సామాజిక మాధ్యమాల మార్గదర్శకాలపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
సాంకేతికత ప్రమాదకర దిశకు మారిందని అభిప్రాయం
న్యూఢిల్లీ: సాంకేతికత ప్రమాదకర దిశకు మారిందని సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయపడింది. వ్యక్తుల గోప్యత, దేశ సార్వభౌమత్వానికి మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరముందంది. దేశంలో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయకుండా నిరోధించే మార్గదర్శకాలను రూపొందించేందుకు ఎంత సమ యం కావాలో మూడు వారాల్లోగా తెలుపాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిం ది. సామాజిక మాధ్యమాలలో నకిలీ వార్తలు, ఆన్‌లైన్ కంటెంట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరు సృష్టిస్తున్నారో కనిపెట్టలేకపోతున్నారని న్యాయమూర్తులు దీపక్ గుప్తా, అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన సాంకేతికత లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించింది. నకిలీ వార్తలు, తదితరాలు సృష్టించే సాంకేతికత ఉన్నప్పుడు, దానిని అడ్డుకునే సాంకేతికత కూడా ఉంటుందని అభిప్రాయపడింది. ఇప్పుడు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. సాంకేతిక అంశాలతో ముడిపడిన ఈ సమస్యను శాస్త్రీయంగా పరిష్కరించేందుకు హైకోర్టు, సుప్రీంకోర్టు తగిన వేదికలు కావని, ప్రభుత్వమే కలుగజేసుకుని తగిన మార్గదర్శకాలను రూపొందించాలని సూచించింది. మాధ్యమాలకు 12 అంకెల ఆధార్‌ను అనుసంధానించే అంశంపై మార్గదర్శకాలను రూపొందించాలనుకుంటున్నది, లేనిది తెలుపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో ఎవరు నకిలీ వార్తలు, కంటెంట్లు పెడుతున్నారో వీలయినంత త్వరగా గుర్తించే ఏర్పాట్లు చేయాలని కూడా కోర్టు సూచించింది. కేసు గుణదోషాల జోలికి కోర్టు వెళ్లదలచుకోలేదని, కాకపోతే ఫేస్‌బుక్ దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం విచారించి నిర్ణయిస్తామని పేర్కొంది. సోషల్ మీడియాకు ఆధార్‌ను అనుసంధానించే అన్ని పెండింగ్ కేసులను మద్రాస్, బాంబే, మధ్యప్రదేశ్ హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఫేస్‌బుక్ పిటిషన్ వేసింది. అయితే ఆ కేసులన్నింటినీ ఆ హైకోర్టుల నుంచి బదిలీచేయించేందుకు తమకేమి అభ్యంతరం లేదని కేంద్రం ధర్మాసనానికి తెలిపింది. ఫేస్‌బుక్, వాట్సాప్‌లు మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుకు వ్యతిరేకంగా రెండు అప్పీళ్లను చేసింది. అయితే తమిళనాడు ప్రభుత్వం ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా కంపెనీలు కేసులను బదిలీ కోరడమన్నది భారతీయ చట్టాలకు అనుగుణంగాలేదని వాదించింది. దీనివల్ల ‘చట్టరాహిత్యం పెరిగిపోతుంది’, ‘నేరాలు కనిపెట్టడం’ కష్టమవుతుంది అని వాదించింది. సోషల్ మీడియా ప్రొఫైళ్లకు ఆధార్‌ను అనుసంధానించాలన్న పిటిషన్లను మద్రాస్ హైకోర్టు విచారిస్తోంది. అయితే ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఉంది. సుప్రీంకోర్టు ఆగస్టు 20న ఇచ్చిన ఉత్తర్వు మేరకు మద్రాస్ హైకోర్టు పిటిషన్ల విచారణ తుది దశలో ఉన్నప్పటికీ వాయిదావేసిందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఈ సామాజిక మాధ్యమ కంపెనీలు భారత భూభాగంలో పనిచేస్తున్నప్పటికీ విదేశాల్లోని తమ ప్రధాన కార్యాలయాలకు ‘రోగేటరీ లెటర్’ పంపమని అధికారులను ఆదేశిస్తుంటాయని కూడా తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అనేక కేసుల్లో పూర్తి సమాచారం ఇవ్వడంలో కూడా ఆ కంపెనీలు విఫలమయ్యాయని వాదించింది.
కేసుల విచారణను బదిలీ చేయమని పెట్టుకున్న ఫేస్‌బుక్ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, గూగుల్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్, ఇతర సామాజిక కంపెనీల ప్రతిస్పందనను ఆగస్టు 20 సుప్రీంకోర్టు కోరిందన్నది ఇక్కడ గమనార్హం. వివిధ హైకోర్టులు వేర్వేరు అభిప్రాయాలను కలిగి ఉన్నాయని, కనుక అన్ని కేసులను బదిలీచేయాలని ఫేస్‌బుక్ వాదిస్తోంది. కాగా మూడో పార్టీకి వ్యక్తిగత డేటాను పంచుతారన్న భయాందోళనలు దేశవ్యాప్తంగా ఉంది.
ఎంత సమయం కావాలి?
RELATED ARTICLES