పసిపాప హత్యాచారం కేసులో నిందితుడు ప్రవీణ్‌కు మరణ శిక్ష
వరంగల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
ప్రజాపక్షం/వరంగల్: కామంతో కళ్లు మూసుకుపోయి న ఓ మానవమృగానికి వరంగల్ జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అభంశుభం ఎరుగని తొమ్మి ది నెలల చిన్నారిని తల్లి ఒడిలో నిద్రిస్తున్న సమయంలో అపహరించి, అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడుకి కోర్టు కఠిన శిక్ష విధించింది. కేవలం 50 రోజులు తిరగకుండానే ఆ కామాంధుడిని ఉరికంభం ఎక్కించాలని తీర్పునిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జూన్ 18న రాత్రి చోటు చేసుకుంది. హన్మకొండ కుమార్‌పల్లికి చెందిన జక్కోజు జగన్, రచన దంపతుల తొమ్మిదినెలల చిన్నారి శ్రీహితతో కలిసి అర్ధరాత్రి ఇంటి డాబా పై నిద్రిస్తున్న సమయంలో హన్మకొండలోని ఓ హోటల్‌లో పనిచేసే పోలెపాక ప్రవీణ్ చిన్నారిని ఎత్తుకెళ్లాడు. కొద్ది దూరం వెళ్లి నిర్జీవ ప్రదేశంలో అమానుష రీతిలో అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన అనంతరం చిన్నారిని ఒక టవల్‌లో చుట్టి భుజాన వేసుకొని పారిపోవడానికి ప్రయత్నాలు చేసే క్రమంలో పట్టుపడ్డాడు. తన ఒడిలో పడుకున్న చిన్నారి లేకపోవడం గమనించిన తల్లి రచన కుటుంబసభ్యులను, ఇరుగుపొరుగు వారిని లేపి వెతకడం ప్రారంభించింది. ఈ క్రమంలో భుజంపైన ఒక మూటలాగా వేసుకొని వెళ్తున్న ప్రవీణ్ వారిని చూసి చిన్నారిని కిందికి విసిరేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. పట్టుబడ్డ నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులకు అప్పగించిన స్థానికులు చిన్నారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాను అట్టుడికించింది. ఈ అమానుష ఘటనపై ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై నిందితుడిని తక్షణమే ఉరితీయాలంటూ.. పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలంటూ.. మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు వరుస ఆందోళన కార్యక్రమాలు చేపట్టి హోరెత్తించారు. హన్మకొండలో సుమారు 15 రోజులు వరుస ఈ ఆందోళనలు కొనసాగాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరంగల్ పోలీసులు నిందితునికి శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు కొనసాగించారు.