపాటు తాగునీరు, మురుగు నీటి వ్యవస్థ, భారీ కేబుళ్ల కోసం ప్రత్యేక మార్గం ఇతర అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. ఇప్పటికే తొలి విడత వేలంలో కొంత భూమిని విక్రయించగా రికార్డు స్థాయిలో ధర పలికింది. అత్యధికంగా ఎకరా రూ.60 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. అదే ఉత్సాహంతో మిగిలిన 45.33 ఎకరాలకు గురువారం ఈ-వేలం నిర్వహించింది.
ఎకరంరూ.100కోట్లు
RELATED ARTICLES