స్ట్రాంగ్ రూంల వద్ద రెండంచెల భద్రత
123 కౌంటింగ్ కేంద్రాలు, 5659 స్ట్రాంగ్ రూంలు
పునర్విభజన తర్వాతే మున్సిపల్ ఎన్నికలు
గత జూన్‌లోనే ఎన్నికల ఏర్పాట్లు ప్రారంభం
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ ; మండల పరిషత్ అధ్యక్ష్యులు, జిల్లా పరిషత్ చైర్మ న్ల ఎన్నికలు జులై 4, 5 తేదీల తర్వాతే ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో ఎంపిపిల కాలపరిమితి జులై 4వ తేదీతో ముగుస్తుందన్నారు. ఆ తర్వాతే ప్రస్తుతం కొత్తగా ఎన్నికైన వారు తొలి సమావేశం నిర్వహించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో జడ్‌పిల కాలపరిమితి జూలై 5వ తేదీతో ముగుస్తుందని ఆ తర్వాతే ప్రస్తుతం ఎంపికైన జడ్‌పిటిసిలు తమ తొలి సమావేశం నిర్వహించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో (ప్రస్తుతం ఈ జిల్లా నుంచి రెండు మండలాలు ములుగు, రెండు మండలాలు మహబూబాబాద్ జిల్లాలో కలిశాయి) ఎంపిపిల కాలపరిమితి ఆగ స్టు 5వ తేదీతో, జడ్‌పిటిసిల కాలపరిమితి ఆగస్టు 6వ తేదీతో ముగుస్తాయన్నారు. ఇక్కడ ఆ తేదీల తర్వాతే ఎంపిపి, జడ్‌పి చైర్మన్ల ఎన్నికలు నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. మున్సిపాల్టీల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను గతేడాది (2018) జూన్ నుంచి ప్రారంభించామన్నారు. పునర్విభజన ప్రక్రియ పూర్తయి, కొత్త వార్డుల ఏర్పాటు, ఓటర్ల జాబితా సిద్ధం అయిన తర్వాతనే మున్సిపాల్టీ ఎన్నికలు ఉంటాయన్నారు. ప్రస్తుతం మూడు విడతల్లో రాష్ట్రంలో మొత్తం 539 జడ్‌పిటిసి స్థానాలు, 5857 ఎంపిటిసి స్థానాలు ఉండగా వివిధ కారణాలతో 40 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదని, మిగిలిన 5817 స్థానాలకు ఎన్నికలను ప్రశాంతంగా ముగించామన్నా రు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఒక స్థానం బ్యాలెట్ పేపర్లు మరొక స్థానానికి తదితర చిన్న పొరపాట్ల కారణంగా, మూడు చోట్ల సాంకేతిక కారణాల కారణంగా ఏడు చోట్ల రీపోలింగ్ నిర్వహించాల్సి వచ్చిందన్నారు. బ్యాలెట్ పేపర్ల తారుమారు మాత్రం పోలింగ్ సిబ్బంది చేసిన తప్పిదమేనన్నారు. బ్యాలెట్ పేపర్లను 123 కౌంటింగ్ కేంద్రాలలో 5659 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. ఇక్కడ రెండంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. మే 27న కౌంటింగ్ నిర్వహిస్తామని, సాయంత్రం ఐదు గంటల లోపు కౌంటింగ్ పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. 978 కౌంటింగ్ హాళ్లు, 11882 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 23467 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను ఏర్పాటుచేశామన్నారు. కౌంటింగ్ మొదటి దశలో బ్యాలెట్ పత్రాల ప్రాథమిక లెక్కింపు, రెండో దశలో 20 నుంచి 25 చొప్పున బ్యాలెట్ పత్రాలను కలిపి ఒక బండిల్ తయారు చేసి ఒక బకెట్, లేదా డ్రమ్‌లో వేసి కలిపి అనంతరం లెక్కిస్తారన్నారు. ఒక్కోక రౌండ్‌లో వెయ్యి బ్యాలెట్ పత్రాలను లెక్కింపుకు ఇస్తారని చెప్పారు. కౌంటింగ్ పూర్తిని మాత్రం రిటర్నింగ్ ఆఫీసరే చేస్తారన్నారు. కౌంటింగ్ ప్రక్రియను ఏజెంట్లు స్పష్టంగా చూసే విధంగా సిటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు మొత్తం 1.56కోట్ల మంది ఓటర్లు ఉండగా మొత్తం 77.46శాతం ఓటింగ్ నమోదయిందని ఇది చాలా సంతృప్తినిచ్చిందన్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఇది తక్కువేనని, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ అని చెప్పారు. ఆసిఫాబాద్, నల్లగొడ జిల్లాల్లో ఒక్కొక్కటి, జగిత్యాల జిల్లాలో రెండు జడ్‌పిటిసి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు 32045 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచే యగా 2488 కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. 2879 రిటర్నింగ్ అధికారులను, 1.86 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు. 540604 మంది భద్రతా సిబ్బందిని, 15 మంది సాధారణ పరిశీలకులు, 37 మంది వ్యయ పరిశీలకులు, 520 మంది సహాయక వ్యయ పరిశీలకులు, 2832 మంది సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటుచేశామన్నారు. 65వేల బ్యాలట్ బాక్స్‌లు, 3.5కోట్ల బ్యాలట్ పేపర్లు, 42వేల ఇండిలిబులు ఇంక్ బాటిళ్లు, 1.60లక్షల పేపర్ సీళ్లు వినియోగించామని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో 331 సాధారణ ఫిర్యాదులు వచ్చాయననారు. రూ.1.04కోట్లు విలువ చేసే వస్తువులు సీజ్ చేశామన్నారు. 386 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా 359 మందిపై చర్యలు తీసుకున్నామన్నారు. రూ.10లక్షల నగదు పట్టుబడ్డ వ్యవహారం కోర్టులో ఉందని, తేలగానే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.