ప్రజాపక్షం/హైదరాబాద్ ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన టిఆర్‌ఎస్ అభ్యర్థులు గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ డ్డి, వెంకట్రామిరెడ్డి ఎంఎల్‌సిలుగా ఎన్నికయ్యారు. శ్రామిక పార్టీ నుంచి మరో ఇద్దరు నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, స్క్రూటినీలో వాటిని తిరస్కరించారు. దీంతో టిఆర్‌ఎస్ అభ్యర్థులను ఎన్నికైనట్టు ప్రకటించారు. ఈ మేరకు వారికి రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రాలను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్‌సి శేరి సుభాష్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్నికైన ఎంఎల్‌సిలతో కలిసి కడియం శ్రీహరి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. ఎదుగుతున్న తెలంగాణను చూసి ఓర్వలేకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి, కేంద్రం అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. ఏడేళ్లలో మోడీ ప్రభుత్వ కాలంలో దేశ జిడిపి భారీగా తగ్గిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప పరిపాలన దక్షుడే అయితే దేశ జిడిపి ఎలా తగ్గిందో రాష్ట్ర బిజెపి నేతలు చెప్పాలని ఎద్దేవా చేశారు.
ఎంఎల్‌సిలు ఏకగ్రీవం
RELATED ARTICLES