HomeNewsLatest Newsఉపా రద్దుచేయాలి

ఉపా రద్దుచేయాలి

  • చట్టానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలి
  • దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూల్చేవిధంగా మోదీ వ్యవహారం
  • చట్టానికి కోరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం
  • సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శ
  • ఇందిరాపార్క్‌ వద్ద నిరసన దీక్ష

ప్రజాపక్షం/హైదరాబాద్‌
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూల్చేసేవిధంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. ఉపా చట్టంతో దుర్మార్గమైన హింసాకాండను అమలు చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామిక వాదులంతా ఏకతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో ఉపా చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉపా చట్టాన్ని రద్దు చేయాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ హైదరాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి పౌరహక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్‌ హరగోపాల్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి. నరసింహ, వి.ఎస్‌.బోస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్‌, ఎ.రవీంద్రచారి, సిపిఐ సీనియర్‌ నాయకురాలు పి.ప్రేమ్‌ పావని, సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు కె.యాదగిరి, బి.స్టాలిన్‌, కౌన్సిల్‌ సభ్యులు ఎం.ఆదిరెడ్డి, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌ కుమార్‌, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ నాయకులు భల్లా రవి, మానవ హక్కుల సంఘం నాయకులు అన్వర్‌ ఖాన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల కోసం పాటుపడాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపా చట్టానికి మోదీ ప్రభుత్వం మరింత విషపు కోరలు పెంచిందని విమర్శించారు. 90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్‌ సాయిబాబాను దుర్మార్గంగా పదేళ్లు జైల్లో పెట్టిందన్నారు. ఆయనపై దుర్మార్గమైన కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నియంతృత్వం ఉన్నంత వరకు దేశంలో కమ్యూనిజం ఉంటుందన్నారు. పౌరస్మృతి చట్టాలను తెచ్చి, ప్రశ్నించే గొంతులను ఉపా చట్టంతో మోదీ ప్రభుత్వం అణచివేస్తుందన్నారు. 10 ఏళ్ల మోదీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. రాజ్యాంగాన్ని మారుద్ధామని కుట్ర చేస్తున్నారని అన్నారు. ఉపా చట్టాన్ని నిర్బంధంగా అమలు చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడ కొనసాగుతుందని ప్రశ్నించారు. రాజ్యాంగ హక్కులు అమలు చేయడం లేదన్నారు. గౌరీ లంకేశ్‌ లాంటి వాళ్లను ఫాసిస్టు శక్తులు చంపేస్తున్నాయని అన్నారు. వరవరరావు పరిస్థితి ఘోరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని, దేశంలో నియంతృత్వం ఉన్నంత వరకు కమ్యూనిస్టులను అణచివేయలేరన్నారు. ప్రజాస్వామిక వాదులందరూ ఒకే వేదికమీదకు రావాలని, మోదీ మెడలు వంచి, ఉపా చట్టం రద్దు కోసం పోరాడాలని చాడ వెంకట్‌ రెడ్డి పిలుపునిచ్చారు.
సాయిబాబా మరణానికి కారణం ఎవరు? : ప్రొఫెసర్‌ హరగోపాల్‌
ప్రొఫెసర్‌ సాయిబాబా మరణానికి కారణం ఎవరని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ప్రశ్నించారు. ఉప చట్టానికి టైమ్‌ ప్రేమ్‌ లేదని, ట్రయల్‌ ఉండదు, బెయిల్‌ ఉండదని, దుర్మార్గమైన చట్టమని విమర్శించారు. ఉపా చట్టంలో అరెస్టు అయిన వారిలో కేవలం మూడు శాతం వరకే నేరాలు నిరూపించారని, 97 శాతం నిరూపణ కాలేదన్నారు. బీమా కోరేగామ్‌ కేసులో ట్రయల్‌ ప్రారంభం కాలేదన్నారు. వరవరావును జైలులో పెట్టారన్నారు. ఈ విషయంలో అప్పటి మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావును కలిశానని తెలిపారు. సాయిబాబాను పదేళ్లు జైలులో పెట్టారన్నారు. అనేకమంది రాజకీయ నేతలను కలిశామని తెలిపారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా చాలా ప్రయత్నాలు చేశారని చెప్పారు. చేతులు, కాళ్లు పనిచేయని సాయిబాబాను అండసెల్‌లో నిర్భందించి, తీవ్రంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయిబాబా చనిపోయిన తరువాత సమాజం నుంచి స్పందన వచ్చిందన్నారు. అరెస్టు అయినప్పుడు స్పందన వచ్చి ఉంటే బాగుడేందన్నారు. సాయిబాబాకు కొన్ని విశ్వాసాలు ఉన్నాయని, విశ్వాసాలు ఉంటే నేరం కాదన్నారు. సాయిబాబా మరణం రాజ్యం చేసిన కక్షనే అన్నారు. దేశంలో 300 లక్షల సంపద ఉంటే, 20 కోట్ల మంది ఆకలితో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉపా చట్టానికి స్థానం లేదన్నారు. ఉపా చట్టం ఉంటే ప్రజాస్వామ్యం లేదన్నారు. ఉపా చట్టం రద్దు అయ్యేంత వరకు పోరాటం కొనసాగించాలని హరగోపాల్‌ పిలుపునిచ్చారు.
అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఉపా చట్టం కేసులు : ఈ.టి.నరసింహ
అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఉపా చట్టాల కింద కేసులు పెడుతున్నారని, ఈ కేసుల్లో ఆరు నెలల వరకు కనీసం కేసు విచారణకు స్వీకరించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ.టి.నరసింహ అన్నారు. 90 శాతం వికలాంగుడైన సాయిబాబా జైళ్లోకి వెళ్లే ముందు ఆరోగ్యంగా ఉన్నారని, జైల్‌ నుంచి విడుదలైన తరువాత ఆయనకు 19 రకాల అనారోగ్య సమస్యల వచ్చాయన్నారు. పదేళ్ల తర్యాత సాయిబాబాపై మోపిన అభియోగాలు నిరూపణ కాకపోవడంతో ఆయన విడుదలయ్యారన్నారు. జైళ్లో అనారోగ్యానికి గురైన సాయిబాబా మరణించారని, ఆయన మరణానికి కారకులు ఎవరని ఈ.టి.నరసింహ ప్రశ్నించారు. దీనిపై ప్రజాస్వామిక వాదులు ఆలోచన చేయాలన్నారు. ఉపా చట్టాన్ని ఏ ప్రతిపాదికన పెడుతున్నారని అన్నారు. ఉపా చట్టంతో ప్రజాస్వామిక వాదులు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపా చట్టంతో అమాయకులు జైళ్లలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పద్దతుల్లో కేసులు పెడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని, మతాల మధ్య విభజన తేవడం తప్పా, ప్రజలను రెచ్చగొట్టడమే బిజెపి పని అని విమర్శించారు. ప్రజాస్వామిక వాదులందరూ ఏకమై బిజెపిని అడ్డుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉపా చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
దేశ ద్రోహం చట్టం కింద మోదీ, అమిత్‌షాలను అరెస్టు చేయాలి : వి.ఎస్‌.బోస్‌
ఉగ్రవాదం పేరిట నిరంకుశ చట్టాలు మోదీ ప్రభుత్వం అమలు చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్‌.బోస్‌ విమర్శించారు. ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. సామాజం కోసం పోరాటం చేసేవాళ్లు ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. ఆదానీ, అంబానీలు నిజమైన ఆర్థిక ఉగ్రవాదులని విమర్శించారు. దేశంలో ఉన్న సంపదను ఆదానీ, అంబానీలు దోచుకుంటున్నారని, ప్రశ్నించేవారిని ఉపా చట్టంతో జైళ్లలో అణచివేస్తున్నారని అన్నారు. సాయిబాబా తల్లి చనిపోతే బేయిల్‌ ఇవ్వలేదన్నారు. రేఫిస్టు, కూనికోరైనా డేరా బాబాకు బేయిల్‌ ఇచ్చారన్నారు. దేశ ద్రోహం చట్టం కింద మోదీ, అమిత్‌షాలను అరెస్టు చేయాలన్నారు. నిర్మల సీతారమన్‌ను ఉపా చట్టం కింద అరెస్టు చేయాలన్నారు. కెసిఆర్‌, కెటిఆర్‌, హరీశ్‌ రావులకు దమ్ముంటే ఉపా చట్టం రద్దు చేయాలని ధర్నా చేయాలన్నారు. ఉపా చట్టం రద్దు అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు నిర్లేకంటి శ్రీకాంత్‌, పడాల నళిని, శంషుద్దీన్‌, కాంపల్లి శ్రీనివాస్‌, ఓమర్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments