సిపిఐ జాతీయ మహాసభలు ప్రారంభం
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏటుకూరి : పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సురవరం : అమరజ్యోతి ప్రజ్వలన చేసిన ఈడ్పుగంటి
ప్రజాపక్షం/ గురుదాస్ దాస్‌గుప్త నగర్ (విజయవాడ)
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 24వ జాతీయ మహాసభలు గురుదాస్ దాస్‌గుప్త నగర్ (ఎస్‌ఎస్ కన్వెన్షన్ విజయవాడ)లో శనివారం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణం లో ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ప్రజాప్రతినిధులు, వివిధ దేశాల నుంచి మహాసభలలో పాల్గొనడానికి వచ్చిన ప్రతినిధులు, అతిథులు, పార్టీ కార్యకర్తల ఆనందోత్సాహాలతో మహాసభల ప్రాంగణం ఉల్లాసభరితంగా కనిపించింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా జాతీయ పతాకాన్ని సీనియర్ కమ్యూనిస్టు ఏటుకూరి కృష్ణమూర్తి ఆవిష్కరించారు. సిపిఐ పతాకాన్ని పార్టీ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద విశాలాంధ్ర పూర్వ సంపాదకుడు, సీనియర్ కమ్యూనిస్టు ఈడ్పుగంటి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనం చేశారు. ప్రతినిధులు, అతిథులు, ఆహ్వానితులు ఈ సందర్భంగా పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులర్పించా రు. పార్టీ పతాకావిష్కరణకు ముందు రెడ్ షర్ట్ వలంటీర్, జనసేవాదళ్ కార్యకర్తల గౌరవ వందనాన్ని పార్టీ నేతలు స్వీకరించారు. ఈ సందర్భంగా.. సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఫాసిస్టు శక్తుల నుంచి ఈ దేశాన్ని రక్షించేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. బిజెపి మతోన్మాద చర్యలతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మతోన్మాద శక్తులను ఎదుర్కొనేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సిపిఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సిపిఐ నాయకులు పల్లవ్ సేన్ గుప్త, అతుల్‌కుమార్ అంజన్, అనీ రాజా, అమర్‌జిత్ కౌర్, బాలచందర్ కాంగో, సంతోష్‌కుమార్, బినయ్ విశ్వం, చాడ వెంకటరెడ్డి, సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ సిపిఎం నాయకులు మధు, వి. శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాల నాగేశ్వరరావు, జెవిఎస్‌ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలకు 16 దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు హాజరు కాగా 16 దేశాల నుంచి 17 మంది ప్రతినిధులు మహాసభకు హాజరయ్యారు. వివిధ దేశాల కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన వర్కర్స్ పార్టీ ప్రతినిధి కూడా మహాసభల్లో పాల్గొన్నారు. ఇతర దేశాల కమ్యూనిస్టు పార్టీలు సౌహార్థ సందేశాలను అందించాయి. అంతకు ముందు మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్ కె. నారాయణ, స్వాగతోపన్యాసం చేశారు.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
RELATED ARTICLES