కేంద్రం పరిధిలోకి నిర్వహణ, నియంత్రణ
రెండుసార్లు ఫొటోలంటూ మడత పేచీ
ఏజెన్సీ అలవెన్సుల ఎగవేత
ప్రజాపక్షం/ ఖమ్మం పని దొరకక ఇబ్బందులు పడుతున్న రోజుల్లో పనులు కల్పించాలన్న డిమాండ్ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వినిపిస్తూనే ఉంది. చేసే వారికి పని చూపించాలన్న డిమాండ్‌పై దీర్ఘకాలిక పోరాటాలు జరిగాయి. ఎట్టకేలకు వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యుపిఏ-1 ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకు వచ్చింది. పని చేసే వారికి పని కల్పించడమే ఈ పథకం యొక్క ఉద్దేశ్యం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు లేని రోజుల్లో కూలీలకు పనులు కల్పించాల్సి ఉంది. ఈ పథకం ద్వారా 57.17 కోట్ల జాబ్‌కార్డులలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే 31 కోట్ల మంది కూలీలు మాత్రమే జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. గతేడాది దేశ వ్యాప్తంగా 368 కోట్ల పని దినాలను కల్పించారు. సగటున కేవలం రూ. 205 వేతనం సగటున ఇవ్వడం జరిగింది. పథకం ఏర్పడిన నాడు పని చేసే కూలీలకు సంబంధించి గడ్డపారకు 10 రూపాయలు, పార, తట్టకు ఐదు రూపాయలు, పని జరిగే చోట్ల తాగునీరు అందించేందుకు ప్రతి మనిషికి రెండు రూపాయలు ఖర్చు పెట్టేవారు. ఇటీవల కాలంలో దీనిని పూర్తిగా ఎత్తివేశారు. ఇక వేసవిలో పని చేస్తే ఉపాధి హామీ పథకం ప్రారంభించిన నాడు ప్రత్యేక అలవెన్సులను ఇచ్చే వారు. ఫిబ్రవరి మాసానికి సంబంధించి మూల వేతనంపై 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే మాసాలలో 30 శాతం అదనపు వేతనం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు దానిని పూర్తిగా ఎత్తివేశారు. మేట్లకు ప్రతి కూలీకి రెండు రూపాయల చొప్పున ఇచ్చేవారు. దానిని కూడా తొలగించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను అమలులోకి తీసుకు వచ్చింది. దీని ద్వారా మండల కార్యాలయాల నుంచి నేరుగా సమాచారం కేంద్రాలకు చేరుతుంది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి కూలీ ఉదయం, సాయంత్రం సమయాల్లో పని చేస్తున్న స్థలం నుంచి ఫోటోలు దిగి సంబంధిత సాప్ట్‌వేర్ ద్వారా మేట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో ఇది సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. అన్ని ప్రాంతాలలో నెట్‌వర్క్ కవరేజ్ లేకపోవడం, రెండవది మేట్ల వద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు లేకపోవడం కూడా గమనంలోకి తీసుకోలేదు. దీని వల్ల రూరల్ ఏరియాలో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలు ఇబ్బందులు పడడమే గాక వేతనాలు కూడా నష్టపోయే అవకాశం ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం రూ.18వేల కోట్లు బకాయిలు ఉండగా ఈ ఏడాది జాతీయ ఉపాధి హామీ పథకానికి కేవలం రూ.95వేల కోట్లను మాత్రమే కేటాయించారు. గతేడాది రూ.1.29 లక్షల కోట్లను కేటాయించగా ఈ ఏడాది కేటాయింపులను గణనీయంగా తగ్గించారు. ఈ ఏడాది కేటాయింపుల్లో బకాయిలను తీస్తే పని దినాలు చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు నెలలుగా జాతీయ ఉపాధి హామీ కార్మికులకు వేతనాలు అందడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్రం నుంచి సుమారు రూ.1,000 కోట్లు రావాల్సి ఉన్నట్లు సమాచారం. జాతీయ ఉపాధి హామీ పథకంలో మార్పులు కొత్త సాప్ట్‌వేర్ సిస్టంను అమలులోకి తీసుకు రావడం, కేటాయింపుల్లో కోత తదితర విషయాలను పరిగణలోకి తీసుకుంటే క్రమేపి కేంద్రం ఈ పథకం నుంచి వైదొలుగుతున్నట్లు కన్పిస్తుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికీ నిరుద్యోగం పెరిగిపోతుంది. చదువుకున్న యువత, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువశక్తి నిర్వీర్యం అవుతుంది. అంతర్జాతీయ గణాంకాలు కరువు ఛాయలను సూచిస్తున్న నేపథ్యంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో మార్పులు, తొలగించేందుకు చేసే ప్రయత్నాలను మానుకోవాలని కోరుతున్నారు.
‘ఉపాధి హామీ’కి తూట్లు
RELATED ARTICLES