వచ్చే ఏడాది నుంచే దేశవ్యాప్తంగా ప్రారంభం
హైదరాబాద్ : వ్యవసాయం దండగ కాదు, ఇక పండగ అనే పరిస్థితి దేశవ్యాప్తంగా ఉండాలన్న లక్ష్యంతో కేంద్రం ఒక ముందడుగు వేస్తోంది. వ్యవసాయ విద్య అంటేనే వెనుకడుగు వేసే యువతను ‘మేం వ్యవసాయ చదువులే చదువుతాం’ అనే విధంగా తయారు చేయాలని నిర్ణయించింది. ఇంజినీరింగ్, డాక్టర్, సివిల్స్‌వంటి వాటివైపు మొగ్గుచూపుతున్న యువతను కూడా వ్యవసాయ విద్యవైపు ఆకర్శించేలా కేంద్రం ప్రణాళికలు రచించింది. ప్రధానంగా ఇంజినీరింగ్, డాక్టర్, సివిల్స్ వంటి వాటికి సన్నద్ధత కాలేకపోతున్న గ్రామీణ యువతకు చక్కటి వ్యవసాయ విద్యను అందించి వెంటనే ఉపాధి అవకాశాలు కూడా లభించేలా ప్రణాళికలు తయారు చేసింది. ఇప్పటివరకు వ్యవసాయ విద్యలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆపై విద్యా కోర్సులే ఉండడం, అవి కూడా చాలా తక్కువ ఉండడంతో వ్యవసాయ విద్యవైపు వచ్చే వారు చాలా తక్కువ. అయితే వ్యవసాయమే ప్రధానమైన మన దేశంలో ఆ విద్యనే చదువుకున్న వారు లేక వ్యవసాయంలోనూ నూతన పోకడలను అందుకోలేకపోతున్నాం. దీనిని దూరం చేయాలని ఆలోచన చేసిన వ్యవసాయ విద్యలోనూ డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీని కోసం ఎప్పటి నుంచో కసరత్తులు మొదలు పెట్టిన కేంద్రం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కూడా సేకరించింది. ఎట్టకేలకు వ్యవసాయ డిప్లొమా కోర్సులకు ఒక రూపాన్ని ఇచ్చినట్లు సమాచారం. ఈ కోర్సులను దేశ వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు పూర్తి చేస్తోంది. దీని వల్ల గ్రామీణ యువతకు వారి గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు దొరికే అవకాశాలు మెరుగుకానున్నాయి. అగ్రి సర్వీసెస్ అండ్ బిజినెస్ బై హార్వెస్టింగ్ యూత్ త్రూ అగ్రికల్చర్ స్కిల్స్( అభ్యాస్) పేరుతో ఏడాది పాటు చేసే డిప్లొమా కోర్సును రూపొందించింది. వ్యవసాయంలో గ్రామీణ యువతను నిపుణులుగా తీర్చిదిద్ది వ్యవసాయానికి కొత్త ఊపు నివ్వడం కూడా దీని వల్ల నెరవేరుతుంది. అంతే కాదు పట్ణణాలకు వలసలు తప్పి గ్రామాలు వెలవెల పోకుండా కలకలలాడుతాయి. ప్రజలకు అవసరమైన ఆహార ఉత్పత్తులు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసర సరకుల ధరలు సామాన్యునికి అందుబాటులోకి వచ్చి ఆకలికేకలు తగ్గుతాయి. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూర్చే ఈ కోర్సును దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని ఐకార్ నిర్ణయించింది. ఈ కోర్సులో ఏడాది శిక్షణ అనంతరం శిక్షణ పొందిన యువతీయువకులు గ్రామాలు, మండల కేంద్రాల్లో భూసార పరీక్షా కేంద్రాలు, డయాగ్నొస్టిక్ లాబరేటరీస్ ఏర్పాటుచేసుకుని ఆయా సేవలు అందిస్తారు. అంతే కాదు వ్యవసాయ పరికరాలు, యంత్రాలు అద్దెకు ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటారు. అంతే కాదు విత్తన పరీక్ష ప్రయోగశాలలను ఏర్పాటుచేసుకోవడానికి వీరిని ప్రోత్సహిస్తారు. ఈ మేరకు వీరికి ఇందులో శిక్షణ కూడా ఇస్తారు. సేంద్రియ వ్యవసాయం, మొక్కల ఆరోగ్య యాజమాన్యం, సురక్షిత వ్యవసాయ సాగుపద్దతులపై రైతులకు సేవలందించడం కోసం కన్సల్టెన్సీలు ఏర్పాటుచేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. దీనిలో వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. నాణ్యమైన విత్తనాలు, సేంద్రియ ఎరువులు. పశువులకు దాణా వంటి వాటిని కూడా వీరు రైతులకు అందుబాటులో ఉంచుతారు. మొత్తం మీద ఆయా రంగాల్లో ఔత్సాహిక వ్యవసాయ పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా వీరిని తీర్చిదిద్దుతారు. రెండు,మూడేళ్లలో దేశ వ్యాప్తంగా కనీసం 50వేల మంది నిపుణులను తయారు చేయాలని ఐకార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అగ్రి డిప్లొమా కోర్సుకు డిగ్రి కోర్సు చేసిన వారిని అర్హులుగా నిర్ణయించింది ఐకార్. అంతే కాదు ఈ కోర్సులో చేరడం కోసం ప్రత్యేక ప్రవేశ పరీక్షను పెట్టాలని నిర్ణయించింది. ఎంపికైన విద్యార్థులకు ఐకార్ ద్వారా ఉపకారవేతనం కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కోర్సులో భాగంగా మొదటి మూడు నెలలు తరగతి గదిలో శిక్షణ ఇచ్చి ఈ సమయంలో నెలకు రూ. 15వేల చొప్పున ఉపకారవేతనం కూడా ఇవ్వాలని నిర్ణయించింది. మిగిలిన తొమ్మిది నెలలు గ్రామాల్లో రైతుల వద్దకు వెలుతారు.
ప్రతి విద్యార్థికి కనీసం రెండు, మూడు గ్రామ పంచాయతీలు అప్పగిస్తారు. వీరు రైతులకు వ్యవసాయంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పిస్తారు. దీంతో పాటు పొలం వద్దకే వెల్లడం వల్ల రైతులకు అవసరాలను నేరుగా గుర్తిస్తారు. దీంతో మున్ముందు వారు ఎదుర్కుంటున్న సమస్యలు, వారికి మున్ముందు ఎదురయ్యే సమస్యలను గుర్తించగలుగుతారు. తద్వారా వారి అవసరాలకు తగిన సలహాలు, తీసుకోవాల్సిన చర్యలను గుర్తించి తగు విధంగా సహాయం చేయగలుగుతారు. ఈ ఏడాది శిక్షణా సమయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కెవికె కేంద్రాలు వంటి సంస్థలకు వీరిని అనుసంధానం చేస్తారు.
ఉపాధికి బాటలు వ్యవసాయ డిప్లొమా కోర్సులు
RELATED ARTICLES