చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించిన రైతు సంఘాలు
‘ఢిల్లీ చలో’ ఆందోళనకు తాత్కాలిక విరామం
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రదిపాదనలు చేసింది. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం/ నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా (కెఎంఎం)కు చెందిన నాయకులతో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌లతో కూడిన కమిటీ జరిపిన నాలుగో విడత చర్చల్లో ఎలాంటి ఫలితం వెల్లడికాలేదు. అయితే, పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరలకు (ఎంఎస్‌పి) కొనుగోలు చేసేలా కేంద్రం ప్రణాళికలను రూపొందించింది. ఈ ఒప్పందం ఐదేళ్లపాటు అమల్లో ఉంటుందని పేర్కొంది. కాగా, కేంద్ర ప్రతిపాదనపై చర్చించి, నిర్ణయం వెల్లడిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. సోమ, మంగళ వారాల్లో చర్చలు జరగనున్న నేపథ్యంలో, ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఢిల్లీ చలో’ ఆందోళనకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. ఒకవేళ, ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరించకపోతే, 21వ తేదీ ఉదయం 11 గంటలకు తమ ఢిల్లీ మార్చ్ తిరిగి ప్రారంభమవుతుందని స్పష్టం చేశాయి. ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించడంతోపాటు, రైతు బీమా, పంట బీమా పథకాలను అమలు చేయాలని, మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఎస్‌కెఎం, కెఎంఎం ప్రధానంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళన ధాటికి తలవంచిన మోడీ ప్రభుత్వం మూడు సాగు చట్టాలను రద్దు చేసినప్పటికీ, ఎంఎస్‌పిపై చట్టం చేయడం తదితర లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలను ఇంత వరకూ నెరవేర్చలేదు. దీనితో ‘ఢిల్లీ చలో మార్చ్’ పేరుతో రైతు సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వగా, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్టాల సరిహద్దుల్లో భారీగా భద్రతా దళాలను మోహరించి, అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, కేంద్ర మంత్రులు ఈనెల 8, 12,15 తేదీల్లో మూడు పర్యాయాలు రైతు నేతలతో చర్చలు జరిపారు. కానీ, అవి అర్ధాంతరంగానే ముగిశాయి. నాలుగోవిడత చర్చలు ఆదివారం ఆదివారం రాత్రి 8.15 గంటలకు ప్రారంభమై, అర్థరాత్రి ఒంటిగంట దాటే వరకూ కొనసాగాయి. ఈ చర్చలో ఎంఎస్‌పిపై కేంద్ర మంత్రుల కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. ఐదేళ్లపాటు పంటల కొనుగోలకు సంబంధించిన ఒప్పందం చేసుకుంటామని తెలిపింది. ప్రభుత్వ సంస్థలు కీలక పంటలను ఎంఎస్‌పికి కొనుగోలు చేయడానికి పంచవర్ష ప్రణాళిక ప్రభుత్వ ప్రతిపాదనలో ఉందని కమిటీ వెల్లడించింది. నాఫెడ్ వంటి సహకార సంఘాలు రైతులతో ఐదేళ్ల ఒప్పందాలు కుదుర్చుకోవడం, పరిమాణ పరిమితులు లేకుండా ఎంఎస్‌పికి కొనుగోళ్లు జరిగేలా చూడటం వంటి పరిష్కారాలను తాము ప్రతిపాదించామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పరిమితి లేకుండా ఎంఎస్‌పి హామీలతో పప్పుధాన్యాలు, పత్తి, మొక్కజొన్నల్లో వైవిధ్యంపై దృష్టి సారించినట్లు గోయల్ వివరించారు. ఈ విధానం పంజాబ్ వ్యవసాయాన్ని కాపాడుతుందని, భూగర్భ జల మట్టాన్ని మెరుగుపరుస్తుందని, ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న భూమి బీడుగా మారకుండా కాపాడుతుందని ఆయన అన్నారు. కాగా, ఈ ప్రతిపాదనపై ముందుగా నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుంటామని, ఆ తర్వాత తమ ఫోరమ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. రుణమాఫీ తదితర డిమాండ్లపై చర్చ పెండింగ్‌లో ఉందని వారు అన్నారు. మరో రెండు రోజుల్లో అవి కూడా పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆందోళనకు తాత్కాలిక విరామాన్ని ఇస్తున్నామని వారు ప్రకటించారు.
ఎంఎస్‌పికి కొత్త ప్రతిపాదనలు
RELATED ARTICLES