ఒక్క రోజే 3,689 మందిని కాటేసిన కరోనా
మరో 3,92,488 పాజిటివ్‌లు నమోదు
33 లక్షల మార్క్ దాటిన యాక్టివ్ కేసులు
మూడవ దశ తొలి రోజున 86 వేల మందికి టీకాలు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వల్ల దేశంలో పరిస్థితులు రోజు రోజుకు మరింతగా దిగజారుతున్నాయి. మహమ్మారి ఉప్పెనలా విరుచుకుపడుతూనే ఉంది. నిత్యం వేలాదిమందిని బలి తీసుకుంటోంది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కొవిడ్ కోరల్లో చిక్కుకుంటున్నారు. ఫలితంగా ఒక్కో రాష్ట్రం ఆంక్షల చట్రలోకి వెళ్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూలు, వారాంతాల్లో లాక్డౌన్లు కొనసాగుతుండగా, మరి కొన్ని రాష్ట్రాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించారు. తాజాగా హర్యానా, ఒడిశా కూడా ఆ జాబితాలోకి చేరింది. దేశం నిత్యం దాదాపు 4 లక్షల పాజిటివ్‌లు బయటపడుతుండగా, నాలుగు వేలకు చేరువలో మరణాలు సంభవిస్తున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 33 లక్షల మార్క్‌ను దాటింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో 3,92,488 మందికి పాజిటివ్ వచ్చింది. క్రితం రోజున 4 లక్షలకుపైగా కేసులు నమోదుకాగా, తాజాగా కాస్త తగ్గాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,95,57,457కు చేరింది. కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. ఒక్క రోజు వ్యవధిలో మరో 3,689 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మహమ్మారి ప్రవేశించిన తరువాత ఒక్క రోజులో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,15,542కు పెరిగింది. కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. ప్రస్తుతం 33,49,644 యాక్టివ్ కేసులు ఉండగా, మొత్తం కేసుల్లో ఈ సంఖ్య 17.13 శాతానికి పెరిగింది. జాతీయ రికవరీ రేటు 81.77 శాతానికి పడిపోయింది. కొత్త కేసులతో పాటు వైరస్ నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటుండడం కాస్త ఊరటనిస్తుంది. గడిచిన 24 గంటల్లో 3,07,865 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. మొత్తం రికవరీల సంఖ్య 1,59,92,271కి చేరగా, మరణాల రేటు 1.10 శాతానికి పడిపోయింది. ఇప్పటి వరకు దేశంలో 29,01,42,339 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసిఎంఆర్ వెల్లడించింది. శనివారం 18,04,954 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.
మహమ్మారి రోజు రోజుకు మరింత ఉధృతరూపం
దేశంలో మహమ్మారి రోజురోజుకు ఉధృతరూపం దాల్చుతోంది. అనేక చోట్ల ఆంక్షలు ఉన్నా, టీకాల కార్యక్రమం కొనసాగుతున్నా వాయు వేగంతో వ్యాపిస్తోంది. తాజాగా 3.92 వేల మందికి పాజిటివ్ రాగా, అందులో 72.72 మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోనే వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 63,282 మంది, కర్నాటకలో 40,990, కేరళలో 39,636 మందికి వైరస్ సోకింది. యాక్టివ్ కేసుల సంఖ్య 33 లక్షల మార్క్‌ను దాటగా అందులో 81.22 శాతం 12 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 29 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, పాజిటివిటీరేటు 6.74 పెరిగినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా 3,689 మంది మృతి చెందగా, అందులో 76.01 శాతం పది రాష్ట్రాల్లోనే సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 802 మంది, ఢిల్లీలో 412, ఉత్తరప్రదేశ్‌లో 304, కర్నాటకలో 271, ఛత్తీగఢ్‌లో 229, గుజరాత్లో 172, రాజస్థాన్‌లో 160, జార్ఖండ్‌లో 169, తమిళనాడులో 147, పంజాబ్‌లో 138, హర్యానాలో 125, ఉత్తరాఖండ్‌లో 107, పశ్చిమ బెంగాల్లో 103, మధ్యప్రదేశ్‌లో 102 మంది చనిపోయారు. కొత్తగా 3.07 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా, అందులో 75.59 శాతం పది రాష్ట్రాల్లోనే రికవరీలు ఉన్నాయి.
మూడవ విడత వ్యాక్సినేషన్లో తొలి రోజు 86 వేల మందికి టీకాలు
దేశంలో 18 ఏళ్ల వారందరికీ మే 1వ తేదీ నుంచి కరోనా టీకాలు వేయడం ప్రారంభించగా, తొలి రోజున 11 రాష్ట్రాల వ్యాప్తంగా 86.023 మంది లబ్ధిదారులు వ్యాక్సిన్ వేసుకున్నట్లు మంత్రిత్వశాఖ ప్రకటించింది. అందులో ఛత్తీస్‌గఢ్‌లో 987, ఢిల్లీలో 1,472, గుజరాత్లో 51,622, జమ్మూకశ్మీర్‌లో 201, కర్నాటకలో 649, మహారాష్ట్రలో 12,525, ఒడిశాలో 97, పంజాబ్‌లో 298, రాజస్థాన్‌లో 1,853, తమిళనాడులో 527, యుపిలో 15,792 మంది ఉన్నారు. దేశంలో మొత్తంగా 15.68 కోట్ల మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా భారత్‌లో ఆదివారం ఉదయం 7 గంటల నాటికి మొత్తం 22,93,911 సెషన్లలో 15,68,16,031 మందికి టీకాలు వేశారు. అందులో 94,28,490 మంది ఆరోగ్య కార్యకర్తలు, 1,27,57,529 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోస్ తీసుకోగా, 62,65,397 మంది ఆరోగ్య కార్యకర్తలు, 69,22,093 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు రెండవ డోస్ తీసుకున్నారు. వీరే కాకుండా 45 ఏళ్ల వయస్సుగల వారు 5,32,80,976 మంది మొదటి డోస్ తీసుకోగా, 40,08,078 మంది రెండవ డోస్ తీసుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు 5,26,18,135 మంది మొదటి డోస్ తీసుకోగా, 1,14,49,310 మంది రెండవ డోస్ వేయించుకున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ, బీహార్, ఆంధ్రప్రదేశ్‌లో 67.00 శాతం డోస్‌లను పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16 తేదీన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, 106వ రోజైన శనివారం 18,26,219 మందికి టీకాలు వేశారు.
ఉప్పెనలా విరుచుకుపడుతోంది..
RELATED ARTICLES