కాళేశ్వరం పర్యావరణ అనుమతులపై ఎన్‌జిటి స్పష్టీకరణ
ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో చెప్పండి!
ప్రాజెక్టుతో సంభవించిన నష్టం అంచనాకు కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ : తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) తీవ్ర అభ్యంతరం చెప్పింది. పర్యావరణ అనుమతుల్లో ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరిగినట్లు పేర్కొం ది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం పూర్తునందున జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారని నిలదీసింది. ఈ నష్టాన్ని పూరించేందుకు చేపట్టాల్సి న ఉపశమన చర్యల అంచనాకు కమిటీ ఏర్పా టు చేస్తూ ఎన్‌జిటి ఆదేశాలు జారీ చేసింది. ఆమోదయోగ్యమైన సహాయ, పునరావాస చర్యలపై అంచనావేసేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖను ఎన్‌జిటి ఆదేశించింది. అలాగే, ర్యావరణ అనుమతులు లేకుం డా కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులు ముం దుకు సాగవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ తీర్పును వెలువరించింది. పర్యావరణ అనుమతులు సరైనవి కావంటూ హయాతుద్దీన్ పిటిషన్ దాఖలు చేయగా.. 21 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన కాళేశ్వరం విస్తరణ పనులకు పర్యావరణ అనుమతులు లేవంటూ వేములఘాట్ రైతులు ఎన్‌జిటిని ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పు కాపీని వైబ్‌సైట్‌లో పొందుపరిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో చట్టపరమైన ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని ఎన్‌జిటి స్పష్టం చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన పర్యావరణ అనుమతులు సాగునీటి అవసరాలకు సంబంధం లేనివి కాబట్టి అవి ఆమోదయోగ్యం కావని పేర్కొంది.తాగునీటి అవసరాలకు ప్రాజెక్టు అనుమతులు తీసుకున్నా.. సాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు రూపకల్పన చేశారని ఎన్జీటీ తెలిపింది. ఆ విషయాలను పరిగణలోకి తీసకోవడంలో కేంద్ర పర్యావరణ శాఖ విఫలమైందని.. పర్యావరణ మదింపు ప్రభావం సరిగా లేకుండా అనుమతులు ఇచ్చినట్లు పేర్కొంది. కాళేశ్వరం లాంటి బహుళార్ధసాధక ప్రాజెక్టుల్లో ఉల్లంఘనలు పునరావృతం కాకుండా ఉండేలా కేంద్ర పర్యావరణ శాఖ చర్యలు తీసుకోవాలని ఎన్‌జిటి ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు విస్తరణ పనులు చేపట్టరాదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.ఎత్తిపోత నీటి సామర్థ్యాన్ని 2టీఎంసీల నుంచి 3టీఎంసీలకు పెంచినా ప్రాజెక్టు సహా ఇతర విభాగాల్లో మార్పులు లేవన్న తెలంగాణ వాదనను ఎన్‌జిటి అంగీకరించలేదు. ఎక్కువ నీటిని ఎత్తిపోసే క్రమంలో ప్రాజెక్టు సామర్థ్యం, హైడ్రాలజీ వంటి అంశాలపై ప్రభావం పడుతుందని ఎన్‌జిటి పేర్కొంది. విస్తరణపై నిపుణుల కమిటీ అంచనా వేస్తుందని తెలిపింది. తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించే ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మించినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఎన్‌జిటి పేర్కొంది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నా.. పర్యావరణాన్ని పక్కన పెట్టలేమని.. ప్రజాప్రయోజనాలు, పర్యావరణం కలిసి నడవాల్సిందేనని ఎన్‌జిటి స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున పర్యావరణ అనుమతుల్లో ఉల్లంఘనలు, జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవల్చిన చర్యల అంచనాకు కమిటీ ఏర్పాటు అవసరమని ఎన్‌జిటి అభిప్రాయపడింది. ఈ మేరకు ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీని నెలరోజుల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ట్రిబ్యునల్ ఆదేశించింది. కమిటీ ఏర్పాటు తర్వాత ఆరునెలల్లో అధ్యయనం పూర్తి చేయాలని సూచించింది. నిర్వాసితులకు పరిహారం, పునరావసం అంశాలపై కూడా కమిటీ అధ్యయనం చేయాలని.. నిపుణుల కమిటీ అధ్యయన పురోగతిని కేంద్ర పర్యావరణ శాఖ పర్యవేక్షిస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. ప్రాజెక్టు ప్రభావితులు లేదా ఇతర సలహాలు, సూచనలు ఉంటే మూడు వారాల్లో కేంద్ర పర్యావరణ శాఖకు పంపేందుకు ఎన్‌జిటి అవకాశం కల్పించింది. కాగా, ఆగస్టు 7న కేంద్ర జలశక్తి మంత్రి, తెలంగాణ సీఎంకు రాసిన లేఖ ప్రకారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ప్రాజెక్టు డిపిఆర్ సమర్పించడం, అపెక్స్ కౌన్సిల్ అంగీకారం తెలిపేవరకు విస్తరణ పనులపై ముందుకు వెళ్లొద్దని ఆదేశాలను పాటించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. సిడబ్ల్యుసి ప్రకారం ప్రాజెక్టు విస్తరణ పనులకు పర్యావరణ అనుమతులు అవసరమన్న ఎన్జీటీ.. అవి లేకుండా విస్తరణ పనుల్లో ముందుకు వెళ్లలేరని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఇటీవల సీఎం కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లేఖను కేంద్రం పరిశీలించి నిర్ణయం తీసుకున్నాక దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్‌జిటి ర్పు వెలువడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇంకా స్పందించాల్సి వుంది.
ఉల్లంఘనే!
RELATED ARTICLES